folk arts
-
పేదరికంతో పోరాడి.. వైకల్యంతో ఎదురీది.. విజేతగా నిలిచిన భాగ్య
ఆమె పేరులో భాగ్యం ఉంది. ఆ భాగ్యం జీవితంలో కొరవడింది. ఆమె పేదరికంతో పోరాడింది. శారీరక వైకల్యంతో ఎదురీదింది. సమాజంలో విజేతగా నిలిచింది. అభినందనలు అందుకుంటోంది. తమిళనటి, నర్తకి సుధాచంద్రన్ ఒక అద్భుతం. నాట్య మయూరిగా పేరు తెచ్చుకుంది. నెమలిలా నాట్యం చేసే ఆమెతో విధి వింత నాటకం ఆడింది. ఒక కాలిని తీసుకెళ్లింది. ఆమె నిర్ఘాంతపోయింది. నడవడమే కష్టం అనుకున్న స్థితి నుంచి కోలుకుని కృత్రిమ కాలితో నాట్యం చేసింది. మన తెలుగు నాట్య మయూరితో విధి మరింత ఘోరంగా ఆటలాడుకుంది. ఆమెను ఒక్క కాలితోనే భూమ్మీదకు పంపించింది. డాన్స్ చేయాలంటే రెండు కాళ్లు ఉంటే మంచిదే... కానీ లేదని ఊరుకోవడమెందుకు? ఒక కాలు లేకపోతేనేం... మరో కాలుందిగా... అంటూ డాన్స్ చేస్తోంది. ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం గెలిచాయి. తెలంగాణ జానపద కళలంటే ప్రాణం పెట్టే భాగ్య అందులోనే ఎం.ఏ చేస్తోంది. తన విజయగాధను సాక్షితో పంచుకుంది. బస్సులు మారలేక... ‘‘మాది మహబూబాబాద్ జిల్లా, గూడూరు గ్రామం. అమ్మ కూలిపనులకు వెళ్తుంది. నాన్న మేకలు కాస్తాడు. అన్న, నేను ఇద్దరం పిల్లలం. నేను పుట్టడమే ఒక విచిత్రం. బిడ్డ ఒక కాలు లేకుండా పుట్టిందని ఊరంతా వచ్చి చూశారట. ఆ తర్వాత నేను పెరగడం, చదువు, డాన్స్ నేర్చుకోవడం... అన్నీ విచిత్రంగానే గడిచాయి. సెవెన్త్ క్లాస్ వరకు వరంగల్ జిల్లా, నెక్కొండ మండలం, పెద్ద కొర్పోల్‌లో చదువుకున్నాను. ఆ తర్వాత హన్మకొండలో సాగింది. ఇంటర్ ప్రైవేట్ కాలేజ్‌లో చదివించడం డబ్బుండి కాదు. ప్రభుత్వ కాలేజ్‌కి రెండు బస్సులు మారి వెళ్లాల్సి ఉండింది. నేనలా వెళ్లలేనని ప్రైవేట్ కాలేజ్‌లో చేర్చారు. వరంగల్ ఆర్ట్స్ కాలేజ్‌లో డిగ్రీ చేసి, ఇప్పుడు హైదరాబాద్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద కళల్లో ఎం.ఏ. చేస్తున్నాను. ఇంతకీ నేను డాన్సర్‌గా మారిన వైనం మరీ విచిత్రం. బాలెన్స్కి నెల పట్టింది నేను నైన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు జరిగిందా విచిత్రం. ప్రముఖ డాన్సర్ లారెన్స్ మాస్టారి ఆలోచన నన్ను డాన్సర్‌ని చేసింది. ఆయన దగ్గర పని చేసిన ప్రశాంత్ మాస్టారు స్పెషల్లీ ఏబుల్డ్ పిల్లలకు డాన్స్ నేర్పించడానికి మేమున్న హాస్టల్‌కి కూడా వచ్చారు. అలా అప్పుడు వాళ్లు పదిమందికి పైగా స్టూడెంట్స్‌ని సేకరించి డాన్స్ క్లాసులు మొదలు పెట్టారు. వారిలో స్టేజ్ మీద ప్రదర్శనలిచ్చే స్థాయికి చేరింది ముగ్గురమే. అప్పటివరకు కర్ర లేకుండా నిలబడగలమనే ఊహ కూడా లేని వాళ్లమే అందరం. మొదట ఒక కాలి మీద దేహాన్ని బాలెన్స్ చేయడం సాధన చేశాం. బాలెన్స్ సాధించడానికి నెల పట్టింది. సినిమా పాటలు, జానపద నృత్యం, బతుకమ్మ పాటలు ప్రాక్టీస్ చేశాను. ఆ కోర్సు తర్వాత కూడా సొంతంగా కొన్ని పాటలకు సాధన చేశాను. టీవీ ప్రోగ్రామ్‌లలో కూడా డాన్స్ చేశాను. దసరా ఉత్సవాలు, వినాయక చవితి, ఇతర సమావేశాల్లో అవకాశాలను వెతుక్కుంటూ నాట్యం చేస్తున్నాను. శివరాత్రికి వేములవాడ రాజరాజేశ్వరస్వామి గుడిలో కూడా నాట్యం చేశాను. ఇక్కడ మరో విచిత్రం... ఏమిటంటే, సిట్టింగ్ వాలీబాల్ ఆడే అవకాశం వచ్చింది. ఈ ఆటకు మన దగ్గర పెద్దగా ఆదరణ లేదు. రాజస్థాన్, హర్యానా, తమిళనాడు, కర్నాటకల్లో జరిగిన పోటీలకు హాజరయ్యాను. థాయ్‌లాండ్‌లో జరిగే పోటీలకు ఎంపిక ప్రక్రియలో నెగ్గాను. మనదేశం తరఫున ఆడే అవకాశం వచ్చింది. కానీ కరోనా కారణంగా వెళ్లలేకపోయాను. తెలంగాణ ఆట పాట ఫోక్ ఆర్ట్స్ కోర్సులో భాగంగా డప్పు, జానపదగేయాలు, కర్రసాము, చెక్క భజన వంటి తెలంగాణ సంప్రదాయ కళలను నేర్చుకున్నాను. బతుకమ్మ పాటలను సేకరించి పాడాను. ఇతర పాటలు పాడే అవకాశాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. డాన్స్‌లో కూడా నిరూపించుకుంటాను. నాకు సీటు ఇచ్చేటప్పుడు సీటు వృథా అవుతుందేమోనని సందేహించిన యూనివర్సిటీనే ఇప్పుడు నాకు అండగా నిలిచింది. నేను ఎవరికీ భారం కాకూడదు, నా కాళ్ల మీద నేను నిలబడాలనే పట్టుదలే నన్ను ఇంతవరకు నడిపించింది’’ అని చెప్పింది భాగ్య. సవాళ్లను ఎదుర్కొనే మనోధైర్యం ఆమె సొంతం. ఆడపిల్లలకు ధైర్యం ఒకింత ఎక్కువగా ఉండాలని చెప్తోంది. బాలికలకు కర్రసాము నేర్పించి ధీరలుగా మలవాలనే ఆమె ఆశయం, జానపదానికి సేవ చేయాలనే ఆమె ఆకాంక్ష నెరవేరాలి. కొత్త అడుగులు ఎల్బీ స్టేడియంలో ఇచ్చిన ప్రదర్శన నా జీవితాన్ని కొత్తగా రాసింది. డిసెంబర్ మూడవ తేదీ ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్’. ఆ సందర్భంగా లాల్ బహదూర్ స్టేడియంలో నాలుగు రోజుల ముందు నుంచి ఆటలు, డాన్స్ ప్రోగ్రామ్‌లు జరిగాయి. నా డాన్స్ ఫొటోలు పేపర్లో వచ్చాయి. ఆ పేపర్ చూసి మా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కిషన్‌రావు సర్ నన్ను పిలిచి మాట్లాడారు. మా ఆర్థిక పరిస్థితి, గవర్నమెంట్ పెన్షన్‌తో హాస్టల్ ఫీజు కట్టుకుంటూ చదువుకుంటున్నానని తెలుసుకుని ఆయన చలించిపోయారు. ఆయన ఎవరెవరితో మాట్లాడారో తెలియదు, వీసీ సర్, రిజిస్ట్రార్ సర్ కలిసి మూడు లక్షల నిధులు సేకరించి, జర్మనీ నుంచి డాన్స్ చేయడానికి వీలుగా ఉండే ప్రోస్థటిక్ లెగ్‌ను తెప్పించి పెట్టించారు. ఇప్పుడు ఆ కాలితో నడక ప్రాక్టీస్ చేస్తున్నాను. నడక మీద పట్టు వచ్చిన తర్వాత డాన్స్ చేస్తాను. – వాకా మంజులారెడ్డి -
ఆది ధ్వనికి... ఆతిథ్యం
సాక్షి, హైదరాబాద్: ఆదివాసి నగరా, గోండుతుడుం, కోయ డోలు,బుర్ర వీణ,మట్టి ఢంకా,అదివాసి మద్దెల ఇంకా చెక్క చెమిడికలు.. ఇలా ఒకటా..రెండా ఏకంగా అరుదైన 124 గిరిజన సంగీత వాయిద్యాలన్నీ ఒకే చోట దర్శనమివ్వను న్నాయి. వందల ఏళ్ల గోండు గూడేలు,ఆదివాసి పల్లెలకు సంగీత ఆహ్లాదం పంచి క్రమంగా కనుమరుగవుతున్న వాయిద్యాలన్నీ 9వ తేదీ నుంచి మాదాపూర్‌లోని స్టేట్‌ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించనున్నారు. తెలంగాణ ఆది ధ్వని వేదిక ఆధ్వర్యంలో 13వ తేదీ వరకు సాగే ప్రదర్శనలో కనుమరుగైన అనేక సంగీత వాయిద్య పరికరాలను ప్రదర్శనగా ఉంచుతారు. పరికరాలతో ఆదివాసి కిన్నెర,బుర్రవీణ, రుంజ తదితర ఎనిమిది రకాల వాయిద్యాలను సైతం ప్రదర్శించే కళాకారులు ఈ వేదికపై పాలుపంచుకోనున్నారు. ఈ విషయమై నిర్వాహకులు ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు ‘సాక్షి’ తో మాట్లాడుతూ ఆదిలాబాద్,ఖమ్మం, బస్తర్ జిల్లాల్లో వినియోగించిన సంగీత పరికరాలన్నీ ప్రదర్శనలో ఉంచుతామని తెలిపారు. దేశంలో అతిపెద్ద గిరిజన సంగీత ప్రదర్శన దీన్ని పేర్కొనవచ్చని జయధీర్ చెప్పారు. -
సీమ ముఖద్వారంలో జానపద చైతన్యం
సాక్షి, కర్నూలు : అక్షర జ్ఞానం లేని పల్లె ప్రజల మాట, ఆట, పాటలే జానపద కళారూపాలు. వీటికి ప్రత్యేకమైన లయ, రాగం, తాళం వంటివేవీ ఉండవు. నోటికి వచ్చింది పాడుకోవడమే జానపదం. పల్లె ప్రజలు తమ ముంగిట రాశులు పోసుకున్న సంస్కృతే ఈ జానపద కళారూపాలు. ప్రకృతి ఒడిలో అడుగిడిన ప్రతి జనపదుని పాదం నుంచి జానపదం పుట్టింది. జనపదం అంటే గ్రామం. జానపదులంటే గ్రామీణులు. మానసిక ఉల్లాసానికి, శారీరక శ్రమ మరిచిపోవడానికి, తమ బాగోగులు చెప్పుకోవడానికి రూపొందించుకున్నవే జానపద కళా రూపాలు. నేడు ‘అంతర్జాతీయ జానపద కళల దినోత్సవం’. ఈ సందర్భంగా జిల్లాలో ప్రాచుర్యంలో ఉన్న జానపద కళా రూపాల గురించి తెలుసుకుందాం.. గొరవయ్యలు.. జిల్లాకే ప్రత్యేకం వీరశైవాన్ని ప్రచారం చేయడానికి అనేక కళా రూపాలు వచ్చాయి. అణిచివేత నుంచి బయట పడటానికి అనేక కులాలు వీరశైవాన్ని అవలంబించాయి. కులపురాణం ప్రకారం కురవ, గొల్లలు గురువులుగా భావించే గొరవయ్యలు అలా శైవాన్ని తీసుకున్నారనే ప్రచారం ఉంది. జంగమ దేవరల్లాగే వీరు కూడా గతంలో సంచార జాతులు. ఏటా దసరాకు ఆలూరు తాలుకా నెరణికి గ్రామంలో మల్లయ్య, మల్లేశ్వరుడిని కొలుస్తారు. తమ పిల్లలకు గొరవయ్యగా దీక్షి ఇప్పిస్తారు. దీక్షలిచ్చే గురువులు పూజారులే. దీక్షాదానం పొందిన వారికే నృత్యం నేర్పుతారు. లింగముద్రవేస్తారు. గొరవయ్యల వేషం జంగమదేవరలను పోలి ఉంటుంది. తలపై ఎలుగు బంటి చర్మంతో చేసిన కిరీటం, కిరీటంపై శివలింగం, త్రిశూలం, చంద్రుడు వగైరా చిత్రించి ఉంటాయి. నడముకు కట్టు, జింకచర్మం సంచి ఉంటాయి. నల్లగొంగడిని ధరిస్తారు. భుజాలపై రంగురంగుల కండువాలు వేసి వీటిని నడుం కట్టులో బిగిస్తారు. అడ్డనామాలు, చేతులకు రుద్రాక్షలు ఉంటాయి. ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో ఢమరుకం, నోట్లో పిల్లనగ్రోవి, కాళ్లకు గజ్జెలు ఉంటాయి. నృత్యం ప్రారంభంలోనో, ముగింపులోనో పాటలు పాడతారు. పత్తికొండ, ఆదోని, ఆలూరు, హోసూరు, ప్రాంతాల్లో ఉన్న ఈ కళాకారుల్ని జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి వారి సొంత జిల్లా కరీంనగర్లో జిల్లా సాంస్కృతిక మేళాకు ఆహ్వానించి, ప్రత్యేకంగా సత్కరించారు. గొరవయ్యలకు శ్రీశైలంలో విశేష ప్రాధాన్యత ఉంది. నందికోలు సేవ.. కోల అంటే కర్ర. నంది బొమ్మలు చివరన ఉండే రెండు కర్రల (వెదురుబొంగులు) మధ్య పిడి ఉంటుంది. భక్తులు ఒక నందికోలని భుజాన ఎత్తుకొని పార్వతీ పరమేశ్వరులను స్తుతిస్తూ ‘అశ్శరభ, శరభ’ అంటూ ఖడ్గాలను చదువుతూ తదనుగుణంగా అడుగులు వేస్తూ భావావేశంతో భక్తి పార వశ్యంతో ఊగిపోతుంటారు. దవడకు, నాలుకకు సూది గుచ్చుకుంటారు. ఈ కళారూపాన్ని శివరాత్రి పండుగ సందర్భంగా శైవుల పెళ్లిళ్ల సంప్రదాయానికి చెందిన తొగట వీర క్షత్రియులు, పద్మసాలేవాళ్లు ప్రదర్శిస్తుంటారు. కర్నూలు, ఎమ్మిగనూరు, కోడుమూరు, పోలకల్, గూడూరు, నందవరం, కల్లూరు ప్రాంతాల్లో ఈ కళ ఉంది. తోలు బొమ్మలాట.. ఇది జిల్లా ప్రజలకు ప్రత్యేకమైన కళారూపం. జిల్లాలో ఎన్నో కుటుంబాల వారు తోలు బొమ్మలాడించి ప్రజలకు వినోదాన్ని అందించి జీవించారు. ఇది చాలా ప్రాచీన కళ. నాటకానికి ప్రాథమిక రూపం. రామాయణ భారత, భాగవతాల్లోని పాత్రలను తోలు బొమ్మలుగా తయారు చేసి పలుచటి వస్త్రాన్ని తెరగా జేసి తెరవెనక నుంచి బొమ్మలను ఆడిస్తూ, దీపం పెట్టడం ద్వారా చీకట్లో బొమ్మలను కాంతి వంతంగా చూపడం ద్వారా అద్భుత దృశ్యాలను ఆవిష్కరింపచేస్తారు. ఈ బొమ్మలాటలో సూత్రధారి, బంగారక్క, కేతిగాడు, జుట్టుపోలిగాడు అనే పాత్రలు ఉంటాయి. రామాయణంలోని సీత పాతివ్రత్యం, రావణుని దుర్మార్గం, రామలక్ష్మణుల అనుబంధం హృదయాలకు హత్తుకునేలా ప్రదర్శించడం తోలు బొమ్మలాట ప్రత్యేకత. బీరప్పడోలు.. బీరప్పడోలు కళా రూపం కూడా శైవ మత ప్రచారంలో భాగంగానే వచ్చింది. బీరప్పడోలు ఒక పెద్ద ఢక్క ఆకారంలో ఉంటుంది. ఈ కళా రూపం ఎక్కువగా నందికొట్కూరు, పగిడ్యాల, మిడుతూరు పాముపాలడు, పత్తికొండ, డోన్, ఓర్వకల్ మండలాల్లో ప్రదర్శిస్తుంటారు. భాషా పరిజ్ఞానంతో పాత్రోచితంగా పద్యాలు, పాటలు పాడుతారు. చెక్క భజన.. పది నుంచి నుంచి ఇరవై మంది కళాకారులతో కూడిన బృందాలు ఉంటాయి. భక్తిరస పాటలు పాడుతూ రెండు చెక్కలను ఒకే చేత్తో పట్టుకొని లయబద్ధంగా శబ్దం చేస్తారు. ప్రధాన గాయకుడు, ఆయన పాటకు డోలు లేదా డప్పు వాయిస్తారు. ఇప్పుడు భక్తిపాటలే కాదు ప్రభుత్వ కార్యక్రమాల ప్రచార గీతాలు కూడా చెక్క భజనల్లో చోటు చేసుకుంటున్నాయి. బుర్ర కథ.. తరతరాల సంస్కృతికి వారధిగా జానపదుల భావాలకు వాహికగా ప్రత్యేకతను సంతరించుకున్న జాపద కళారూపం బుర్రకథ. ఒక శృంగార భావం, ఒక ఆధ్యాత్మిక చింతన, ఒక బాధ, ఒక విషాద ఘటన జానపద గేయంగా రూపెత్తితే ఒక వీరగాథ ఒక దైన్య జీవితం, ఒక సామాజిక ఉద్యమం, ఒక దేవుని మహత్మ్యం గేయరూపంగా వచనంతో జతగా కొన్ని గంటల పాటు పాడుకునే జానపద గేయ గాథ బుర్రకథ. తుంబర తీగలు మీటుతూ ప్రధాన కథకుడు కథా గానం చేస్తుంటే ఆ విశేషాలు జనం అర్థం చేసుకోడానికి మధ్య మధ్య కథకున్ని సందేహాలు అడుగుతూ విషయాన్ని వివరించడానికి హాస్య సృష్టికి ప్రయత్నాలు చేసే ఇద్దరు వంతలుంలటారు. వీరిలో ఒకతను హాస్యపాత్ర వహిస్తాడు. అయితే ఇద్దరు వంతలు గుమ్మెట అనే వాయిద్యంపై పాటగాడికి లయసహకారం చేస్తారు. ఈ కథలు మొదట్లో భక్తిగాథలు, దేవుళ్ల లీలలు కథలుగా చెప్పగా తరువాత వీరగాథలు ప్రచారం చేయడానికి తోడ్పడ్డాయి. మన జిల్లాలో తొలి తిరుగుబాటు దారుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, మహాదాత బుడ్డా వెంగళరెడ్డి, దైవందిన్నె సంస్థానం వాళ్లపైనా, ఆదోని ప్రాంతానికి చెందిన ఆరె మరాఠీలపైనా కథలు ఉన్నాయి. నాగరాజు దళం, వెలుగోడు శాస్త్రి, బొల్లారం సుంకులు, నందికొట్కూరు తాటికొండ జమ్మన్న, కర్నూలు బుధవారపేట దూపం భవానయ్య, దీపక్ వేణు, దూపం ప్రసాద్, బజారన్న లాంటివారు ప్రసిద్ధ కళాకారులుగా గుర్తింపు పొందారు. హరి కథ.. సర్వకళల సమాహారం హరికథ. పురాణ పఠనానికి సంగీత పరిజ్ఞానం మేళవిస్తే హరికథ. చేతిలో చిడతలు, కాళ్లకు గజ్జెలు, పట్టు పీతాంబరాలు, మెడలో దండ, నుదట బొట్టుతో హరికథకుని వేషం ఉంటుంది. హరికథ అన్ని జానపద కళారూపాలతో పాటు ప్రజాదరణ పొందింది. దీనిలో ఒకే వ్యక్తి అన్ని పాత్రలద్లనూ రసవత్తరంగా నటిస్తాడు. ఆకర్షణీయమైన ఆహార్యంతో నోటితో వాచికం చెబుతూ మృధుమధురంగా గానం చేస్తూ ముఖంలో సాత్వికం, కాలితో నృత్యం, చేతులతో ఆంగికం ప్రదర్శిస్తాడు. ఇలాంటి హరికథలు చక్కగా చెప్పడంలో నందికొట్కూరు తాలుకా నెహ్రూనగర్‌కు చెందిన వై.నాగభూషణం పేరుగాంచారు. కోలాటం.. చిన్న కర్ర ముక్కలను చక్కగా చెక్కి, వాటికి రంగులు వేసి రెండు చేతులా రెండు కర్రలు పట్టుకొని కొంత మంది కళాకారులు తాళం వేస్తూ ఆడుతూ పాడుతూ పలు విన్యాసాలను ప్రదర్శిస్తారు. కొన్ని సార్లు ఈ కర్రలకు తాళ్లు కట్టి ఆ తాళ్ల కొసలన్నీ ఎత్తున ఒక కొమ్మకు కట్టి వేసి కర్రలతో ఆడుతూ పాడుతూ ఆ తాళ్లన్నీ పేనుకొనేలా ఒక జడలా అల్లుకొనేలా చేయడం, అప్రదక్షిణంగా తిరుగుతూ ఆ ముడిని విప్పేలా కోలాటాలు సాంగిచడాన్ని జడ కోలాటం అంటారు. కోలాటంలో దేవుని ఊరేగింపు ముందు సంప్రదాయ గీతాల నుంచి అధునాతన సినిమా పాటల వరకు పాడుతుంటారు. పల్లెటూళ్లలో భజన పాటలు పాడడం, అందుకనుగుణంగా చిందులు వేయడం, పండుగలు పబ్బాల్లో సరదాగా పాటలు పాడుతూ ఈ కోలాటం వేస్తారు. ఈ కళ జిల్లా అంతటా ఉంది. లంబాడీ నృత్యం ఆళ్లగడ్డ, నంద్యాల, ఆత్మకూరు ప్రాంతాలతో పాటు పత్తికొండ, పాణ్యం, ఓర్వకల్ మండలంలోని తండాల్లోని సుగాలీలు, లంబాడీలు లంబాడీ నృత్యం చేస్తారు. లంబాడీ నృత్యం వారి జీవన సరళిలో భాగం. హోలీ సందర్భంగా గ్రామాల్లో లంబాడీ నృత్యం చేస్తూ భత్యం సేకరిస్తుంటారు. జానపద నృత్య పోటీలు అనగానే ‘అరె హోర హోర’ అని పాడుతూ బంజారా నృత్యాలు చేస్తుంటారు. చేతులతో అభినయం చూపుతూ కూర్చుంటూ, లేస్తూ బృందమంతా ఒకేసారి ఆ విన్యాసాలను గుంపుగా చేస్తుంటే కనువిందుగా ఉంటుంది. దుస్తులు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. పత్తికొండ ప్రాంతానికి చెందిన శంకరమ్మ బృందం ఆ నాటి ముఖ్యమంత్రి చేత సన్మానం అందుకోవడం జిల్లాకే గర్వకారణం. కళలను కాపాడుకోవాలి కళలను కాపాడుకోవాల్సి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. జానపదాన్ని కాపాడుకుంటే సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకున్న వాళ్లమవుతాం. తెలుగు భాష మనుగడ జానపద కళా రూపాల రక్షణ ద్వారానే సాధ్యమవుతుంది. జానపద కళలను భావితరాలకు తెలియజేయాలి. – డాక్టర్ వి.పోతన్న, జానపద కవి జానపద కళలను ప్రభుత్వం ప్రోత్సహించాలి గ్రామీణులకు విజ్ఞానాన్ని వినోదాన్ని అందించడానికి జానపద కళారూపాలు ఏర్పడ్డాయి. కొన్ని వైయుక్తికంగా ఉంటాయి. కళలు దైవ దత్తం. సమాజానికి మార్గదర్శనం చేస్తాయి. అప్పట్లో వామపక్ష పార్టీల నాయకులు ప్రజలను చైతన్యం చేయడానికి బుర్ర కథలను ఆయుధంగా చేసుకున్నారు. ఆచార వ్యవహారాలకు నిలయంగా ఉన్న ఈ కళలు ఆదరణ కోల్పోతున్నాయి. వీటిని కాపాడుకోవాల్సిన అవసరముంది. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని కళలను ప్రోత్సహించాలి. – మధురకవి ఎలమర్తి రమణయ్య -
తెలంగాణ జానపద కళల ఖజానా
రాష్ట్ర భాషా సాంస్కృతికSశాఖ డైరెక్టర్ హరికృష్ణ ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శనలు హన్మకొండ కల్చరల్ : తెలంగాణ జానపద కళలకు ఖజానా వంటిదని రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ జానపద కళలకు, కళాకారులకు సముచిత స్థానం కల్పించారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, జిల్లా సమాచార పౌర సంబంధాలశాఖ సౌజన్యంతో తెలంగాణ రాష్ట్ర జానపదుల కళాకారుల సంఘం వరంగల్ అధ్వర్వంలో గురువా రం ప్రపంచ జానపద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం హన్మకొండ వేయిస్తంభాల దేవాలయం నుంచి 500 మంది కళాకారులు మహార్యాలీ నిర్వహించారు. అలాగే పలు ప్రదర్శనలు చేపట్టి ఆకట్టుకున్నారు. అనంతరం అంబేద్కర్ భవన్ సాయంత్రం 7 గంటలకు జరి గిన సమావేశంలో మామిడి హరికృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ కళాకారులు నిర్లక్ష్యానికి గురయ్యారని తెలి పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాౖటెన తర్వాత తెలంగాణ కళలు వికసిస్తున్నాయన్నారు. ప్రపంచమంతటా ఒక రోజు మాత్రమే జానపద దినోత్సవాన్ని జరుపుకుంటుండగా.. తెలంగాణలో పది రోజుల పాటు సంబురాలు జరుపుకోవడం చరిత్రలో మొదటి సారి అన్నారు. నిరాదరణకు గురవుతున్న కళాకారులు, కళాకారుల వాయిద్యాలు మళ్లీ మోగుతున్నాయన్నారు. వృద్ధ కళాకారులకు పింఛన్, గుర్తింపు, హెల్త్ కార్డులు ఇవ్వడంతోపాటు ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. మంత్రులు రసమయి బాలకిషన్, అజ్మీరా చందూలాల్, ప్రభుత్వ కార్యదర్శి బుర్ర వెంకటేశం, ప్రభుత్వ సలహాదారు రమణా చారి కళాకారులను ఎంతో ప్రోత్సహిస్తున్నారన్నారు. సమాచార పౌరసంబంధాలశాఖ డీడీ డీఎస్ జగన్ మాట్లాడుతూ జిల్లాలో 96 మంది సాంస్కృతిక సారథి కళాకారులు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నారన్నారు. అనంతరం పలువురు కళాకారులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో అడిషనల్ జాయింట్ కలెక్టర్ తిరుపతిరావు, జిల్లా సాంస్కృతిక మండలి సభ్యుడు, జానపద కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షుడు బూర విద్యాసాగర్, అధ్యక్షుడు గడ్డం సుధాకర్, వంగSశ్రీనివాస్, చుంచు లింగయ్య, రాష్ట్ర ప్రతినిధులు సింగారపు జనార్దన్, యాదగిరి ప్రసాద్, అరూరి కుమార్, రామస్వామి, టీఎస్ఎస్ కోఆర్డినేటర్ దారా దేవేందర్, కవి అన్వర్, సినీ దర్శకుడు సంగ కుమార్, మేజిషియన్ మార్త రవి, మిమిక్రీ కళాకారులు మనోజ్‌కుమార్, ఆలేటి శ్యామ్, వరంగల్ శ్రీనివాస్, తదితరలు పాల్గొన్నారు. -
జానపదం.. ఆరోప్రాణం
పులివెందుల టౌన్ :జానపద కళలంటే ఆయనకు ఎనలేని మక్కువ.. వాటికోసం అహర్నిశలు కష్టపడుతుంటాడు. ఎందరినో కళాకారులుగా తీర్చిదిద్ది ఎన్నో ప్రదర్శనలు ఇప్పించిన ఘనత ఆయనది. ఆయనే పులివెందుల జానపద కళాకారుడు రామాపురం సురేష్‌కుమార్. ఆంధ్రప్రదేశ్ జానపద కళాకారుల సంఘం ప్రచార కార్యదర్శిగా ఉంటూ జానపద కళలను ప్రోత్సహిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ప్రశంశలు పొందాడు. గురువు బిగిచెర్ల కృష్ణారెడ్డి పర్యవేక్షణలో చదువుకుంటూ ఎంతో మంది జానపద కళాకారులను తయారుచేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చి తన సత్తా చాటుకున్నాడు. ఎంతో మంది ప్రముఖుల చేతుల మీదుగా ప్రశంశలు అందుకున్నాడు. స్వామి వివేకానంద పాఠశాల డైరెక్టర్ సోమశేఖర్‌రెడ్డి సహకారంతో హైదరాబాదు పోట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీలో ఎంఏ జానపద కళలు పూర్తి చేసి ఎంఫిల్ పూర్తి చేశాడు. పులివెందుల స్వామి వివేకానంద పాఠశాలలోనే శృతి కళాక్షేత్రాన్ని పెట్టి చిన్నారులకు జానపద నృత్యాలపట్ల ఆసక్తి పెంచుతూ శిక్షణ ఇస్తున్నాడు. జానపద కళలపై పుస్తకాలు రాయడం ప్రారంభించాడు. ఎన్నో టీవీ షోలలో కూడా జానపద నృత్య ప్రదర్శనలు ఇచ్చి మంచి ప్రతిభ చూపించారు. జానపద కళలపై తనకున్న మక్కువతో 3 వేల మందికి పైగా కళాకారులను తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా కర్నాటక, తమిళనాడు, కేరళ దక్షిణాది రాష్ట్రాలలో జానపదం, భరతనాట్యంలో శిక్షణ ఇచ్చి కళాకారులను తీర్చిదిద్దారు. ప్రముఖుల చేతులమీదుగా 600వందలకు పైగా అవార్డులు అందుకున్నారు. జానపథ కళలను ప్రభుత్వం ప్రోత్సహించాలని సురేష్‌కుమార్ కోరుతున్నారు.