సాక్షి, కర్నూలు : అక్షర జ్ఞానం లేని పల్లె ప్రజల మాట, ఆట, పాటలే జానపద కళారూపాలు. వీటికి ప్రత్యేకమైన లయ, రాగం, తాళం వంటివేవీ ఉండవు. నోటికి వచ్చింది పాడుకోవడమే జానపదం. పల్లె ప్రజలు తమ ముంగిట రాశులు పోసుకున్న సంస్కృతే ఈ జానపద కళారూపాలు. ప్రకృతి ఒడిలో అడుగిడిన ప్రతి జనపదుని పాదం నుంచి జానపదం పుట్టింది. జనపదం అంటే గ్రామం. జానపదులంటే గ్రామీణులు. మానసిక ఉల్లాసానికి, శారీరక శ్రమ మరిచిపోవడానికి, తమ బాగోగులు చెప్పుకోవడానికి రూపొందించుకున్నవే జానపద కళా రూపాలు. నేడు ‘అంతర్జాతీయ జానపద కళల దినోత్సవం’. ఈ సందర్భంగా జిల్లాలో ప్రాచుర్యంలో ఉన్న జానపద కళా రూపాల గురించి తెలుసుకుందాం..
గొరవయ్యలు.. జిల్లాకే ప్రత్యేకం
వీరశైవాన్ని ప్రచారం చేయడానికి అనేక కళా రూపాలు వచ్చాయి. అణిచివేత నుంచి బయట పడటానికి అనేక కులాలు వీరశైవాన్ని అవలంబించాయి. కులపురాణం ప్రకారం కురవ, గొల్లలు గురువులుగా భావించే గొరవయ్యలు అలా శైవాన్ని తీసుకున్నారనే ప్రచారం ఉంది. జంగమ దేవరల్లాగే వీరు కూడా గతంలో సంచార జాతులు. ఏటా దసరాకు ఆలూరు తాలుకా నెరణికి గ్రామంలో మల్లయ్య, మల్లేశ్వరుడిని కొలుస్తారు. తమ పిల్లలకు గొరవయ్యగా దీక్షి ఇప్పిస్తారు. దీక్షలిచ్చే గురువులు పూజారులే. దీక్షాదానం పొందిన వారికే నృత్యం నేర్పుతారు. లింగముద్రవేస్తారు. గొరవయ్యల వేషం జంగమదేవరలను పోలి ఉంటుంది.
తలపై ఎలుగు బంటి చర్మంతో చేసిన కిరీటం, కిరీటంపై శివలింగం, త్రిశూలం, చంద్రుడు వగైరా చిత్రించి ఉంటాయి. నడముకు కట్టు, జింకచర్మం సంచి ఉంటాయి. నల్లగొంగడిని ధరిస్తారు. భుజాలపై రంగురంగుల కండువాలు వేసి వీటిని నడుం కట్టులో బిగిస్తారు. అడ్డనామాలు, చేతులకు రుద్రాక్షలు ఉంటాయి. ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో ఢమరుకం, నోట్లో పిల్లనగ్రోవి, కాళ్లకు గజ్జెలు ఉంటాయి. నృత్యం ప్రారంభంలోనో, ముగింపులోనో పాటలు పాడతారు. పత్తికొండ, ఆదోని, ఆలూరు, హోసూరు, ప్రాంతాల్లో ఉన్న ఈ కళాకారుల్ని జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి వారి సొంత జిల్లా కరీంనగర్‌లో జిల్లా సాంస్కృతిక మేళాకు ఆహ్వానించి, ప్రత్యేకంగా సత్కరించారు. గొరవయ్యలకు శ్రీశైలంలో విశేష ప్రాధాన్యత ఉంది.
నందికోలు సేవ..
కోల అంటే కర్ర. నంది బొమ్మలు చివరన ఉండే రెండు కర్రల (వెదురుబొంగులు) మధ్య పిడి ఉంటుంది. భక్తులు ఒక నందికోలని భుజాన ఎత్తుకొని పార్వతీ పరమేశ్వరులను స్తుతిస్తూ ‘అశ్శరభ, శరభ’ అంటూ ఖడ్గాలను చదువుతూ తదనుగుణంగా అడుగులు వేస్తూ భావావేశంతో భక్తి పార వశ్యంతో ఊగిపోతుంటారు. దవడకు, నాలుకకు సూది గుచ్చుకుంటారు. ఈ కళారూపాన్ని శివరాత్రి పండుగ సందర్భంగా శైవుల పెళ్లిళ్ల సంప్రదాయానికి చెందిన తొగట వీర క్షత్రియులు, పద్మసాలేవాళ్లు ప్రదర్శిస్తుంటారు. కర్నూలు, ఎమ్మిగనూరు, కోడుమూరు, పోలకల్, గూడూరు, నందవరం, కల్లూరు ప్రాంతాల్లో ఈ కళ ఉంది.
తోలు బొమ్మలాట..
ఇది జిల్లా ప్రజలకు ప్రత్యేకమైన కళారూపం. జిల్లాలో ఎన్నో కుటుంబాల వారు తోలు బొమ్మలాడించి ప్రజలకు వినోదాన్ని అందించి జీవించారు. ఇది చాలా ప్రాచీన కళ. నాటకానికి ప్రాథమిక రూపం. రామాయణ భారత, భాగవతాల్లోని పాత్రలను తోలు బొమ్మలుగా తయారు చేసి పలుచటి వస్త్రాన్ని తెరగా జేసి తెరవెనక నుంచి బొమ్మలను ఆడిస్తూ, దీపం పెట్టడం ద్వారా చీకట్లో బొమ్మలను కాంతి వంతంగా చూపడం ద్వారా అద్భుత దృశ్యాలను ఆవిష్కరింపచేస్తారు. ఈ బొమ్మలాటలో సూత్రధారి, బంగారక్క, కేతిగాడు, జుట్టుపోలిగాడు అనే పాత్రలు ఉంటాయి. రామాయణంలోని సీత పాతివ్రత్యం, రావణుని దుర్మార్గం, రామలక్ష్మణుల అనుబంధం హృదయాలకు హత్తుకునేలా ప్రదర్శించడం తోలు బొమ్మలాట ప్రత్యేకత.
బీరప్పడోలు..
బీరప్పడోలు కళా రూపం కూడా శైవ మత ప్రచారంలో భాగంగానే వచ్చింది. బీరప్పడోలు ఒక పెద్ద ఢక్క ఆకారంలో ఉంటుంది. ఈ కళా రూపం ఎక్కువగా నందికొట్కూరు, పగిడ్యాల, మిడుతూరు పాముపాలడు, పత్తికొండ, డోన్, ఓర్వకల్ మండలాల్లో ప్రదర్శిస్తుంటారు. భాషా పరిజ్ఞానంతో పాత్రోచితంగా పద్యాలు, పాటలు పాడుతారు.
చెక్క భజన..
పది నుంచి నుంచి ఇరవై మంది కళాకారులతో కూడిన బృందాలు ఉంటాయి. భక్తిరస పాటలు పాడుతూ రెండు చెక్కలను ఒకే చేత్తో పట్టుకొని లయబద్ధంగా శబ్దం చేస్తారు. ప్రధాన గాయకుడు, ఆయన పాటకు డోలు లేదా డప్పు వాయిస్తారు. ఇప్పుడు భక్తిపాటలే కాదు ప్రభుత్వ కార్యక్రమాల ప్రచార గీతాలు కూడా చెక్క భజనల్లో చోటు చేసుకుంటున్నాయి.
బుర్ర కథ..
తరతరాల సంస్కృతికి వారధిగా జానపదుల భావాలకు వాహికగా ప్రత్యేకతను సంతరించుకున్న జాపద కళారూపం బుర్రకథ. ఒక శృంగార భావం, ఒక ఆధ్యాత్మిక చింతన, ఒక బాధ, ఒక విషాద ఘటన జానపద గేయంగా రూపెత్తితే ఒక వీరగాథ ఒక దైన్య జీవితం, ఒక సామాజిక ఉద్యమం, ఒక దేవుని మహత్మ్యం గేయరూపంగా వచనంతో జతగా కొన్ని గంటల పాటు పాడుకునే జానపద గేయ గాథ బుర్రకథ. తుంబర తీగలు మీటుతూ ప్రధాన కథకుడు కథా గానం చేస్తుంటే ఆ విశేషాలు జనం అర్థం చేసుకోడానికి మధ్య మధ్య కథకున్ని సందేహాలు అడుగుతూ విషయాన్ని వివరించడానికి హాస్య సృష్టికి ప్రయత్నాలు చేసే ఇద్దరు వంతలుంలటారు.
వీరిలో ఒకతను హాస్యపాత్ర వహిస్తాడు. అయితే ఇద్దరు వంతలు గుమ్మెట అనే వాయిద్యంపై పాటగాడికి లయసహకారం చేస్తారు. ఈ కథలు మొదట్లో భక్తిగాథలు, దేవుళ్ల లీలలు కథలుగా చెప్పగా తరువాత వీరగాథలు ప్రచారం చేయడానికి తోడ్పడ్డాయి. మన జిల్లాలో తొలి తిరుగుబాటు దారుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, మహాదాత బుడ్డా వెంగళరెడ్డి, దైవందిన్నె సంస్థానం వాళ్లపైనా, ఆదోని ప్రాంతానికి చెందిన ఆరె మరాఠీలపైనా కథలు ఉన్నాయి. నాగరాజు దళం, వెలుగోడు శాస్త్రి, బొల్లారం సుంకులు, నందికొట్కూరు తాటికొండ జమ్మన్న, కర్నూలు బుధవారపేట దూపం భవానయ్య, దీపక్ వేణు, దూపం ప్రసాద్, బజారన్న లాంటివారు ప్రసిద్ధ కళాకారులుగా గుర్తింపు పొందారు.
హరి కథ..
సర్వకళల సమాహారం హరికథ. పురాణ పఠనానికి సంగీత పరిజ్ఞానం మేళవిస్తే హరికథ. చేతిలో చిడతలు, కాళ్లకు గజ్జెలు, పట్టు పీతాంబరాలు, మెడలో దండ, నుదట బొట్టుతో హరికథకుని వేషం ఉంటుంది. హరికథ అన్ని జానపద కళారూపాలతో పాటు ప్రజాదరణ పొందింది. దీనిలో ఒకే వ్యక్తి అన్ని పాత్రలద్లనూ రసవత్తరంగా నటిస్తాడు. ఆకర్షణీయమైన ఆహార్యంతో నోటితో వాచికం చెబుతూ మృధుమధురంగా గానం చేస్తూ ముఖంలో సాత్వికం, కాలితో నృత్యం, చేతులతో ఆంగికం ప్రదర్శిస్తాడు. ఇలాంటి హరికథలు చక్కగా చెప్పడంలో నందికొట్కూరు తాలుకా నెహ్రూనగర్‌కు చెందిన వై.నాగభూషణం పేరుగాంచారు.
కోలాటం..
చిన్న కర్ర ముక్కలను చక్కగా చెక్కి, వాటికి రంగులు వేసి రెండు చేతులా రెండు కర్రలు పట్టుకొని కొంత మంది కళాకారులు తాళం వేస్తూ ఆడుతూ పాడుతూ పలు విన్యాసాలను ప్రదర్శిస్తారు. కొన్ని సార్లు ఈ కర్రలకు తాళ్లు కట్టి ఆ తాళ్ల కొసలన్నీ ఎత్తున ఒక కొమ్మకు కట్టి వేసి కర్రలతో ఆడుతూ పాడుతూ ఆ తాళ్లన్నీ పేనుకొనేలా ఒక జడలా అల్లుకొనేలా చేయడం, అప్రదక్షిణంగా తిరుగుతూ ఆ ముడిని విప్పేలా కోలాటాలు సాంగిచడాన్ని జడ కోలాటం అంటారు. కోలాటంలో దేవుని ఊరేగింపు ముందు సంప్రదాయ గీతాల నుంచి అధునాతన సినిమా పాటల వరకు పాడుతుంటారు. పల్లెటూళ్లలో భజన పాటలు పాడడం, అందుకనుగుణంగా చిందులు వేయడం, పండుగలు పబ్బాల్లో సరదాగా పాటలు పాడుతూ ఈ కోలాటం వేస్తారు. ఈ కళ జిల్లా అంతటా ఉంది.
లంబాడీ నృత్యం
ఆళ్లగడ్డ, నంద్యాల, ఆత్మకూరు ప్రాంతాలతో పాటు పత్తికొండ, పాణ్యం, ఓర్వకల్ మండలంలోని తండాల్లోని సుగాలీలు, లంబాడీలు లంబాడీ నృత్యం చేస్తారు. లంబాడీ నృత్యం వారి జీవన సరళిలో భాగం. హోలీ సందర్భంగా గ్రామాల్లో లంబాడీ నృత్యం చేస్తూ భత్యం సేకరిస్తుంటారు. జానపద నృత్య పోటీలు అనగానే ‘అరె హోర హోర’ అని పాడుతూ బంజారా నృత్యాలు చేస్తుంటారు. చేతులతో అభినయం చూపుతూ కూర్చుంటూ, లేస్తూ బృందమంతా ఒకేసారి ఆ విన్యాసాలను గుంపుగా చేస్తుంటే కనువిందుగా ఉంటుంది. దుస్తులు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. పత్తికొండ ప్రాంతానికి చెందిన శంకరమ్మ బృందం ఆ నాటి ముఖ్యమంత్రి చేత సన్మానం అందుకోవడం జిల్లాకే గర్వకారణం.
కళలను కాపాడుకోవాలి
కళలను కాపాడుకోవాల్సి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. జానపదాన్ని కాపాడుకుంటే సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకున్న వాళ్లమవుతాం. తెలుగు భాష మనుగడ జానపద కళా రూపాల రక్షణ ద్వారానే సాధ్యమవుతుంది. జానపద కళలను భావితరాలకు తెలియజేయాలి.
– డాక్టర్ వి.పోతన్న, జానపద కవి
జానపద కళలను ప్రభుత్వం ప్రోత్సహించాలి
గ్రామీణులకు విజ్ఞానాన్ని వినోదాన్ని అందించడానికి జానపద కళారూపాలు ఏర్పడ్డాయి. కొన్ని వైయుక్తికంగా ఉంటాయి. కళలు దైవ దత్తం. సమాజానికి మార్గదర్శనం చేస్తాయి. అప్పట్లో వామపక్ష పార్టీల నాయకులు ప్రజలను చైతన్యం చేయడానికి బుర్ర కథలను ఆయుధంగా చేసుకున్నారు. ఆచార వ్యవహారాలకు నిలయంగా ఉన్న ఈ కళలు ఆదరణ కోల్పోతున్నాయి. వీటిని కాపాడుకోవాల్సిన అవసరముంది. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని కళలను ప్రోత్సహించాలి.
– మధురకవి ఎలమర్తి రమణయ్య
Comments
Please login to add a commentAdd a comment