సమావేశంలో మాట్లాడుతున్న హరీశ్‌రావు
నిలదీసే రోజులు ముందున్నాయి: హరీశ్‌రావు
ఖమ్మం, మహబూబాబాద్ బీఆర్‌ఎస్ నేతలతో భేటీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత ప్రారంభమైందని, అడుగడుగునా కాంగ్రెస్‌ను నిలదీసే రోజులు ముందున్నాయని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ నిలదీయడం బీఆర్‌ఎస్ పారీ్టకే సాధ్యమవుతుందన్నారు. లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులు నామా నాగేశ్వర్‌రావు, మాలోత్ కవితతో పాటు ఆయా సెగ్మెంట్ల పరిధిలోని ముఖ్యనేతలతో తెలంగాణ భవన్‌లో హరీశ్ సోమవారం భేటీ అయ్యారు.
కేసీఆర్ ఆదేశాల మేరకు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై నేతలతో చర్చించారు. కాంగ్రెస్ మోసాలను నిలదీస్తూ ప్రజల్లో చర్చ జరిగేలా చూడాలని, అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే విఫలమైన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. రుణమాఫీ, విద్యుత్ కోతలు, ట్యాంకర్లతో పొలాలకు నీరు, గ్యాస్ సబ్సిడీలో 70 శాతం లబ్ధి దారులకు మొండి చేయి వంటి అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. గల్లీలో కాంగ్రెస్ ఉన్నా ఢిల్లీ వేదికగా తెలంగాణ గొంతు వినిపించేందుకు బీఆర్‌ఎస్ ఎంపీలు అవసరమనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ శ్రేణులు పక్కా ప్రణాళికతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రసార మాధ్యమాలతో పాటు సోషల్ మీడియా వేదికగా ప్రజలను జాగృతం చేయాలని హరీశ్ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment