యువ సైంటిస్ట్‌ను బలి తీసుకున్న వరద
పీహెచ్‌డీ సాధించి శాస్త్రవేత్తగా రాణిస్తున్న అశ్విని
తండ్రితో కలిసి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తుండగా ఆకేరు నదిలో కొట్టుకుపోయిన కారు
చిక్కుకున్నాం.. కాపాడమని బంధువులకు ఫోన్
బంధువులు, పోలీసులు వచ్చేలోగానే ఆమెతో పాటు తండ్రి గల్లంతు..
కుమార్తె మృతదేహం లభ్యం.. లభించని తండ్రి ఆచూకీ
మరిపెడ రూరల్, కారేపల్లి: భారీ వరద ఉజ్వల భవిష్యత్ ఉన్న ఓ యువ సైంటిస్టును బలి తీసుకుంది. మారుమూల గిరిజన ప్రాంతంలో జన్మించిన ఆమె వ్యవసాయ విద్యలోసత్తా చాటింది. జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్‌లో పరిశోధనలు చేసి పీహెచ్‌డీ సాధించి జాతీయ స్థాయిలో పరిశోధనా శాస్త్రవేత్తగా మొదటి స్థానంలో నిలిచింది. యూనివర్సిటీ స్థాయిలో ఆరు బంగారు పతకాలే కాక ఎమ్మెస్సీలోనూ బంగారు పతకం సాధించింది.
అలాంటి అద్భుతమైన ఆమె భవిష్యత్‌ను వరద గల్లంతు చేసింది. ఆమెతో పాటు తండ్రి ప్రయాణిస్తున్న కారు ఆకేరు వాగు ప్రవాహంలో కొట్టుకు పోగా, ఈ ప్రమాదంలో కుమార్తె మృతదేహం లభ్యమైంది.. తండ్రి ఆచూకీ కోసం రెస్క్యూటీం గాలిస్తోంది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం గ్రామ శివారు ఆకేరు నది వాగు వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ విషాద ఘటన వివరాలిలా..
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి గ్రామ పరిధిలోని గంగారం తండాకు చెందిన నూనావత్ మోతీలాల్ (55), మేజ దంపతులకు కుమారుడు అశోక్ కుమార్, కుమార్తె అశ్విని (30) ఉన్నారు. కుమారుడు విద్యుత్‌శాఖలో ఏఈగా విధులు నిర్వహిస్తున్నాడు. కుమార్తె అశ్విని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయపూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో శాస్త్రవేత్తగా ఉద్యోగం చేస్తోంది. ఇటీవల ఏప్రిల్‌లో జరిగిన అంతర్జాతీయ సెమినార్‌లో 4వ స్థానం పొంది మంచి గుర్తింపు పొందింది. తన సోదరుడి నిశ్చితార్థం కావడంతో స్వగ్రామం గంగారంతండాకు వచ్చిన అశ్విని శుభకార్యం ముగిశాక శంషాబాద్ నుంచి రాయపూర్ వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ రిజర్వేషన్ బుక్ చేయించుకుంది.
ఈ క్రమంలో భారీ వర్షాలు పడుతుండడంతో తండ్రి మోతీలాల్ తానే స్వయంగా కారులో హైదరాబాద్‌లో దించేందుకు తెల్లవారు జామున బయలు దేరారు. వయా మరిపెడ మీదుగా హైదరాబాద్ వెళ్తుండగా పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న విషయం గమనించని వారు నేరుగా వచ్చి ప్రవాహంలో చిక్కుకున్నారు. వెంటనే కారులోనుంచి బయటకు దిగిన తండ్రి మోతీలాల్ తన అన్నకు కాల్ చేసి తాము వరదలో చిక్కుకున్నామని, రక్షించాలని పరిస్థితి వివరించారు. సోదరుడు మరిపెడలో ఉన్న బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పి తిరిగి తమ్ముడికి ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే వాగు పరీవాహక ప్రాంతానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకుని జల్లెడ పట్టాయి. సాయంత్రానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో వంతెన సమీపంలో కారు చిక్కుకొని కనిపించింది. బాల్నిధర్మారం సమీపంలోని ఆయిల్‌పామ్‌తోటలో యువ సైంటిస్టు ఆశ్విని మృతదేహం లభ్యమైంది. మోతీలాల్ ఆచూకీ ఇంకా లభించలేదు. ఆదివారం సాయంత్రం దాటాక మోతీలాల్ మృతదేహం కారులో దొరికినట్లు ప్రచారం జరిగినా పోలీసులు నిర్ధారించడం లేదు. అశ్విని మృతదేహాన్ని పోలీసులు.. స్థానికుల సహాయంతో ఒడ్డుకు చేర్చారు. కాగా, తెల్లవారుజామున చీకటిగా ఉండడం, రోడ్డు మార్గం సరిగా తెలియకపోవడం.. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో కారులోనుంచి దిగినా ప్రయోజనం లేకుండాపోయిందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment