young scientist
-
వరదలో చిక్కుకున్నాం.. రక్షించండి
మరిపెడ రూరల్, కారేపల్లి: భారీ వరద ఉజ్వల భవిష్యత్ ఉన్న ఓ యువ సైంటిస్టును బలి తీసుకుంది. మారుమూల గిరిజన ప్రాంతంలో జన్మించిన ఆమె వ్యవసాయ విద్యలోసత్తా చాటింది. జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్‌లో పరిశోధనలు చేసి పీహెచ్డీ సాధించి జాతీయ స్థాయిలో పరిశోధనా శాస్త్రవేత్తగా మొదటి స్థానంలో నిలిచింది. యూనివర్సిటీ స్థాయిలో ఆరు బంగారు పతకాలే కాక ఎమ్మెస్సీలోనూ బంగారు పతకం సాధించింది.అలాంటి అద్భుతమైన ఆమె భవిష్యత్‌ను వరద గల్లంతు చేసింది. ఆమెతో పాటు తండ్రి ప్రయాణిస్తున్న కారు ఆకేరు వాగు ప్రవాహంలో కొట్టుకు పోగా, ఈ ప్రమాదంలో కుమార్తె మృతదేహం లభ్యమైంది.. తండ్రి ఆచూకీ కోసం రెస్క్యూటీం గాలిస్తోంది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం గ్రామ శివారు ఆకేరు నది వాగు వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ విషాద ఘటన వివరాలిలా.. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి గ్రామ పరిధిలోని గంగారం తండాకు చెందిన నూనావత్ మోతీలాల్ (55), మేజ దంపతులకు కుమారుడు అశోక్ కుమార్, కుమార్తె అశ్విని (30) ఉన్నారు. కుమారుడు విద్యుత్‌శాఖలో ఏఈగా విధులు నిర్వహిస్తున్నాడు. కుమార్తె అశ్విని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయపూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో శాస్త్రవేత్తగా ఉద్యోగం చేస్తోంది. ఇటీవల ఏప్రిల్‌లో జరిగిన అంతర్జాతీయ సెమినార్లో 4వ స్థానం పొంది మంచి గుర్తింపు పొందింది. తన సోదరుడి నిశ్చితార్థం కావడంతో స్వగ్రామం గంగారంతండాకు వచ్చిన అశ్విని శుభకార్యం ముగిశాక శంషాబాద్ నుంచి రాయపూర్ వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ రిజర్వేషన్ బుక్ చేయించుకుంది.ఈ క్రమంలో భారీ వర్షాలు పడుతుండడంతో తండ్రి మోతీలాల్ తానే స్వయంగా కారులో హైదరాబాద్‌లో దించేందుకు తెల్లవారు జామున బయలు దేరారు. వయా మరిపెడ మీదుగా హైదరాబాద్ వెళ్తుండగా పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న విషయం గమనించని వారు నేరుగా వచ్చి ప్రవాహంలో చిక్కుకున్నారు. వెంటనే కారులోనుంచి బయటకు దిగిన తండ్రి మోతీలాల్ తన అన్నకు కాల్ చేసి తాము వరదలో చిక్కుకున్నామని, రక్షించాలని పరిస్థితి వివరించారు. సోదరుడు మరిపెడలో ఉన్న బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పి తిరిగి తమ్ముడికి ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.వెంటనే వాగు పరీవాహక ప్రాంతానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని జల్లెడ పట్టాయి. సాయంత్రానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో వంతెన సమీపంలో కారు చిక్కుకొని కనిపించింది. బాల్నిధర్మారం సమీపంలోని ఆయిల్‌పామ్‌తోటలో యువ సైంటిస్టు ఆశ్విని మృతదేహం లభ్యమైంది. మోతీలాల్ ఆచూకీ ఇంకా లభించలేదు. ఆదివారం సాయంత్రం దాటాక మోతీలాల్ మృతదేహం కారులో దొరికినట్లు ప్రచారం జరిగినా పోలీసులు నిర్ధారించడం లేదు. అశ్విని మృతదేహాన్ని పోలీసులు.. స్థానికుల సహాయంతో ఒడ్డుకు చేర్చారు. కాగా, తెల్లవారుజామున చీకటిగా ఉండడం, రోడ్డు మార్గం సరిగా తెలియకపోవడం.. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో కారులోనుంచి దిగినా ప్రయోజనం లేకుండాపోయిందని భావిస్తున్నారు. -
స్వీట్ ఎక్స్పెరిమెంట్: పరిశోధనత్రయం
3డీ బయో ప్రింటెడ్ హ్యూమన్ మోడల్స్ రూపకల్పనకు గాను ఈ ముగ్గురు యువ శాస్త్రవేత్తలకు ‘బెస్ట్ రీసెర్చ్’ అవార్డు వచ్చింది. సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఉదయ్ సక్సేనా, డాక్టర్ సుబ్రహ్మణ్యం వంగల పర్యవేక్షణలో యువ శాస్త్రవేత్తలు శరణ్య, అర్పిత రెడ్డి, ఆర్. ఎన్, సంజన బత్తుల సంయుక్తంగా నిర్వహించిన పరిశోధన ఇది. వీళ్లు టైప్ 2 డయాబెటిస్ డ్రగ్‌ను టెస్ట్ చేసే త్రీడీ బయో ప్రింటెడ్ హ్యూమన్ లైక్ టైప్ 2 డయాబెటిస్ మోడల్ని డెవలప్ చేశారు. అలానే టైప్ 2 డయాబెటిస్ నివారణకు అవసరమైన సప్లిమెంట్‌ను కూడా రూపొందించారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురు యువ శాస్త్రవేత్తలు సాక్షితో పంచుకున్న వివరాలివి. దాదాపుగా ప్రతి సృష్టి మానవ దేహభాగాలను పోలిన మోడల్స్‌ను సృష్టించి వాటి మీద ఔషధాల పని తీరును పరిశీలించడం ద్వారా సత్వర ఫలితాలను సాధించవచ్చని నిరూపించారు ఈ యంగ్ సైంటిస్ట్‌లు. కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడింది. కోవిడ్‌ను నియంత్రించడానికి తయారు చేసిన మందులు ఎలా పని చేస్తున్నాయోనని నిర్ధారణ చేసుకోవడానికి జంతువుల మీద ప్రయోగించి తెలుసుకునే సమయం లేకపోయింది. ఒక ఔషధం ప్రయోగ దశలన్నీ పూర్తి చేసుకుని మార్కెట్లోకి రావడానికి సంవత్సరాలు పడుతుంది. కోవిడ్ సమయంలో అంత సమయం లేదు. అప్పుడు ఈ త్రీడీ బయోప్రింటెడ్ హ్యూమన్ లైక్ మోడల్ బాగా ఉపయోగపడింది. అలాగే ఇదే టెక్నాలజీ ఆధారంగా టైప్ 2 డయాబెటిస్ డ్రగ్ చూపిస్తున్న ప్రభావాన్ని యాక్యురేట్‌గా తెలుసుకునే విధంగా హ్యూమన్‌లైక్ టైప్ 2 డయాబెటిస్ మోడల్ని డెవలప్ చేశారు. ప్రస్తుతం ఈ యంగ్ సైంటిస్ట్‌లు ముగ్గురూ రీసెర్చ్ అసోసియేట్లుగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లో ఇన్క్యుబేషన్ సెంటర్లోని రీజెనె ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పరిశోధనలు చేస్తున్నారు. ‘‘హెల్త్ సైన్సెస్‌లో పరిశోధనల అవసరం చాలా ఉంది. కోవిడ్ పాండమిక్ సమయంలో హ్యూమన్‌లైక్ మోడల్ ఆవశ్యకత తెలిసింది. మా పరిశోధనలో త్రీడీ బయో ప్రింటెడ్ హ్యూమన్ వాస్క్యులార్ లంగ్ మోడల్ తర్వాత టైప్ టూ డయాబెటిస్ మోడల్ మీద దృష్టి పెట్టాం. దాదాపుగా ఏడాది పాటు జరిగిన ప్రయోగం ఇది. ఒక వ్యక్తి డయాబెటిక్ దశకు చేరకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలిగిన విధంగా ఈ న్యూట్రాస్యూటికల్ సప్లిమెంట్‌ని రూపకల్పన చేయడంలో సక్సెస్ అయ్యాం. సమాజానికి అవసరమైన పని చేశామనే సంతృప్తి కలుగుతోంది’’ అన్నారు సంజన. ఆమెరికాలో పుట్టిన తెలుగమ్మాయి సంజన. గ్రాడ్యుయేషన్ యూఎస్‌లోని యూసీ డేవిస్‌లో పూర్తి చేసి హైదరాబాద్‌లో పరిశోధనల్లో నిమగ్నమయ్యారు. సంజన బత్తుల ‘‘సాధారణంగా జంతువుల మీద ప్రయోగం చేసి ఆ తర్వాత మనుషుల మీద క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. ఒక ఔషధం ఇలా అన్ని దశలూ పూర్తి చేసుకోవడానికి దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల సమయం పడుతుంది. అంతే కాదు, కొన్ని సందర్భాల్లో జంతువుల్లో మంచి ఫలితాలనిచ్చిన డ్రగ్ మనుషులలో అంత కచ్చితంగా పని చేయకపోవచ్చు కూడా. మేము రూపొందించిన ప్రయోగంలో హ్యూమన్ లైక్ డిసీజ్ మోడల్స్‌ని డెవలప్ చేసి వాటి మీద ఔషధాన్ని ప్రయోగించాం. దాంతో రిజల్ట్ త్వరగా తెలుసుకోగలిగాం. అలాగే టైప్ టూ డయాబెటిస్ మోడల్లో వివిధ రకాల యాంటీ డయాబెటిక్ డ్రగ్స్‌తోపాటు డివిటిజ్ అనే న్యూట్రాస్యుటికల్ సప్లిమెంట్‌ని కూడా ప్రయోగించి చూశాం. ఈ న్యూట్రాస్యూటికల్ సప్లిమెంట్ కండరాల్లో గ్లూకోజ్ స్వీకరణకు పనిచేస్తుంది. క్లినికల్ ట్రయల్స్ కూడా మంచి ఫలితాలనిచ్చాయి. ఈ సప్లిమెంట్ మార్కెట్లోకి వచ్చి ఐదు నెలలైంది’’ అని చెప్పారు అర్పిత రెడ్డి. ఆమెది వ్యవసాయ కుటుంబం. కర్నాటకలోని కోలార్ జిల్లా, శ్రీనివాసపుర తాలూక, రాయల్పాడు గ్రామం. మైసూర్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ బయో కెమిస్ట్రీ, బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజ్‌లో సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ డయాగ్నస్టిక్స్‌లో పీజీ డిప్లమో చేశారు. అర్పిత రెడ్డి, ఆర్. ఎన్ టైప్ వన్ జన్యుకారణాలతో వస్తుంది. టైప్ టూ డయాబెటిస్ మన దగ్గర లైఫ్ స్టయిల్ డిసీజ్‌గా మారిపోయింది. డయాబెటిక్ కండిషన్లో రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరుగుతాయి. ఒక వ్యక్తి డయాబెటిస్ కండిషన్‌కి రావడానికి ముందు కొంతకాలం ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉంటారు. ఆ దశలో తెలుసుకోగలిగితే దేహానికి జరిగే నష్టాన్ని నివారించవచ్చు. అందుకే మేము కండరాల కణజాలం మీద పని చేసే సప్లిమెంట్ మీద దృష్టిపెట్టాం’’ అని చెప్పారు శరణ్య. ఆమెది కేరళ రాష్ట్రంలోని కన్నూరు. మంగుళూరు యూనివర్సిటీ నుంచి బయో కెమిస్ట్రీలో పీజీ, ప్రోటియోమిక్స్లో పీజీ డిప్లమో చేశారు. శరణ్య – వాకా మంజులారెడ్డి -
రాకెట్లా దూసుకెళ్తున్న ఏపీ శాస్త్రవేత్త.. సాయిదివ్య స్పెషల్ ఇదే..
తెనాలిరూరల్: దేశ చరిత్రలో తొలిసారి ప్రయోగించిన ప్రైవేట్ రాకెట్ ప్రారంభ్(విక్రమ్–ఎస్) విజయవంతం అవడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చారిత్రక ఘట్టంలో తెనాలి యువతి భాగస్వామి అయ్యింది. పట్టణానికి చెందిన యువ శాస్త్రవేత్త సాయిదివ్య కూరపాటి రూపొందించిన 200 గ్రాముల పేలోడ్‌ను విక్రమ్–ఎస్ ద్వారా అంతరిక్షంలోకి పంపారు. ఉపగ్రహ కమ్యూనికేషన్ రంగంలో పీహెడీ స్కాలర్ అయిన సాయిదివ్య తన భర్త కొత్తమాసు రఘురామ్‌తో కలసి ఎన్–స్పేస్‌టెక్ ఇండియా పేరిట సంస్థను ఏర్పాటు చేసి ఉపగ్రహ తయారీపై ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో సాయిదివ్య మైక్రో శాటిలైట్ ‘లక్ష్య శాట్’ను తయారు చేయగా యూకేలోని బీ–2 స్పేస్ సంస్థ ఆస్తరావరణం(స్టాటోస్పియర్)లోకి పంపింది. ప్రస్తుతం ఆమె తయారుచేసిన పేలోడ్‌ను హైదరాబాద్‌లోని స్కైరూట్ ఏరో స్పేస్ సంస్థకు పంపగా, అక్కడ నుంచి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌కు పంపారు. ప్రారంభ్ రాకెట్ ద్వారా సాయిదివ్య తయారు చేసిన పేలోడ్‌తోపాటు మరో రెండు సంస్థలు తయారు చేసిన పేలోడ్లను ప్రయోగించారు. - తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి సన్నాహాలు జరుగుతున్న నాటి నుంచి సాయిదివ్య స్కైరూట్ సంస్థతో సంప్రదిస్తూ వచ్చారు. తెనాలిలోని తన పరిశోధన కేంద్రంలోనే పేలోడ్ తయారు చేశారు. దీనిని ఇతర పేలోడ్లతో అనుసంథానించడం, రాకెట్ అంతరభాగంలో సరిపోయే విధంగా రూపొందించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. వాతావరణంలో ఉన్న తేమ, ఇతర వివరాలను నమోదు చేసేలా పేలోడ్‌ను రూపొందించారు. - తెనాలిలో తయారైన పేలోడ్‌ను హైదరాబాద్ పంపారు. అక్కడ కొన్ని ప్రాథమిక పరీక్షల అనంతరం రాకెట్లో అమర్చేందుకు షార్కు పంపారు. రాకెట్లో అమర్చి, పనితీరును పరిశీలించారు. పేలోడ్ నుంచి వస్తున్న సిగ్నల్స్, ఇతర సమాచార వ్యవస్థను అధ్యయనం చేశారు. విజయవంతంగా రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా అందులో తెనాలిలో తయారుకాబడిన పేలోడ్ ఉండడం విశేషం. టూ వే కమ్యూనికేషన్ శాటిలైట్ తయారీ విక్రమ్–ఎస్ ప్రయోగం విజయవంతం కావడంతో త్వరలో విక్రమ్–1 పేరిట మరో ప్రైవేట్ రాకెట్ తయారీకి రంగం సిద్ధం చేస్తున్నారు. విక్రమ్–ఎస్‌లోని పేలోడ్లు కేవలం వాతావరణంలోని తేమ వంటి వివరాలను మాత్రమే నమోదు చేశాయి. విక్రమ్–1లో టూ వే కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. విక్రమ్–ఎస్‌ను సబ్–ఆర్బిటల్‌లోకి మాత్రమే ప్రయోగించారు. కేవలం 89.5 కిలోమీటర్లు దూరం ఈ రాకెట్ వెళ్లగా, భవిష్యత్తులో తయారుకానున్న విక్రమ్–1ను ఆర్బిటల్(కక్ష్య)లోకి పంపే ఆలోచనలో ఉన్నారు. ఈ రాకెట్లో అమర్చే పేలోడ్లలో టూ వే కమ్యూనికేషన్ వ్యవ్థను అమరుస్తారు. కక్ష్యలోని శాటిలైట్‌తో సంప్రదించడం, దాని నుంచి సమాచారం రాబట్టడం చేస్తారు. ఇందు కోసం సాయిదివ్య పేలోడ్ తయారు చేస్తున్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ కోసం సెన్సార్లను ఏర్పాటు చేయనున్నారు. అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం.. స్పేస్ టెక్నాలజీని విద్యార్థులు, రీసెర్చ్ చేసే వాళ్లకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతోనే ఎన్–స్పేస్ టెక్ ఇండియా సంస్థను నెలకొల్పాం. ఉపగ్రహాలు, రాకెట్ల ద్వారా నింగిలోకి పంపే పేలోడ్ల తయారీ, వాటికి సంబంధించిన ప్రయోగాలను వీరికి అందుబాటులోకి తీసుకురావడం వల్ల భవిష్యత్తులో ఈ రంగంలో మరింత మంది రాణించే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ప్రైవేటు ఉపగ్రహల తయారీ రంగం మరింత అభివృద్ధి చెందుతుంది. తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగంలో భాగస్వాములం అవడం సంతోషంగా ఉంది. – కూరపాటి సాయిదివ్య, యువ శాస్త్రవేత్త -
స్పేస్ పిలుస్తోంది.. మీరు సిద్ధమేనా?
సూళ్లూరుపేట: ఈనాటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలుగా రావాలని, భారతదేశాన్ని శాస్త్రీయ భారత్‌గా బలోపేతం చేయాలని స్పేస్ సైన్స్ పిలుస్తోందని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ చెప్పారు. ఆ పిలుపునకు మీరు సిద్ధంగా ఉన్నారా.. అని ప్రశ్నించారు. దేశంలోని 28 రాష్ట్రాల నుంచి యువిక యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం–2022కు ఎంపికైన 153 మంది విద్యార్థులు శుక్రవారం షార్‌లోని లాంచింగ్ ఫెసిలిటీస్, రాకెట్ లాంచింగ్ పాడ్స్, మిషన్ కంట్రోల్ రూమ్‌లను సందర్శించారు. నేటితరం విద్యార్థులను స్పేస్ సైన్స్ వైపు ఆకర్షించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహిస్తున్న యువిక–2022 కార్యక్రమాన్ని ఈనెల 16న ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ వర్చువల్‌గా ప్రారంభించారు. నేటి (శనివారం) వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎంపికైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గురువారం సాయంత్రం షార్ కేంద్రానికి చేరుకున్నారు. విద్యార్థులు స్పేస్ సెంటర్‌ను సందర్శించిన అనంతరం బ్రహ్మప్రకాష్ హాలులో జరిగిన సమావేశంలో రాజరాజన్ మాట్లాడారు. విద్యార్థులకు ఎంతసేపైనా శ్రమించగలిగే అత్యంత శక్తిసామర్థ్యాలుంటాయని చెప్పారు. మన విద్యార్థులు ఈ రోజున తేలికపాటి ఉపగ్రహాలు తయారుచేసే స్థాయికి ఎదగడం అభినందనీయమన్నారు. ఇస్రో సెంటర్లపై అవగాహన కల్పిస్తే ఈ 153 మందిలో కనీసం ఓ పదిమందైనా ఇస్రో శాస్త్రవేత్తలు అవుతారనే ఆశతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సాయంత్రం 5.30 గంటలకు షార్‌లోని సౌండింగ్ రాకెట్ ప్రయోగవేదిక నుంచి రోహిణి సౌండింగ్ రాకెట్‌ను ప్రయోగించి విద్యార్థులకు చూపించారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా శనివారం ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. -
యంగ్ సైంటిస్ట్ శిక్షణకు మంగమూరు విద్యార్థి
ఒంగోలు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నిర్వహించనున్న యంగ్ సైంటిస్ట్ శిక్షణకు మంగమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి మట్టిగుంట క్రాంతికుమార్ ఎంపికయ్యాడు. ఆన్లైన్ పరీక్షలో సాధించిన మార్కులు, 8వ తరగతి మార్కులు, సైన్స్ ఫెయిర్, ఒలంపియాడ్ పరీక్షలు, క్విజ్, క్రీడలు తదితర అంశాల్లో చూపిన ప్రతిభను పరిగణలోకి తీసుకున్న ఇస్రో.. యువికా–2022కు క్రాంతికుమార్‌ను ఎంపిక చేసింది. దేశం మొత్తం మీద 150 మంది విద్యార్థులను ఎంపిక చేయగా ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురికి చోటుదక్కింది. ఈ సందర్భంగా క్రాంతికుమార్‌ను డీఈవో బి.విజయభాస్కర్, ఉప విద్యాశాఖ అధికారి అనితా రోజ్మేరీ, పాఠశాల హెచ్ఎం బి.సుధాకరరావు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో రిపోర్టు చేయాలని ఇప్పటికే విద్యార్థికి ఆదేశాలు అందాయి. గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యతను ఇస్తూ యువ విద్యార్థులకు స్పేస్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్ మరియు స్పేస్ అప్లికేషన్లపై ప్రాథమిక జ్ఞానాన్ని పెంపొందించేందుకు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ సైంటిస్ట్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ వార్త కూడా చదవండి: చురుగ్గా 44వ విడత ఫీవర్ సర్వే -
ఇస్రో చూసొద్దామా.. లక్కీ ఛాన్స్ మిస్సవకండి.. దరఖాస్తు చేయండిలా..
రాజమహేంద్రవరం రూరల్/భానుగుడి (కాకినాడ సిటీ): అంతరిక్ష పరిజ్ఞానం పెంచేందుకు వీలుగా తొమ్మిదో తరగతి విద్యార్థులకు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చక్కని అవకాశం కల్పిస్తోంది. ఇందుకు యువికా–2022 పేరుతో యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని వివిధ అంతరిక్ష పరిశోధన కేంద్రాలను ప్రతిభావంతులైన విద్యార్థులు సందర్శించవచ్చు. చదవండి: New Education Policy: డిగ్రీ ఇక నాలుగేళ్లు అంతరిక్షంలో ఎలా ఉంటుంది, ఉపగ్రహ ప్రయోగాలు ఎలా చేస్తారు తదితర విషయాలు ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. నిపుణులతో చర్చలు తదితర కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఈ స్ఫూర్తితో భావి శాస్త్రవేత్తలుగా ఎదగవచ్చు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 9వ తరగతి విద్యార్థులు 82,412 మంది ఉన్నారు. అందరూ ఈ అవకాశానికి ప్రయతి్నంచాలని విద్యాశాఖాధికారులు సూచిస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులు విద్యార్థులను ఈ దిశగా ప్రోత్సహించాలని కోరుతున్నారు. దరఖాస్తు చేయడమిలా.. ఇస్రో ప్రధాన వెబ్సైట్ ‘ఐఎస్ఆర్ఓ.జీఓవీ.ఇన్’లో సొంత ఈ–మెయిల్ ఐడీతో విద్యార్థి లాగిన్ అయి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తరువాత రెండు రోజులకు ఇస్రో నిర్వహించే ఆన్లైన్ క్విజ్ పోటీల్లో పాల్గొనాలి. ఆ తరువాత అదే వెబ్సైట్ ద్వారా ఏప్రిల్ 10వ తేదీ లోగా దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తుతో పాటు విద్యార్థులు తరగతిలో తమ ప్రతిభకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలి. ఎంపికైన వారి జాబితాను అదే నెల 20న వెబ్సైట్లో ఉంచుతారు. పరిశీలన అనంతరం ఇస్రో తుది జాబితా ప్రకటిస్తుంది. దేశవ్యాప్తంగా జరిగే వడపోతలో రాష్ట్రానికి ముగ్గురు చొప్పున అవకాశం కల్పిస్తారు. చదవండి: కొత్త జిల్లాలకు కేబినెట్ ఆమోదం.. అవతరణకు ముహూర్తం ఖరారు ఎంపికైన విద్యార్థులకు విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ (తిరువనంతపురం), యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (బెంగళూరు), స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (అహ్మదాబాద్), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (హైదరాబాద్), నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (షిల్లాంగ్)లలో మే 16 నుంచి 28వ తేదీ వరకూ 13 రోజుల పాటు రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ ఇస్తారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సైతం అవకాశం కల్పించారు. శిక్షణ, బస, ప్రయాణ తదితర అన్ని ఖర్చులనూ ఇస్రో భరిస్తుంది. శిక్షణ పూర్తయిన విద్యార్థులకు శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో రాకెట్ ప్రయోగాలపై అవగాహన కల్పిస్తారు. ఎంపిక చేస్తారిలా.. ఎనిమిదో తరగతిలో సాధించిన మార్కులకు 60 శాతం వెయిటేజీ ఇస్తారు. 2016 నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్, చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి 10 శాతం, క్రీడల్లో ప్రతిభకు 10 శాతం ఎన్సీసీ, స్కౌట్ విభాగాల్లో ఉన్న వారికి 5 శాతం, గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదివే వారికి 15 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంపిక చేస్తారు. అవకాశాన్ని అందుకోవాలి జిల్లాలోని తొమ్మిదో తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఏ రంగంలోనైనా అవకాశాలను అందిపుచ్చుకున్న వారినే విజయం వరిస్తుంది. చిన్న వయస్సులోనే శాస్త్ర, సాంకేతిక అంశాలు పరిచయమైతే భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం ఉంటుంది. వివరాలకు 99127 88333 సెల్ నంబరులో సంప్రదించాలి. – ఎం.శ్రీనివాస్ వినీల్, జిల్లా సైన్స్ అధికారి, కాకినాడ -
15 సెకన్లలోనే వైరస్ అంతం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కోవిడ్ వైరస్ మహమ్మారి కట్టడికి తెలంగాణ యువకుడు మండాజి నర్సింహాచారి ఓ వినూత్న ఆవిష్కరణ చేశారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్‌కు చెందిన ఈ యువ శాస్త్రవేత్త ఫిలమెంట్ అవసరం లేని, అధిక తీక్షణతతో కూడిన అతినీలలోహిత కిరణాలు వెదజల్లే ఓ యంత్రం అభివృద్ధి చేశారు. ఉపరితలంపై ఉండే కోవిడ్ వైరస్‌ను ఈ వినూత్న యంత్రం కేవలం 15 సెకన్లలోనే నిర్వీర్యం చేయగలగడం విశేషం. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సైతం ఈ యూవీ బాక్స్ పనితీరును నిర్ధారించి, నర్సింహాచారితో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సరుకులు, కూరగాయలు వంటి వాటిని శుభ్రం చేసుకునేందుకు ఈ యంత్రం ఉపయోగపడుతుందని నర్సింహాచారి తెలిపారు. సీసీఎంబీ సుమారు 45 రోజులపాటు తన యంత్రం పరీక్షించిందని ఆ యన చెప్పారు. తెలంగాణ స్టేట్ ఇన్నొవేషన్ సెల్ సహకారం అందించిందని, ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ) కూడా తాను అభివృద్ధి చేసిన యూవీ పరికరం ద్వారా వెలువడే కిరణాల తీక్షణతను గుర్తించిందని ఒక ప్రకటనలో తెలిపారు. యూవీ లైట్ ముప్ఫై వాట్ల విద్యుత్ వినియోగిస్తుండగా తాము దానితో 1,288 లక్స్ల తీక్షణత తీసుకురాగలిగామని చెప్పారు. సాధారణంగా ఈ స్థాయి యూవీ పరికరంతో కేవలం 180–200 లక్స్ తీక్షణత మాత్రమే వస్తుందని వివరించారు. ఈ యూవీ పరికరం కరోనా వైరస్‌నే కాకుండా ఇతర సూక్ష్మజీవుల నూ నిర్వీర్యం చేసేందుకు ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. -
స్పెయిన్‌లో యువ శాస్త్రవేత్త దుర్మరణం
విశాఖపట్నం, పెందుర్తి: పెందుర్తి పోలీస్‌స్టేషన్ పరిధి వేపగుంట నాయుడుతోట సమీపంలోని దుర్గానగర్‌కు చెందిన యువ శాస్త్రవేత్త మజ్జి షణ్ముఖ్‌నాయుడు(25) స్పెయిన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశం నుంచి కుటుంబ సభ్యులకు బుధవారం సమాచారం అందింది. దీంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. దుర్గానగర్‌లో నివాసం ఉంటున్న విశ్రాంత నేవీ ఉద్యోగి మజ్జి చిన్నంనాయుడు, మణి దంపతులకు కుమార్తెలు డాక్టర్ హారిక, నీలిమ, కుమారుడు షణ్ముఖ్‌నాయుడు సంతానం. చిన్ననాటి నుంచి చదువులో చురుగ్గా ఉండే షణ్ముఖ్(పాస్‌పోర్టు నెంబర్: జెడ్3407688) తన ప్రతిభతో స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫోటోనిక్ సైన్సెస్ రీసోర్స్‌లో యువ శాస్త్రవేత్తగా అభ్యసనం చేస్తున్నారు. అయితే గత సోమవారం నుంచి షణ్ముఖ్ కళాశాలకు వెళ్లలేదు. ఈ క్రమంలో బుధవారం(భారతకాలమానం ప్రకారం) కళాశాలకు భారత్‌కు చెందిన షణ్ముఖ్‌నాయుడు అనే వ్యక్తి కళాశాలకు సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్‌పై మరణించి ఉన్నాడు అని అక్కడి పోలీసులు సమాచారం ఇచ్చారు. దీనిపై కళాశాల ప్రతినిధులు ఆ సమాచారాన్ని దుర్గానగర్‌లో నివాసం ఉంటున్న తల్లిదండ్రులకు చేరవేశారు. మరణించిన సమయంలో వాకింగ్ ట్రాక్, టీషర్ట్‌తో షణ్ముఖ్ ఉన్నట్లు కళాశాల ప్రతినిధులు తెలిపారు. అయితే షణ్ముఖ్ ప్రమాదవశాత్తు మరణించాడా...? ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? లేక మరేదైనా కారణంతో మరణించాడా...? అన్నది మిస్టరీగా మారింది. ఆదివారమే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. షణ్ముఖ్ మరణంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. భారత ప్రభుత్వం త్వరగా స్పందించి షణ్ముఖ్ మృతదేహాన్ని విశాఖకు రప్పించాలని అతని బంధువులు కోరుతున్నారు. -
గుహల పరిశోధనలో యంగ్ సైంటిస్ట్
తెనాలి: ఇంజినీరింగ్ – మెడిసిన్లే ఉన్నత విద్యకు కొలమానంగా పరిగణిస్తున్న నేటి రోజుల్లో ఓ యువకుడు భిన్నమైన జంతుశాస్త్రాన్ని ఎంచుకుని అరుదైన పరిశోధనలోకి అడుగుపెట్టాడు. గుహల్లోని జీవవైవిధ్యం అన్వేషణలో జాతీయ అవార్డు.. తాజాగా ఏపీ కాంగ్రెస్‌లో ‘యంగ్ సైంటిస్ట్’ అవార్డు అందుకున్నాడు. యువ శాస్త్రవేత్త షాబుద్దీన్ షేక్ అద్భుత ప్రతిభకు సోమవారం ఆచార్య నాగార్జున వర్సిటీలో సత్కారం జరగనుంది. షాబుద్దీన్ స్వస్థలం గుంటూరు. తండ్రి అమానుల్లా సాధారణ మెకానిక్. తల్లి రహమతూమ్ గృహిణి. షాబుద్దీన్ చిన్నతనం నుంచి తెనాలిలోని తాతయ్య, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ షేక్ మొహిద్దీన్ బాచ్చా దగ్గర పెరిగాడు. ఇంటర్ తర్వాత గుంటూరు హిందూ కాలేజిలో డిగ్రీ చేసి, జువాలజీలో బంగారుపతకం పొందాడు. వర్సిటీలో ఎంఎస్సీ పూర్తిచేశాడు. భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో గుహల్లో జీవవైవిధ్యం పరిశీలనకు దేశంలోనే తొలిసారిగా నాగార్జున వర్సిటీ కేంద్రంగా ప్రారంభమైన ప్రాజెక్టులో జూనియర్ రీసెర్చ్ ఫెలోగా అవకాశం దక్కించుకుని డాక్టర్ రంగారెడ్డి నేతృత్వంలో ఆరేళ్లుగా దేశంలోని వివిధ గుహలపై పరిశోధన చేశారు. అనేక అవార్డులు అందుకున్నారు. గుహల పరిశోధనలో భారతదేశంలోనే తొలి వ్యక్తిగా గుర్తింపు పొందిన ఈ యువశాస్త్రవేత్త, ఇకపై చైనాలోనూ అధికారికంగా ఇలాంటి గౌరవాన్ని దక్కించుకోనున్నారు. -
భారత సంతతి బాలికకు యువ శాస్త్రవేత్త అవార్డు
అమెరికాలో అత్యుత్తమ యువ శాస్త్రవేత్తగా పదకొండేళ్ల గీతాంజలిరావు అనే భారత సంతతి బాలిక అవార్డు సాధించింది. కొలరాడో ప్రాంతంలో నివసించే గీతాంజలి నీటిలో సీసం కాలుష్యాన్ని మరింత మెరుగ్గా గుర్తించేందుకు ఓ సెన్సర్‌ను తయారు చేసింది. ఈ ఆవిష్కరణకు గాను ఆమెకు ‘డిస్కవరీ ఎడ్యుకేషన్ త్రీఎం యంగ్ సైంటిస్ట్ చాలెంజ్’లో ప్రథమ స్థానం దక్కింది. రెండేళ్ల కింద మిషిగన్ ప్రాంతంలోని ఫ్లింట్ వద్ద నీటి కాలుష్యంతో చాలామంది అనారోగ్యం బారిన పడ్డారు. ఈ ఘటనతో కలత చెందిన గీతాంజలి.. కాలుష్య నివారణకు ఏదైనా చేయాలన్న సంకల్పంతో ఈ సెన్సర్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం అమెరికాలో సీసం కాలుష్యాన్ని గుర్తించేందుకు రెండు పద్ధతులన్నాయి. ప్రత్యేకమైన పట్టీలతో చేసే పరీక్ష ఒకటి. దీనిద్వారా కాలుష్యం సంగతి వెంటనే తెలిసిపోతుంది గానీ.. కొన్నిసార్లు కచ్చితమైన ఫలితాలు ఇవ్వదు. ఇక రెండోది ప్రభుత్వ సంస్థలకు నీటి నమూనాలను పంపి పరీక్షించడం. ఇందుకు చాలా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో గీతాంజలి త్రీఎం శాస్త్రవేత్తలతో కలసి తన ఆలోచనలను ఆచరణలో పెట్టింది. కార్బన్ నానో ట్యూబులతో పనిచేసే ఓ పరికరాన్ని తయారు చేసింది. ఇది నీటిలోని సీసం కాలుష్యాన్ని గుర్తించడంతోపాటు ఆ సమాచారాన్ని బ్లూటూత్ ద్వారా ఫోన్‌కు పంపిస్తుంది. ప్రస్తుతం గీతాంజలి తన పరికరానికి మరిన్ని మెరుగులు దిద్దే పనిలో ఉంది. -
యువ శాస్త్రవేత్తకు కేంద్ర ప్రోత్సాహం
* పథకానికి ఎంపికైన డాక్టర్ శివకిరణ్ విజ్ఞాన్ వర్సిటీ శాస్త్రవేత్త * రూ.34 లక్షల నగదు మంజూరు చేబ్రోలు: కేంద్ర ప్రభుత్వం నుంచి విజ్ఞాన్ యూనివర్సిటీకి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు దక్కిందని రెక్టార్ డాక్టర్ బి.రామ్మూర్తి తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి వర్సిటీలో ఆదివారం రెక్టార్ రామ్మూర్తి విలేకర్లతో మాట్లాడుతూ తమ యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ శివకిరణ్ కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రాజెక్టును దక్కించుకున్నారని తెలిపారు. ఎర్లీ కెరీర్ రీసెర్చి అవార్డు కింద కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం రూ. 34లక్షల విలువైన ప్రాజెక్టును తమ వర్సిటీకి మంజూరుచేసిందని చెప్పారు. ఈ ప్రోత్సాహం వల్ల శివకిరణ్ తన పరిశోధనలను ముమ్మరం చేయనున్నారని తెలిపారు. రీకాంబినెట్ డీఎన్ఏ టెక్నాలజీ ద్వారా.. ప్రాజెక్టు దక్కించుకున్న శివకిరణ్ మాట్లాడుతూ టైఫాయిడ్, రక్తవిరోచినాలు, మూత్ర, జీర్ణకోశ సంబంధ వ్యాధులకు కారణమైన బాక్టీరియాను మానవ శరీరం నుంచి తరిమేసేందుకు కావాల్సిన వ్యాక్సిన్, ఔషధాల అభివృద్ధికి తాను కృషి చేస్తున్నట్లు చెప్పారు. తన పరిశోధనా నివేదికను చూసిన కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చినట్లు చెప్పారు. సమర్థవంతమైన వ్యాక్సిన్, ఔషధాలను కనుగొనేందుకు విజ్ఞాన్ యూనివర్సిటీలో ప్రయోగాలు చేస్తున్నట్లు చెప్పారు. అందుకోసం రీకాంబినెట్ డీఎన్ఏ టెక్నాలజీని వాడుకుంటున్నట్లు తెలిపారు. వ్యాధి కారక బాక్టీరియా జన్యువులను రెండు మూడు కలిపి.. ఒకేరకపు ప్రతిజనకాలను తయారుచేస్తున్నట్లు చెప్పారు. అందుకోసం వర్సిటీలోని బయోటెక్నాలజీ విభాగ ప్రయోగశాలలను వాడుకుంటున్నట్లు తెలిపారు. శివకిరణ్‌ను విజ్ఞాన్ యూనివర్సిటీ వైస్‌చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు తన చాంబర్లో ఘనంగా సత్కరించారు. -
అరటికి గెలాక్సినేషన్
యువ సైంటిస్ట్ వినూత్న ఆవిష్కరణ పిల్లలకు జబ్బు చేయకుండా టీకాలు వేయడం చూశాం. కానీ మొక్కలకు కూడానా?! అవునండి.. ఇది నిజం. మొక్కలకొచ్చే చీడపీడలను నివారించడంతో పాటు, అధిక దిగుబడిని పొందేందుకు ఈ టీకాలు అవసరం అంటున్నారు హైదరాబాద్ యూసఫ్గూడాలోని సెయింట్ మేరీస్ కాలేజీ బయోటెక్నాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ సునీతా పాణిగ్రహి. ఇటీవల వైజాగ్‌లో జరిగిన ఆరో అంతర్జాతీయ సదస్సు (భవిష్యత్‌లో డీఎన్ఏ-లెడ్ టెక్నాలజీ)-2014లో అరటి మొక్కలకు వ్యాక్సినేషన్ అనే థీసిస్‌కు ఆమె ‘యంగ్ సైంటిస్ట్ అవార్టు’ లభించింది. వ్యాక్సినేషన్‌తో మొక్కల్లో ఫినాల్ శాతం పెరుగుతుందన్న అంశంపై సమర్పించిన పరిశోధన పత్రానికి గతేడాది కూడా అదే సదస్సులో సునీత ఇదే అవార్డును అందుకున్నారు. నిజానికి సునీత వ్యవసాయ కుటుంబంలోంచి రాలేదు. అయినా రైతులకు ఏదైనా చేయాలన్న తపనే ఆమెను ఈ రంగంలోకి తీసుకొచ్చింది... ఓ వైపు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా రాణిస్తూ మరోవైపు పరిశోధనలతో దూసుకుపోతున్న ఈ 32 ఏళ్ల యువ బయోటెక్నాలజీ శాస్త్రవేత్త ఎనిమిదేళ్లు కృషి చేసి అరటి మొక్కలకు టీకాల పద్ధతిని కనుగొన్నారు. నిరుపేదల నుంచి ధనికుల వరకు అందరికీ చౌక ధరలో దొరికే పండు ఒక్క అరటేనని నమ్మి ఆమె ఈ పరిశోధన మొదలు పెట్టారు. ఈ పరిశోధనకు ముందు ఆమె కందులు, శనగలపై ప్రయోగాలు చేశారు. ఆ తర్వాత అరటిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. ‘‘వ్యాక్సిన్‌ను సహజసిద్ధ మృత్తికలతో మా కాలేజీ ల్యాబ్‌లోనే తయారు చేశాను. దీన్ని అరటి మొక్కలకు ఇస్తే అవి ఆరోగ్యంగా పెరిగి ఆరు నెలల్లో ఇవ్వాల్సిన దిగుబడిని రెండు నెలల్లోనే ఇస్తాయి. ప్రభుత్వ సాయంతో రైతులందరికీ టీకాలు వేసిన అరటి మొక్కలు అందించాలన్నదే నా ధ్యేయం’’ అని అంటున్నారు సునీత. ఇద్దరు పిల్లల ఆలన పాలన చూసుకుంటూ ఇంటినీ, ఉద్యోగాన్నీ, పరిశోధనల్ని సమన్వయ పరచుకుంటూ ముందుకు సాగుతున్న సునీతకు భర్త శ్రీధర్ ప్రోత్సాహం ఎంతగానో ఉంది. ‘‘కుటుంబ మద్దతు లేకపోతే ఎవరూ ఏమీ సాధించలేరు. అందులోనూ నా ఫ్యామిలీలో ఉద్యోగం చేస్తున్న మహిళను నేనొక్కదాన్నే. నాకు ఇద్దరు అబ్బాయిలు. నా భర్త ప్రస్తుతం సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. నేను ఏదైనా సాధించానంటే దానికి కారణం మా నాన్నగారు త్రినాథ్ పాణిగ్రాహి, భర్త శ్రీధర్. మా స్వస్థలం వైజాగ్. నా విద్యాభ్యాసమంతా అక్కడే జరిగింది. ఇప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ చేస్తున్నాను. 2007లో హైదరాబాద్ వచ్చాను. అప్పటి నుంచి ఈ కాలేజీలోనే పని చేస్తున్నాను. నా పరిశోధనలు సజావుగా సాగడానికి సహోద్యోగులు, విద్యార్థులు అందిస్తున్న సహకారం మరువ లేనిదే’’నంటారు సునీత. సునీత చిన్నప్పటి నుంచే ఒకవైపు వాలీబాల్, త్రోబాల్ లాంటి క్రీడల్లో చురుగ్గా పాల్గొంటూ మరోవైపు సైన్స్‌లో చిన్న చిన్న పరిశోధనలు చేయడం మొదలు పెట్టారు. ఈ యంగ్ సైంటిస్ట్‌కు స్నేహితులతో ముచ్చటించడం, స్విమ్మింగ్, సైక్లింగ్ అంటే ఇష్టం. పుస్తకాలు చదవడం తక్కువే అయినా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవడం అలవాటు. హీరోయిన్ ‘కలర్స్’ స్వాతి, హీరో సాయి ధరమ్‌తేజ్ సునీత విద్యార్థులే. - నిఖిత నెల్లుట్ల ఫొటోలు: దయాకర్ -
చెవిటివారి కోసం టీవీ సౌండ్ సిస్టమ్
లండన్: వినికిడి సమస్యను ఎదుర్కొనే వారికోసం సరికొత్త టీవీ సౌండ్ సిస్టమ్‌ను అభివృద్ధిపరిచాడు బ్రిటన్‌కు చెందిన యువ శాస్త్రవేత్త. దీని సహాయంతో ఇతరులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండానే చెవిటి వారు టీవీ శబ్దాలను లౌడ్ స్పీకర్ సిస్టమ్‌తో సులువుగా వినవచ్చట. వినికిడి సమస్య ఉన్న 70 ఏళ్ల వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని బ్రిటన్‌లోని సౌతాంప్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త దీనిని అభివృద్ధిపరిచాడు. డిజైన్‌లో ప్రత్యేకంగా రూపొందించిన శ్రవణ రేడియేటర్లను వినియోగించామని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌండ్, వైబ్రేషన్ రిసెర్చ్ పరిశోధకుడు మార్కోస్ సైమన్ చెప్పాడు. -
యువ శాస్త్రవేత్త పురస్కారానికి డాక్టర్ సతీష్ ఎంపిక
కేయూక్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ బాటనీ విభాగంలో డాక్టరేట్ పూర్తిచేసిన డాక్టర్ సుతారి సతీష్ యువ శాస్త్రవేత్త పురస్కారానికి ఎంపికయ్యూరు. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు (ఎస్ఈఆర్బీ) డీఎస్టీ వారు ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. 2013లో పీహెచ్డీ చేసిన సతీష్ ఈ పురస్కారం అందుకోనుండడం విశేషం. గ్రేటర్ హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో పలు రకాల కాలుష్యాల వల్ల పర్యావరణంలో సంభవిస్తున్న మార్పులు... దానికనుగుణంగా మారుతున్న మొక్కల అనుక్రమం... సహజ, కాలుష్య ప్రాంతంలో పెరుగుతున్న మొక్కల అనుక్రమం వంటి పలు అంశాలపై 3 సంవత్సరాలపాటు పరిశోధన చేయనున్నారు. క్షేత్ర పర్యటనలో వెల్లడైన అంశాలను నివేదికను అందజేసి మార్గదర్శకాలను సూచిస్తారు. కేయూలోని బాటనీ విభాగంలో రిటైర్డ్ ప్రొఫెసర్ వత్సవాయ ఎస్ రాజు పర్యవేక్షణలో పీహెచ్డీ పూర్తిచేసిన సతీష్ అంతర్జాతీయ జర్నల్స్‌లో పది పరిశోధన పత్రాలు ప్రచురించారు.18 జాతీయ ,అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధన పత్రాలను సమర్పించారు. 2009 నుంచి 2011 వరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ డెహ్రాడూన్ వారి ఫెల్లోషిప్, 2012-2013లో యూజీసీ న్యూఢిల్లీ నుంచి ఫెల్లోషిప్ అందుకున్నారు. ప్రస్తుతం యువశాస్త్రవేత్త పురస్కారంతో మరో మూడు సంవత్సరాలపాటు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో హైదరాబాద్‌లో ప్రముఖ శాస్త్రవేత్త సీనియర్ ఆచార్యులు ఎంఎన్వీ ప్రసాద్ ఆధ్వర్యంలో పరిశోధనలు చేయనున్నారు. -
యువ శాస్త్రవేత్తలకు దారిచూపిన ఏఎస్ రావు
ఆయన ఘనత వల్లే ఈసీఐఎల్‌కు పేరు కొనియాడిన సాంకేతిక సలహా మండలి చైర్మన్ చిదంబరం ఈసీఐఎల్ ఆవరణలో అట్టహాసంగా సాగిన రావు శతజయంతి వేడుకలు ఉప్పల్ : ఎలక్ట్రానిక్స్ రంగంలో నాయకుడిగా ముందుండి దేశాన్ని, యువ శాస్త్రవేత్తలను నడిపించిన డాక్టర్ ఏఎస్ రావు మానవతా వాది అని కేంద్ర ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారుడు, సాంకేతిక సలహా మండలి చైర్మన్, అణు ఇంధన శాఖ మాజీ చైర్మన్ డాక్టర్ ఆర్.చిదంబరం పేర్కొన్నారు. జగద్విఖ్యాత డాక్టర్ ఏఎస్ రావు శత జయంతి వేడుకల్లో భాగంగా ఈసీఐఎల్ కంపెనీ ఆవరణలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ అయ్యగారి సాంబశివరావు జీవిత విశేషాలతో రూపొందించిన ‘ఈసీఐఎల్-న్యూస్’ మాసపత్రికను ఆయన ఆవిష్కరించారు. అనంతరం చిదంబరం మాట్లాడుతూ డాక్టర్ రావు మానస పుత్రిక ఈసీఐఎల్ సంస్థ పురోభివృద్ధికి ప్రతి ఉద్యోగి ముందుండాలని సూచించారు. రక్షణ, అంతరిక్ష పరిశోధనల్లో ఈసీఐఎల్ తనవంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తోందని చెప్పారు. ఈవీఎం అంటేనే ఈసీఐఎల్ అనేవిధంగా ప్రసిద్ధిగాంచిందని అభినందించారు. డాక్టర్ రావు అప్పట్లోనే ఆధార్ కార్డు తరహాలో ‘మల్టీపర్పస్ పర్సనల్ కార్డు’ రూపకల్పనకు చేసిన కృషి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మరుగున పడిందని గుర్తు చేశారు. అణు ఇంధన కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ పి.రామారావు మాట్లాడుతూ ‘అప్సర’ నుంచి మొదలుకొని ‘టెస్ట్’ రియాక్టర్ వరకు అణు రియాక్టర్ల తయారీలో నేటికీ ఈసీఐఎల్దే పైచేయి కావడం గర్వకారణమన్నారు. ఈసీఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ పి.సుధాకర్ మాట్లాడుతూ 60వ దశకంలోనే అణు రియాక్టర్‌కు కంట్రోల్ సిస్టమ్ రూపొందించి ప్రపంచ దేశాలకు దీటుగా భారత్‌ను నిలిపిన డాక్టర్ రావు చూపిన బాటలో ఈసీఐఎల్ ముందుకు సాగుతుందన్నారు. మాజీ సీఎండీలు ఎస్ఆర్ విజయకర్, వీఎస్ రాన్, జీపీ శ్రీవాస్తవ, వైఎస్ మయ్యా, ఎన్ఎఫ్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ ఎన్.సాయిబాబా, అటామిక్ మినరల్స్ డెరైక్టర్ పీఎస్ పరిహార్, అమెరికా నుంచి వచ్చిన ఏఎస్ రావు కుటుంబ సభ్యులు వెంకటాచలం, డాక్టర్ రాంచందర్ రావు, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు జి.యాదగిరి రావు, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. -
యువశాస్త్రవేత్త చేతన్‌శెట్టి
చేతన్‌కుమార్ జి. శెట్టి 20 ఫిబ్రవరి 1991న కర్ణాటకలోని సిద్ధాపూర్లో మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. అతనికి ఆస్ట్రోఫిజిక్స్, జనరల్ సైన్స్ మొదలైన విషయాల పట్ల చాలా ఆసక్తి. అతను ఎప్పుడూ ్ఖఊై (గుర్తింపబడని ఎగిరే వస్తువులు), పాలపుంతలు, విశ్వం గురించి సమాచారం సేకరించేవాడు. చేతన్ దాదాపు 14 పరిశోధన పత్రాలను తయారుచేశాడు. వాటిలో 9 యుఎస్ఏ, కెనడా, పాకిస్థాన్, ఇటలీ, నైజీరియా ఇంకా భారతదేశంలో అంతర్జాతీయ కార్యక్రమాల జర్నల్స్‌లో, వార్తాపత్రికల్లో ముద్రించారు. 17అంతర్జాతీయ జాతీయ వార్తాపత్రికలు చేతన్ గురించి వ్యాసాలు రాశాయి. అతని పరిశోధన పత్రాలు బ్యాంకాక్, హాంగ్‌కాంగ్, చైనా, స్కాట్లాండ్, నైజీరియా దేశాలోల జరిగిన పది అంతర్జాతీయ సమావేశాలకు ఎంపిక చేశారు. 25కి పైగా జాతీయ, అంతర్జాతీయ పరిశోధన సంస్థలు, పరిశోధన సంఘాలతో అతనికి అనుబంధం ఉంది. మైక్రోసాఫ్ట్ చేతన్ని మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్, మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ టెక్నాలజీ స్పెషలిస్ట్‌గా గుర్తించింది. మైక్రోసాఫ్ట్ నిర్వహించిన పరీక్షలో చేతన్ 98 శాతం మార్కులు సాధించాడు. తన రెండు పరిశోధనలకు పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. చేతన్ అనేక అంతర్జాతీయ సంస్థల్లో గౌరవ హోదా పొందాడు. ‘ఎక్స్పర్ఇన్’ అనే సంస్థను స్థాపించాడు. ఎన్నో శాస్త్రీయ పరిశోధన సంస్థల నుండి ప్రశంసలు, ఉచిత సభ్యత్వం పొందాడు. ప్రస్తుతం చేతన్ న్యూఢిల్లీలో కర్ణాటకకు సంబంధించిన సైంటిఫిక్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ శాఖలో గ్రామీణ ప్రాంతాల్లో జరిగే కొత్త ఆవిష్కరణలను సమీక్షించే అధికారిగా పని చేస్తున్నారు.