
యూవీ బాక్స్‌తో రూపకర్త నర్సింహాచారి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కోవిడ్ వైరస్ మహమ్మారి కట్టడికి తెలంగాణ యువకుడు మండాజి నర్సింహాచారి ఓ వినూత్న ఆవిష్కరణ చేశారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్‌కు చెందిన ఈ యువ శాస్త్రవేత్త ఫిలమెంట్ అవసరం లేని, అధిక తీక్షణతతో కూడిన అతినీలలోహిత కిరణాలు వెదజల్లే ఓ యంత్రం అభివృద్ధి చేశారు. ఉపరితలంపై ఉండే కోవిడ్ వైరస్‌ను ఈ వినూత్న యంత్రం కేవలం 15 సెకన్లలోనే నిర్వీర్యం చేయగలగడం విశేషం. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సైతం ఈ యూవీ బాక్స్ పనితీరును నిర్ధారించి, నర్సింహాచారితో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సరుకులు, కూరగాయలు వంటి వాటిని శుభ్రం చేసుకునేందుకు ఈ యంత్రం ఉపయోగపడుతుందని నర్సింహాచారి తెలిపారు.
సీసీఎంబీ సుమారు 45 రోజులపాటు తన యంత్రం పరీక్షించిందని ఆ యన చెప్పారు. తెలంగాణ స్టేట్ ఇన్నొవేషన్ సెల్ సహకారం అందించిందని, ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ) కూడా తాను అభివృద్ధి చేసిన యూవీ పరికరం ద్వారా వెలువడే కిరణాల తీక్షణతను గుర్తించిందని ఒక ప్రకటనలో తెలిపారు. యూవీ లైట్ ముప్ఫై వాట్ల విద్యుత్ వినియోగిస్తుండగా తాము దానితో 1,288 లక్స్‌ల తీక్షణత తీసుకురాగలిగామని చెప్పారు. సాధారణంగా ఈ స్థాయి యూవీ పరికరంతో కేవలం 180–200 లక్స్ తీక్షణత మాత్రమే వస్తుందని వివరించారు. ఈ యూవీ పరికరం కరోనా వైరస్‌నే కాకుండా ఇతర సూక్ష్మజీవుల నూ నిర్వీర్యం చేసేందుకు ఉపయోగపడుతుందని ఆయన వివరించారు.