అరటికి గెలాక్సినేషన్
యువ సైంటిస్ట్ వినూత్న ఆవిష్కరణ
పిల్లలకు జబ్బు చేయకుండా టీకాలు వేయడం చూశాం. కానీ మొక్కలకు కూడానా?! అవునండి.. ఇది నిజం. మొక్కలకొచ్చే చీడపీడలను నివారించడంతో పాటు, అధిక దిగుబడిని పొందేందుకు ఈ టీకాలు అవసరం అంటున్నారు హైదరాబాద్ యూసఫ్‌గూడాలోని సెయింట్ మేరీస్ కాలేజీ బయోటెక్నాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ సునీతా పాణిగ్రహి. ఇటీవల వైజాగ్‌లో జరిగిన ఆరో అంతర్జాతీయ సదస్సు (భవిష్యత్‌లో డీఎన్‌ఏ-లెడ్ టెక్నాలజీ)-2014లో అరటి
మొక్కలకు వ్యాక్సినేషన్ అనే థీసిస్‌కు ఆమె ‘యంగ్ సైంటిస్ట్ అవార్టు’ లభించింది. వ్యాక్సినేషన్‌తో మొక్కల్లో ఫినాల్ శాతం పెరుగుతుందన్న అంశంపై సమర్పించిన పరిశోధన పత్రానికి గతేడాది కూడా అదే సదస్సులో సునీత ఇదే అవార్డును అందుకున్నారు. నిజానికి సునీత వ్యవసాయ కుటుంబంలోంచి రాలేదు. అయినా రైతులకు ఏదైనా చేయాలన్న తపనే ఆమెను ఈ రంగంలోకి తీసుకొచ్చింది...
ఓ వైపు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా రాణిస్తూ మరోవైపు పరిశోధనలతో దూసుకుపోతున్న ఈ 32 ఏళ్ల యువ బయోటెక్నాలజీ శాస్త్రవేత్త ఎనిమిదేళ్లు కృషి చేసి అరటి మొక్కలకు టీకాల పద్ధతిని కనుగొన్నారు. నిరుపేదల నుంచి ధనికుల వరకు అందరికీ చౌక ధరలో దొరికే పండు ఒక్క అరటేనని నమ్మి ఆమె ఈ పరిశోధన మొదలు పెట్టారు. ఈ పరిశోధనకు ముందు ఆమె కందులు, శనగలపై ప్రయోగాలు చేశారు. ఆ తర్వాత అరటిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు.
‘‘వ్యాక్సిన్‌ను సహజసిద్ధ మృత్తికలతో మా కాలేజీ ల్యాబ్‌లోనే తయారు చేశాను. దీన్ని అరటి మొక్కలకు ఇస్తే అవి ఆరోగ్యంగా పెరిగి ఆరు నెలల్లో ఇవ్వాల్సిన దిగుబడిని రెండు నెలల్లోనే ఇస్తాయి. ప్రభుత్వ సాయంతో రైతులందరికీ టీకాలు వేసిన అరటి మొక్కలు అందించాలన్నదే నా ధ్యేయం’’ అని అంటున్నారు సునీత. ఇద్దరు పిల్లల ఆలన పాలన చూసుకుంటూ ఇంటినీ, ఉద్యోగాన్నీ, పరిశోధనల్ని సమన్వయ పరచుకుంటూ ముందుకు సాగుతున్న సునీతకు భర్త శ్రీధర్ ప్రోత్సాహం ఎంతగానో ఉంది.
‘‘కుటుంబ మద్దతు లేకపోతే ఎవరూ ఏమీ సాధించలేరు. అందులోనూ నా ఫ్యామిలీలో ఉద్యోగం చేస్తున్న మహిళను నేనొక్కదాన్నే. నాకు ఇద్దరు అబ్బాయిలు. నా భర్త ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. నేను ఏదైనా సాధించానంటే దానికి కారణం మా నాన్నగారు త్రినాథ్ పాణిగ్రాహి, భర్త శ్రీధర్. మా స్వస్థలం వైజాగ్. నా విద్యాభ్యాసమంతా అక్కడే జరిగింది. ఇప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ చేస్తున్నాను. 2007లో హైదరాబాద్ వచ్చాను. అప్పటి నుంచి ఈ కాలేజీలోనే పని చేస్తున్నాను. నా పరిశోధనలు సజావుగా సాగడానికి సహోద్యోగులు, విద్యార్థులు అందిస్తున్న సహకారం మరువ లేనిదే’’నంటారు సునీత.
సునీత చిన్నప్పటి నుంచే ఒకవైపు వాలీబాల్, త్రోబాల్ లాంటి క్రీడల్లో చురుగ్గా పాల్గొంటూ మరోవైపు సైన్స్‌లో చిన్న చిన్న పరిశోధనలు చేయడం మొదలు పెట్టారు. ఈ యంగ్ సైంటిస్ట్‌కు స్నేహితులతో ముచ్చటించడం, స్విమ్మింగ్, సైక్లింగ్ అంటే ఇష్టం. పుస్తకాలు చదవడం తక్కువే అయినా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవడం అలవాటు. హీరోయిన్ ‘కలర్స్’ స్వాతి, హీరో సాయి ధరమ్‌తేజ్ సునీత విద్యార్థులే.
- నిఖిత నెల్లుట్ల
ఫొటోలు: దయాకర్