Nikhita nellutla
-
మనసున్నవాడు.. మార్గం చూపాడు!
ఆదర్శం ప్రతి మనిషికీ మనసుంటుంది. అయితే ప్రతి మనసూ స్పందించదు. ఎదుటివారి కోసం పరితపించదు. ఇతరులకు ఏదో ఒకటి చేయాలని ఆరాట పడదు. ధ్రువ్ లక్రాది స్పందించే మనసు. అందరి కోసమూ ఆలోచించే మనసు. అందుకే ఇవాళ అతని కారణంగా ఎంతోమంది జీవితాల్లోకి సంతోషం వచ్చింది. ముంబైకి చెందిన ధ్రువ్ డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత డీఎస్పీ మెరిల్ లించ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా జాయిన్ అయ్యాడు. జీతం, జీవితం బాగానే ఉన్నాయి. కానీ మనసే బాలేదు. ఏదో అసంతృప్తి. డబ్బు వద్దు. విలాసాలూ వద్దు. సరదాలు అసలే వద్దు. ఇంకేదో కావాలి. ఏమిటది? సేవ. పదిమందికి ఉపయోగపడాలి. లేకపోతే జీవితానికి అర్థమే ఉండదు. అలా ఆలోచించి దస్రా అనే సేవా సంస్థలో చేరాడు. చిన్న పిల్లల అక్రమ రవాణా నుంచి ఎన్నో అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడే సంస్థ అది. ఆ పోరాటంలో తానూ భాగమయ్యాడు ధ్రువ్. కానీ అంతలోనే ఆక్స్ఫర్డ్ యూని వర్సిటీలో ఎంబీయే సీటు వచ్చింది. దాంతో లండన్ వెళ్లిపోయాడు. తర్వాత ఇండియా తిరిగి వచ్చి ఓ బిజినెస్ పెట్టుకున్నాడు. మళ్లీ సేవ గురించి ఆలోచిస్తున్నప్పుడే ఒక ఊహించని సంఘటన జరిగింది. ఓ రోజు తన కారు చెడిపోతే.. ఆఫీసు నుంచి ఇంటికి సిటీ బస్సులో బయలు దేరాడు ధ్రువ్. అతని ముందు సీటులో ఒకబ్బాయి కూర్చున్నాడు. అతని దగ్గరకు కండక్టర్ వచ్చి, టికెట్ ఎక్కడికి ఇవ్వాలని అడిగాడు. ఆ అబ్బాయి సైగలతో చెప్పాడు. కండక్టర్‌కి అర్థం కాక మళ్లీ అడిగాడు. అతను మళ్లీ సైగ చేశాడు. అలా చాలాసేపు నడిచాక కండక్టర్‌కి విసుగొచ్చే సింది. దిగిపొమ్మని అరిచాడు. దాంతో ఆ యువకుడు ఓ పేపర్ పైన అతను ఎక్కడికి వెళ్లాలో రాసి చూపించాడు. ఇది చూసిన ధ్రువ్‌లో ఏదో చలనం. మనసులోని మాటలను బయటికి చెప్పాలని ఉన్నా చెప్పలేకపోవడం ఎంత బాధాకరమో కదా అనుకున్నాడు. గతంలోనూ అలాంటి చాలామందిని చూశాడు. చూసినప్పుడల్లా మథనమే. ఈరోజూ అంతే. అవే ఆలోచనలతో ఇంటికి చేరాడు. సరిగ్గా అప్పుడే ఓ కొరియర్ బాయ్ వచ్చాడు. ధ్రువ్‌ని చూసి చిరునవ్వు నవ్వి, కవర్ అందించాడు. సంతకం చేసి కవర్ అందుకుని లోపలికి వచ్చేశాడు ధ్రువ్. ఆ క్షణం... అతని మెదడులో ఓ కొత్త ఆలోచన మెదిలింది. అర నిమిషం కూడా పట్టలేదు కొరియర్ తీసుకోవడానికి. కొరియర్ బాయ్‌తో మాట్లాడే అవసరమూ రాలేదు. అంటే ఈ పనికి మాట, వినికిడి అవసరం లేదు. కాబట్టి ఆ రెండూ లేనివాళ్లు కొరియర్ బాయ్స్‌గా పని చేయవచ్చు. ఆ ఆలోచన వచ్చిందో లేదో... ఇక ఆగలేక పోయాడు ధ్రువ్. వెంటనే మిరాకిల్ కొరియర్ కంపెనీకి పునాది వేశాడు. మిరాకిల్ కొరియర్స్‌కు 2009లో హెలెన్ కెల్లర్ అవార్డు, 2010లో జాతీయ అవార్డులు దక్కాయి. అప్పటి అధ్యక్షురాలు ప్రతిభాపాటిల్ చేతుల మీదుగా ధృవ్ ఆ అవార్డును అందుకున్నాడు. మిరాకిల్ కొరియర్స్‌లో ఎప్పటికప్పుడు ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తుంటాడు. కొత్తగా వచ్చిన వారికి ఇంగ్లిష్, కంప్యూటర్లో శిక్షణ ఇస్తుంటాడు. జీవితంలో ఎదిగేందుకు ఏం చేయాలో, వైకల్యాన్ని ఎలా అధిగమించాలో చెప్పి వారిలో స్ఫూర్తిని నింపుతుంటాడు. మొదట ముగ్గురితో ప్రారంభమైన మిరాకిల్ కొరియర్స్‌లో ప్రస్తుతం 70 మందికి పైగా బాయ్స్ ఉన్నారు. అందులో అందరూ వినికిడి లోపం ఉన్నవారే. ఆడ పిల్లలకేమో కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి డేటా ఆపరేటర్లుగా నియమించాడు. ఆర్డర్లు, డెలివరీల వివరాలను వాళ్లు ఆన్ లైన్లో అప్లోడ్ చేస్తుంటారు. ప్రస్తుతం ఈ కంపెనీ నెలకు అరవై అయిదు వేల డెలివరీలకు పైగా చేస్తోందట. మహీంద్ర అండ్ మహీంద్ర, ఆదిత్య బిర్లా గ్రూప్, గోద్రెజ్, విక్టరీ ఆర్ట్ ఫౌండేషన్ లాంటి పెద్ద కంపెనీలు కూడా ఈ కంపెనీ క్లయింట్సే. ఆరెంజ్ కలర్ యూనిఫామ్‌లో, నగరమంతా చకచకా తిరుగుతూ, తమ వైకల్యాన్ని మర్చిపోయిన ఆ యువకులని చూసి మురిసిపోతుంటాడు ధ్రువ్. ఇప్పు డతని మనసులో అసంతృప్తి అన్నదే లేదు. - నిఖిత నెల్లుట్ల -
భళా బలియా..!
జలుబు, దగ్గు వస్తే ఇంట్లోనే పసుపు మింగో, నాలుగు తులసి ఆకులు నమిలో తగ్గించుకుంటాం. జ్వరం, ఒళ్లు నొప్పులు లాంటివి వస్తే డాక్టరు దగ్గరకు వెళ్లి నయం చేసుకుంటాం. ఎందుకంటే అవి వాతావరణ మార్పిడి వల్ల వచ్చి వెళ్తుంటాయి కాబట్టి. మరి రోజూ తాగే నీరే కలుషిత మైతే, దానివల్ల జబ్బులు చుట్టుముడితే ఏం చేయాలి? ఉత్తరప్రదేశ్‌లోని బలియా గ్రామస్తులు ఇదే ప్రశ్న వేశారు. ఒకరోజు రెండు రోజులు కాదు... కొన్ని నెలలు! కానీ వారికి ఎవరూ సమాధానం చెప్పలేదు. అందుకే ఆ సమాధానాన్ని వాళ్లే వెతుక్కున్నారు. ప్రజలకు సురక్షితమైన నీరు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో బోర్లు వేయించి చేతి పంపులు అమర్చింది. ఆ రోజు బలియా గ్రామస్తుల సంతోషం అంతా ఇంతా కాదు. అయితే అంతటి సంతోషం కొద్ది రోజుల్లో ఆవిరైపోయింది. బోరింగ్ నీళ్లు తాగడం మొదలు పెట్టిన తర్వాత చర్మ వ్యాధులు రావడం మొదలైంది. చర్మంపై దద్దుర్లు రావడం, చర్మం రంగు మారడం, కాళ్లూ చేతులు వాయడం వంటి సమస్యలు తలెత్తాయి. తర్వాత కొన్ని రోజులకే దగ్గు, అజీర్తి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్లాంటి సమస్యలు కూడా ముంచెత్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తిరిగారు. అధికారులకు తమ గోడును విన్నవించు కున్నారు. రెండేళ్లకు గానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. సర్వే చేయించలేదు. తీరా చేయించాక తెలిసిందేమిటంటే... బోరింగుల్లోని నీటిలో ఆర్సెనిక్ అనే రసాయనం ఉందని, దాని కారణంగానే ఈ రోగాలు వస్తున్నాయని. అయితే పరిష్కార మార్గాలు వెతకడానికి సమయం కావాలన్నారు అధికారులు. ఎందుకంటే అది ఖర్చుతో కూడుకున్న పని కదా! అయితే యేళ్లు గడిచాయి. సమస్యలు ఉధృతమయ్యాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. చూసి చూసి విసిగిపోయారు గ్రామస్తులు. కళ్లముందే తమవాళ్లు నరకయాతన పడుతుంటే చూడలేకపోయారు. ఎవరి సాయం కోసం చూడకుండా తామే సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశగా అడుగులు వేయడం మొదలు పెట్టారు. తమ ప్రాంతంలో 30-40 మీటర్ల లోతులోనే ఈ ఆర్సెనిక్ రసాయనం ఉందన్న విషయం అధికారుల ద్వారా తెలిసింది గ్రామస్తులకి. తమ ఇళ్లలోని బావుల లోతు వాటి కంటే తక్కువే. కాబట్టి బావుల నీటిలో ఆర్సెనిక్ ఉండదు. అంటే ఆ నీరు సురక్షితమే. తాగొచ్చు. కానీ బోర్లు పడ్డాయి కదా అని బావుల్ని నిర్లక్ష్యంగా వదిలేశారు. అవన్నీ చెత్తతో పూడుకుపోయే స్థితికి చేరుకున్నాయి. ఇప్పటికైనా బాగు చేయకపోతే పూర్తిగా మూసుకుపోతాయి. అందుకే ఇక ఆలస్యం చేయలేదు. బావుల్ని పునరుద్ధరించే పని మొదలు పెట్టారు. బలియా గ్రామానికి చెందిన దిలీప్ అనే యువకుడు, ధనిక్‌రామ్ వర్మ అనే 95 ఏళ్ల వృద్ధుడు ఈ మహాయజ్ఞానికి నాంది పలికారు. ఊళ్లోవాళ్లందరినీ ఒక్కచోటికి చేర్చారు. తాము చేయవలసినదేమిటో వివరించారు. అందరినీ కలుపుకుని బావుల పునరుద్ధరణ ప్రారంభించారు. చేయి చేయి కలిస్తే, అందరూ ఒక్క తాటి మీద నడిస్తే... సాధ్యం కానిది ఏముం టుంది! వారి ప్రయత్నం ఫలించింది. ఊరి బావులకు కొత్త కళ వచ్చింది. వాటిలోని నీరు వారికి ఆధారమైంది. వారి రోగాలకు ముగింపు పలికింది. జీవితాలను మళ్లీ ఆనందమయం చేసింది. అయితే ధనిక్‌రామ్ వర్మ దానితోనే సంతోషపడి ఊరుకోలేదు. ఆ రాష్ట్రంలో 31 జిల్లాల్లో ఈ ఆర్సెనిక్ సమస్య ఉందని తెలుసుకొని, తన గ్రామస్తులతో కలిసి ఆ ఊళ్లన్నీ తిరిగాడు. తాము అనుసరించిన విధానాన్నే వారికీ నేర్పించాడు. పాడు బడిన బావుల్ని బాగు చేయించాడు. అసలు బావులే లేని చోట తవ్వించాడు. ఇప్పుడు ఆ గ్రామాలన్నీ ఆర్సెనిక్ నుంచి విముక్తి పొందాయి. ఆరోగ్య కరమైన నీటినే తాగుతూ ఆనందంగా ఉంటున్నాయి. ఇదంతా బలియా గ్రామస్తుల చలవ అని గొప్పగా చెబుతు న్నాయి. నిజమే మరి. వాళ్లే కనుక ముంద డుగు వేయకపోతే, అంత పెద్ద సమస్య పరిష్కారమయ్యేది కాదు. ఇందరి జీవితా ల్లోకి సంతోషం వచ్చేదీ కాదు. - నిఖిత నెల్లుట్ల -
అరటికి గెలాక్సినేషన్
యువ సైంటిస్ట్ వినూత్న ఆవిష్కరణ పిల్లలకు జబ్బు చేయకుండా టీకాలు వేయడం చూశాం. కానీ మొక్కలకు కూడానా?! అవునండి.. ఇది నిజం. మొక్కలకొచ్చే చీడపీడలను నివారించడంతో పాటు, అధిక దిగుబడిని పొందేందుకు ఈ టీకాలు అవసరం అంటున్నారు హైదరాబాద్ యూసఫ్గూడాలోని సెయింట్ మేరీస్ కాలేజీ బయోటెక్నాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ సునీతా పాణిగ్రహి. ఇటీవల వైజాగ్‌లో జరిగిన ఆరో అంతర్జాతీయ సదస్సు (భవిష్యత్‌లో డీఎన్ఏ-లెడ్ టెక్నాలజీ)-2014లో అరటి మొక్కలకు వ్యాక్సినేషన్ అనే థీసిస్‌కు ఆమె ‘యంగ్ సైంటిస్ట్ అవార్టు’ లభించింది. వ్యాక్సినేషన్‌తో మొక్కల్లో ఫినాల్ శాతం పెరుగుతుందన్న అంశంపై సమర్పించిన పరిశోధన పత్రానికి గతేడాది కూడా అదే సదస్సులో సునీత ఇదే అవార్డును అందుకున్నారు. నిజానికి సునీత వ్యవసాయ కుటుంబంలోంచి రాలేదు. అయినా రైతులకు ఏదైనా చేయాలన్న తపనే ఆమెను ఈ రంగంలోకి తీసుకొచ్చింది... ఓ వైపు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా రాణిస్తూ మరోవైపు పరిశోధనలతో దూసుకుపోతున్న ఈ 32 ఏళ్ల యువ బయోటెక్నాలజీ శాస్త్రవేత్త ఎనిమిదేళ్లు కృషి చేసి అరటి మొక్కలకు టీకాల పద్ధతిని కనుగొన్నారు. నిరుపేదల నుంచి ధనికుల వరకు అందరికీ చౌక ధరలో దొరికే పండు ఒక్క అరటేనని నమ్మి ఆమె ఈ పరిశోధన మొదలు పెట్టారు. ఈ పరిశోధనకు ముందు ఆమె కందులు, శనగలపై ప్రయోగాలు చేశారు. ఆ తర్వాత అరటిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. ‘‘వ్యాక్సిన్‌ను సహజసిద్ధ మృత్తికలతో మా కాలేజీ ల్యాబ్‌లోనే తయారు చేశాను. దీన్ని అరటి మొక్కలకు ఇస్తే అవి ఆరోగ్యంగా పెరిగి ఆరు నెలల్లో ఇవ్వాల్సిన దిగుబడిని రెండు నెలల్లోనే ఇస్తాయి. ప్రభుత్వ సాయంతో రైతులందరికీ టీకాలు వేసిన అరటి మొక్కలు అందించాలన్నదే నా ధ్యేయం’’ అని అంటున్నారు సునీత. ఇద్దరు పిల్లల ఆలన పాలన చూసుకుంటూ ఇంటినీ, ఉద్యోగాన్నీ, పరిశోధనల్ని సమన్వయ పరచుకుంటూ ముందుకు సాగుతున్న సునీతకు భర్త శ్రీధర్ ప్రోత్సాహం ఎంతగానో ఉంది. ‘‘కుటుంబ మద్దతు లేకపోతే ఎవరూ ఏమీ సాధించలేరు. అందులోనూ నా ఫ్యామిలీలో ఉద్యోగం చేస్తున్న మహిళను నేనొక్కదాన్నే. నాకు ఇద్దరు అబ్బాయిలు. నా భర్త ప్రస్తుతం సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. నేను ఏదైనా సాధించానంటే దానికి కారణం మా నాన్నగారు త్రినాథ్ పాణిగ్రాహి, భర్త శ్రీధర్. మా స్వస్థలం వైజాగ్. నా విద్యాభ్యాసమంతా అక్కడే జరిగింది. ఇప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ చేస్తున్నాను. 2007లో హైదరాబాద్ వచ్చాను. అప్పటి నుంచి ఈ కాలేజీలోనే పని చేస్తున్నాను. నా పరిశోధనలు సజావుగా సాగడానికి సహోద్యోగులు, విద్యార్థులు అందిస్తున్న సహకారం మరువ లేనిదే’’నంటారు సునీత. సునీత చిన్నప్పటి నుంచే ఒకవైపు వాలీబాల్, త్రోబాల్ లాంటి క్రీడల్లో చురుగ్గా పాల్గొంటూ మరోవైపు సైన్స్‌లో చిన్న చిన్న పరిశోధనలు చేయడం మొదలు పెట్టారు. ఈ యంగ్ సైంటిస్ట్‌కు స్నేహితులతో ముచ్చటించడం, స్విమ్మింగ్, సైక్లింగ్ అంటే ఇష్టం. పుస్తకాలు చదవడం తక్కువే అయినా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవడం అలవాటు. హీరోయిన్ ‘కలర్స్’ స్వాతి, హీరో సాయి ధరమ్‌తేజ్ సునీత విద్యార్థులే. - నిఖిత నెల్లుట్ల ఫొటోలు: దయాకర్