మనసున్నవాడు.. మార్గం చూపాడు!
ఆదర్శం
ప్రతి మనిషికీ మనసుంటుంది. అయితే ప్రతి మనసూ స్పందించదు. ఎదుటివారి కోసం పరితపించదు. ఇతరులకు ఏదో ఒకటి చేయాలని ఆరాట పడదు. ధ్రువ్ లక్రాది స్పందించే మనసు. అందరి కోసమూ ఆలోచించే మనసు. అందుకే ఇవాళ అతని కారణంగా ఎంతోమంది జీవితాల్లోకి సంతోషం వచ్చింది.
ముంబైకి చెందిన ధ్రువ్ డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత డీఎస్పీ మెరిల్ లించ్ కంపెనీలో ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా జాయిన్ అయ్యాడు. జీతం, జీవితం బాగానే ఉన్నాయి. కానీ మనసే బాలేదు. ఏదో అసంతృప్తి. డబ్బు వద్దు. విలాసాలూ వద్దు.
సరదాలు అసలే వద్దు. ఇంకేదో కావాలి. ఏమిటది? సేవ. పదిమందికి ఉపయోగపడాలి. లేకపోతే జీవితానికి అర్థమే ఉండదు. అలా ఆలోచించి దస్రా అనే సేవా సంస్థలో చేరాడు. చిన్న పిల్లల అక్రమ రవాణా నుంచి ఎన్నో అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడే సంస్థ అది. ఆ పోరాటంలో తానూ భాగమయ్యాడు ధ్రువ్. కానీ అంతలోనే ఆక్స్‌ఫర్డ్ యూని వర్సిటీలో ఎంబీయే సీటు వచ్చింది. దాంతో లండన్ వెళ్లిపోయాడు. తర్వాత ఇండియా తిరిగి వచ్చి ఓ బిజినెస్ పెట్టుకున్నాడు. మళ్లీ సేవ గురించి ఆలోచిస్తున్నప్పుడే ఒక ఊహించని సంఘటన జరిగింది.
ఓ రోజు తన కారు చెడిపోతే.. ఆఫీసు నుంచి ఇంటికి సిటీ బస్సులో బయలు దేరాడు ధ్రువ్. అతని ముందు సీటులో ఒకబ్బాయి కూర్చున్నాడు. అతని దగ్గరకు కండక్టర్ వచ్చి, టికెట్ ఎక్కడికి ఇవ్వాలని అడిగాడు. ఆ అబ్బాయి సైగలతో చెప్పాడు. కండక్టర్‌కి అర్థం కాక మళ్లీ అడిగాడు. అతను మళ్లీ సైగ చేశాడు. అలా చాలాసేపు నడిచాక కండక్టర్‌కి విసుగొచ్చే సింది. దిగిపొమ్మని అరిచాడు. దాంతో ఆ యువకుడు ఓ పేపర్ పైన అతను ఎక్కడికి వెళ్లాలో రాసి చూపించాడు.
ఇది చూసిన ధ్రువ్‌లో ఏదో చలనం.
మనసులోని మాటలను బయటికి చెప్పాలని ఉన్నా చెప్పలేకపోవడం ఎంత బాధాకరమో కదా అనుకున్నాడు. గతంలోనూ అలాంటి చాలామందిని చూశాడు. చూసినప్పుడల్లా మథనమే. ఈరోజూ అంతే. అవే ఆలోచనలతో ఇంటికి చేరాడు. సరిగ్గా అప్పుడే ఓ కొరియర్ బాయ్ వచ్చాడు. ధ్రువ్‌ని చూసి చిరునవ్వు నవ్వి, కవర్ అందించాడు. సంతకం చేసి కవర్ అందుకుని లోపలికి వచ్చేశాడు ధ్రువ్. ఆ క్షణం... అతని మెదడులో ఓ కొత్త ఆలోచన మెదిలింది.
అర నిమిషం కూడా పట్టలేదు కొరియర్ తీసుకోవడానికి. కొరియర్ బాయ్‌తో మాట్లాడే అవసరమూ రాలేదు. అంటే ఈ పనికి మాట, వినికిడి అవసరం లేదు. కాబట్టి ఆ రెండూ లేనివాళ్లు కొరియర్ బాయ్స్‌గా పని చేయవచ్చు. ఆ ఆలోచన వచ్చిందో లేదో... ఇక ఆగలేక పోయాడు ధ్రువ్. వెంటనే మిరాకిల్ కొరియర్ కంపెనీకి పునాది వేశాడు.
మిరాకిల్ కొరియర్స్‌కు 2009లో హెలెన్ కెల్లర్ అవార్డు, 2010లో జాతీయ అవార్డులు దక్కాయి. అప్పటి అధ్యక్షురాలు ప్రతిభాపాటిల్ చేతుల మీదుగా ధృవ్ ఆ అవార్డును అందుకున్నాడు. మిరాకిల్ కొరియర్స్‌లో ఎప్పటికప్పుడు ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తుంటాడు. కొత్తగా వచ్చిన వారికి ఇంగ్లిష్, కంప్యూటర్‌లో శిక్షణ ఇస్తుంటాడు. జీవితంలో ఎదిగేందుకు ఏం చేయాలో, వైకల్యాన్ని ఎలా అధిగమించాలో చెప్పి వారిలో స్ఫూర్తిని నింపుతుంటాడు.
మొదట ముగ్గురితో ప్రారంభమైన మిరాకిల్ కొరియర్స్‌లో ప్రస్తుతం 70 మందికి పైగా బాయ్స్ ఉన్నారు. అందులో అందరూ వినికిడి లోపం ఉన్నవారే. ఆడ పిల్లలకేమో కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి డేటా ఆపరేటర్లుగా నియమించాడు. ఆర్డర్లు, డెలివరీల వివరాలను వాళ్లు ఆన్ లైన్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు. ప్రస్తుతం ఈ కంపెనీ నెలకు అరవై అయిదు వేల డెలివరీలకు పైగా చేస్తోందట. మహీంద్ర అండ్ మహీంద్ర, ఆదిత్య బిర్లా గ్రూప్, గోద్రెజ్, విక్టరీ ఆర్ట్ ఫౌండేషన్ లాంటి పెద్ద కంపెనీలు కూడా ఈ కంపెనీ క్లయింట్సే.
ఆరెంజ్ కలర్ యూనిఫామ్‌లో, నగరమంతా చకచకా తిరుగుతూ, తమ వైకల్యాన్ని మర్చిపోయిన ఆ యువకులని చూసి మురిసిపోతుంటాడు ధ్రువ్. ఇప్పు డతని మనసులో అసంతృప్తి అన్నదే లేదు.
- నిఖిత నెల్లుట్ల