Scientist Dr Parveen Chhuneja Elected School Of Agricultural Mentor Award For The Year 2022, Full Details Inside - Sakshi
Sakshi News home page

Triticum Mentor Award 2022: పురస్కారం..: పచ్చనాకు సాక్షిగా...

Published Sat, Jul 2 2022 12:13 AM | Last Updated on Sat, Jul 2 2022 10:32 AM

Scientist Dr Parveen Chhuneja elected School of Agricultural Mentor Award for the year 2022 - Sakshi

చేనులోని గోధుమను ఎప్పుడైనా పలకరించారా?
అది తన గోడు వెళ్లబుచ్చుకోదు. మన గోడు ఏమిటో శ్రద్ధగా వింటుంది. మన ఆకలి తీరుస్తుంది... అందుకే గోధుమ అంటే నార్మన్‌ బోర్లాగ్‌కు అంత ఇష్టం.

మన దేశం కరువు కోరల్లో చిక్కుకుపోయిన ఒకానొక సమయంలో ఆయన సృష్టించిన గోధుమ వంగడాలు అద్భుతాన్ని సృష్టించాయి. రైతు కంట్లో వెలుగులు నింపాయి. అందుకే ఆయన ఫోటో మన రైతుల ఇండ్లలో కనిపిస్తుంది.
ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళుతున్న బోర్లాగ్‌ గ్లోబల్‌ రస్ట్‌ ఇనిషియేటివ్‌ (బీజీఆర్‌ఐ) అంతర్జాతీయ అవార్డ్‌కు ఎంపికైన డా.పర్వీన్, మెంటర్‌ విభాగంలో ఈ అవార్డ్‌కు ఎంపికైన తొలిభారతీయ శాస్త్రవేత్త...


నార్మన్‌ బోర్లాగ్‌ అనే పేరు వినబడగానే అమెరికన్‌ పేరులా అనిపించదు. ఆత్మీయనేస్తంలా ధ్వనిస్తుంది. మెక్సికోలో ఇంటర్నేషనల్‌ మైజ్‌ అండ్‌ వీట్‌ ఇంప్రూవ్‌మెంట్‌ సెంటర్‌ డైరెక్టర్, ఇంటర్నేషనల్‌ అగ్రికల్చరల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌గా పనిచేసిన బోర్లాగ్‌ రోగనిరోధక శక్తితో కూడిన, అధిక దిగుబడి ఇచ్చే డ్వార్ఫ్‌(చిన్న) గోధుమ వంగడాలను సృష్టించి రైతునేస్తం అయ్యాడు. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు.

మన దేశం కరువు కోరల్లో చిక్కుకున్న విషాదకాలంలో ఆయన సృష్టించిన గోధుమ వంగడాలు మనకు ఎంతో ఉపయోగపడ్డాయి. కరువు కోరల నుంచి రక్షించాయి. గోధుమ ఉత్పత్తిలో మన రైతులు స్వయంసమృద్ధి సాధించేలా చేశాయి.
అందుకే ఉత్తరభారతంలోని రైతుల ఇండ్లలో ఆయన ఫోటో కనిపిస్తుంది.

బోర్లాగ్‌ కుమార్తె జీని బోర్లాగ్‌ తండ్రి కృషిని ముందుకు తీసుకెళుతోంది. గ్లోబల్‌ వీట్‌ కమ్యూనిటీని బలోపేతం చేయడంలో విశేషమైన కృషి చేస్తున్న జీని బోర్లాగ్‌ ‘సూపర్‌ ఉమెన్‌ ఆఫ్‌ వీట్‌’ గా పేరుగాంచింది. బోర్లాగ్‌ గ్లోబల్‌ రస్ట్‌ ఇన్‌షియేటివ్‌(బీజిఆర్‌ఐ) చైర్‌పర్సన్‌గా గోధుమ రంగానికి సంబంధించిన పరిశోధన ఫలితాలను రైతుల దగ్గరికి తీసుకెళుతుంది.

2010లో ఏర్పాటు చేసిన జీని బోర్లాగ్‌ లాబ్‌ వుమెన్‌ ఇన్‌ ట్రిటికమ్‌ మెంటర్‌ అవార్డ్‌ను గోధుమరంగంలో విశిష్ట కృషి చేసిన వారికి, కొత్తతరాన్ని ప్రోత్సహిస్తున్న వారికి ఇస్తున్నారు. ఈ సంవత్సరం ఈ ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ అవార్డ్‌కు గానూ పంజాబ్‌కు చెందిన శాస్త్రవేత్త డా.పర్వీన్‌ చూనెజ ఎంపికైంది.

లుథియానాలోని స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ బయోటెక్నాలజీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పర్వీన్‌ యువ మహిళా శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించడంలో చేసిన కృషికి ఈ అవార్డ్‌ లభించింది. ఇప్పటివరకు 30 మంది మహిళా యువ శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించింది. వీరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖస్థానాలలో పనిచేస్తున్నారు.

గతంలో మన దేశం నుంచి డా.మిథాలీ బన్సాల్, డా.సాను ఆరోరా ఎర్లీ కెరీర్‌ విభాగంలో ఈ అవార్డ్‌కు ఎంపియ్యారు. పర్వీన్‌ ఆధ్వర్యంలోనే ఈ ఇద్దరు పీహెచ్‌డీ చేయడం విశేషం.
వివిధ దేశాల నుంచి ఎర్లీ కెరీర్‌ విన్నర్స్‌తో పాటు మెంటర్స్‌ను కూడా ఎంపిక చేస్తుంది బీజిఆర్‌ఐ. మెంటర్‌ విభాగంలో ఈ అవార్డ్‌ అందుకోనుంది పర్వీన్‌. మన దేశం నుంచి ఈ విభాగంలో ఎంపికైన తొలి భారతీయ సైంటిస్ట్‌గా ప్రత్యేకత సాధించింది పర్వీన్‌.

పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో జన్మించిన పర్వీన్‌  కెఎన్‌ జైన్‌ గర్ల్స్‌ హైయర్‌ సెకండరీ స్కూల్‌లో చదువుకుంది. చదువులో ఎప్పుడూ ముందుండేది. సందేహాలను తీర్చుకోవడంలో ఎప్పుడూ సంశయించేది కాదు. లుథియానాలోని పంజాబ్‌ అగ్రికల్చరల్‌ యూనివర్విటీలో బీఎస్సీ చేసింది. 1992లో పీహెచ్‌డీ పూర్తి చేసింది. 1996లో డీఎస్‌టీ యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డ్, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్, న్యూ దిల్లీ ‘ఔట్‌స్టాండింగ్‌ ఉమెన్‌ సైంటిస్ట్‌’ అవార్డ్‌తో సహా ఎన్నో అవార్డ్‌లు అందుకుంది. ఇంటర్నేషనల్‌ వీట్‌ కాంగ్రెస్‌ సభ్యురాలిగా ఉంది.

‘పర్వీన్‌లో మార్గదర్శక నైపుణ్యాలే కాదు, గొప్ప స్నేహలక్షణాలు ఉన్నాయి. ఆమె దగ్గర పనిచేయడం అంటే ఎన్నో కొత్తవిషయాలను తెలుసుకునే అవకాశమే కాదు, క్రమశిక్షణ కూడా అలవడుతుంది’ అంటున్నారు పంజాబ్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ సర్వ్‌జీత్‌ సింగ్‌.

లుథియానాలోని స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ బయోటెక్నాలజీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పర్వీన్‌ యువ మహిళా శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించడంలో చేసిన కృషికి ఈ అవార్డ్‌ లభించింది. ఇప్పటివరకు 30 మంది మహిళా యువ శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించింది. వీరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖస్థానాలలో పనిచేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement