high yield
-
ఏపీలో ప్రకృతి సాగు భేష్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయ విధానం ఆదర్శనీయమని ప్రపంచ ప్రసిద్ధి చెందిన గ్లోబల్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ టూల్‌కిట్ (జిస్ట్) ఇంపాక్ట్ సంస్థ ప్రకటించింది. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలవుతున్న ప్రకృతి వ్యవసాయం ప్రపంచంలోనే వ్యవసాయ పర్యావరణానికి (అగ్రో ఎకాలజీకి) అతి పెద్ద పరివర్తన (మార్పు) అని తెలిపింది. ప్రకృతి వ్యవసాయం ప్రస్తుత వ్యవసాయ విధానాలకు సరియైన లాభసాటి ప్రత్యామ్నాయ విధానమని వెల్లడించింది. అధిక దిగుబడి, అత్యున్నత జీవనోపాధి, సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రకృతి వ్యవసాయం ఎంతగానో దోహదపడుతుందని తెలిపింది. ప్రపంచ స్థాయి సంస్థల కూటమి (గ్లోబల్ అలయన్స్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్ ) మద్దతుతో జిస్ట్ ఇంపాక్ట్ సంస్థ ఆంధ్రఫ్రదేశ్‌లో నిర్వహించిన అధ్యయన ఫలితాలను బుధవారం వెల్లడించింది. భావితరాలను దృష్టిలో ఉంచుకొని ప్రపంచ స్థాయిలో ఆహార వ్యవస్థల్లో పరివర్తన తేవడానికి ఈ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మూడు విభిన్న ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయ ఫలితాలను నిశితంగా పరిశీలించారు. కోస్తా, రాయలసీమ, డెల్టా ప్రాంతాల్లో అధ్యయనం చేశారు. 2020 – 2022 మధ్య ఎంపిక చేసిన 12 గ్రామాల్లో ఇంటింటా సమగ్ర ప్రాథమిక సర్వే చేశారు. విస్తృత ప్రయోజనాలతో నిర్వహించిన ఈ అధ్యయనంలో పలు అంశాలు వెలుగు చూశాయి. వ్యవసాయ పర్యావరణ మార్పునకు దోహదం ఇతర విధానాలతో పోల్చితే సంప్రదాయ జీవ ఎరువులతో చేస్తున్న ప్రకృతి వ్యవసాయంలో అధిక దిగుబడి వస్తోంది. ఈ విధానంలో పంట వైవిధ్యత చూపితే 11% అధిక దిగుబడి వ స్తుంది. ఇది పెరుగుతున్న జనా భాకు సరిపడే ఆహారాన్ని ఉత్పత్తి చేస్తుంది. తద్వారా 49% అధిక లాభం చేకూరడంతో ప్రకృతి వ్యవసాయ కుటుంబాల్లో ఆనందం వెల్లి విరుస్తోంది. ఆ రైతుల కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. రైతు వ్యవస్థ బలంగా తయారవుతోందని వెల్లడించింది. ప్రకృతి సాగులో మహిళా శ్రామిక శక్తి అధికం మహిళా సంఘాల సభ్యులు భాగస్వామ్యం పెరుగు తుండడంతో ప్రకృతి సాగులో మహిళా శ్రామిక శక్తి అధికంగా కనిపిస్తోందని జిస్ట్ ఇంపాక్ట్ పేర్కొంది. మహిళలు క్రియాశీలక పాత్ర పోషిస్తుండడంతో కు టుంబాల మధ్య ఐక్యత, అన్యోన్యత పెరుగు తు న్నాయి. తద్వారా సామాజిక పెట్టుబడిలో పెరుగు దల స్పష్టంగా కన్పిస్తోంది. ఇతర పద్ధతుల్లో వ్యవ సాయం చేసే రైతులతో పోలిస్తే ప్రకృతి సాగు చేసే రైతుల్లో 33%తక్కువ పని దినాలతోనే అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్నారు. సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేసే రైతులు మితిమీరి వినియోగి స్తున్న రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల ఉత్పాదకత నష్టాలతోపాటు అనారో గ్యానికి గురవుతున్నారు. ప్రకృతి సాగులో ఆ పరిస్థితి కన్పించడంలేదు. గ్రామీణ జీవనోపాధి, పౌష్టికాహా రం, జీవ వైవిధ్య నష్టం, వాతావరణ మార్పు, నీటి కొరత, కాలుష్యం వంటి బహుళ అభివృద్ధి సవాళ్లను ప్రకృతి సాగు చేస్తున్న రైతులు అధిగమిస్తున్నారని అధ్యయనంలో గుర్తించినట్టు ఆ సంస్థ తెలిపింది. భవిష్యత్ ప్రణాళికకు ఇదొక బ్లూ ప్రింట్ మా పరిశోధన వాతావరణ పర్యావరణ అనుకూల వ్యవసాయ అభివృద్ధికి ఒక నమూనా (బ్లూప్రింట్)గా ఉపయోగపడుతుంది. ఏపీని స్ఫూర్తిగా తీసు కొని ప్రకృతి వ్యవసాయంలో ముందుకె ళ్లాలని భాగస్వామ్య దేశాలకు సిఫార్సు చేస్తాం. – పవన్ సుఖ్‌దేవ్, జిస్ట్ ఇంపాక్ట్, సీఈవో ప్రభుత్వ కృషి ప్రశంసనీయం ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతుల జీవితాలు, సమాజంలో మార్పుకు కృషి జరుగు తున్నట్టు గుర్తించాం. సంప్రదాయ వ్యవ సాయం నుంచి రైతులను ప్రకృతి వ్యవ సాయం దిశగా తీసుకు వె ళ్లేందుకు ప్రభుత్వం చే స్తున్న కృషి ప్రశంసనీయం. – లారెన్ బేకర్, డిప్యూటీ డైరెక్టర్, గ్లోబల్ అలయన్స్ ఫర్ ది ఫ్యూచర్ అంతర్జాతీయంగా గుర్తింపు భవిష్యత్‌లో ఎదురయ్యే ఆహార సంక్షోభ పరి స్థితులకు ప్రకృతి వ్యవసాయం ఒక్కటే చక్క టి పరిష్కారమని జిస్ట్ ఇంపాక్ట్ సర్వే స్పష్టం చేస్తోంది. రెండేళ్లపాటు శాస్త్రీయ పద్ధతిలో చేసిన ఈ అధ్యయనం ఫ లితాలు రాష్ట్రంలో ప్రకృతి సాగుకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చేందుకు దోహదపడతాయి. – టి.విజయ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్, రైతు సాధికార సంస్థ -
పురస్కారం..: పచ్చనాకు సాక్షిగా...
చేనులోని గోధుమను ఎప్పుడైనా పలకరించారా? అది తన గోడు వెళ్లబుచ్చుకోదు. మన గోడు ఏమిటో శ్రద్ధగా వింటుంది. మన ఆకలి తీరుస్తుంది... అందుకే గోధుమ అంటే నార్మన్ బోర్లాగ్‌కు అంత ఇష్టం. మన దేశం కరువు కోరల్లో చిక్కుకుపోయిన ఒకానొక సమయంలో ఆయన సృష్టించిన గోధుమ వంగడాలు అద్భుతాన్ని సృష్టించాయి. రైతు కంట్లో వెలుగులు నింపాయి. అందుకే ఆయన ఫోటో మన రైతుల ఇండ్లలో కనిపిస్తుంది. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళుతున్న బోర్లాగ్ గ్లోబల్ రస్ట్ ఇనిషియేటివ్ (బీజీఆర్‌ఐ) అంతర్జాతీయ అవార్డ్‌కు ఎంపికైన డా.పర్వీన్, మెంటర్ విభాగంలో ఈ అవార్డ్‌కు ఎంపికైన తొలిభారతీయ శాస్త్రవేత్త... నార్మన్ బోర్లాగ్ అనే పేరు వినబడగానే అమెరికన్ పేరులా అనిపించదు. ఆత్మీయనేస్తంలా ధ్వనిస్తుంది. మెక్సికోలో ఇంటర్నేషనల్ మైజ్ అండ్ వీట్ ఇంప్రూవ్మెంట్ సెంటర్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్సెస్ ప్రొఫెసర్‌గా పనిచేసిన బోర్లాగ్ రోగనిరోధక శక్తితో కూడిన, అధిక దిగుబడి ఇచ్చే డ్వార్ఫ్(చిన్న) గోధుమ వంగడాలను సృష్టించి రైతునేస్తం అయ్యాడు. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు. మన దేశం కరువు కోరల్లో చిక్కుకున్న విషాదకాలంలో ఆయన సృష్టించిన గోధుమ వంగడాలు మనకు ఎంతో ఉపయోగపడ్డాయి. కరువు కోరల నుంచి రక్షించాయి. గోధుమ ఉత్పత్తిలో మన రైతులు స్వయంసమృద్ధి సాధించేలా చేశాయి. అందుకే ఉత్తరభారతంలోని రైతుల ఇండ్లలో ఆయన ఫోటో కనిపిస్తుంది. బోర్లాగ్ కుమార్తె జీని బోర్లాగ్ తండ్రి కృషిని ముందుకు తీసుకెళుతోంది. గ్లోబల్ వీట్ కమ్యూనిటీని బలోపేతం చేయడంలో విశేషమైన కృషి చేస్తున్న జీని బోర్లాగ్ ‘సూపర్ ఉమెన్ ఆఫ్ వీట్’ గా పేరుగాంచింది. బోర్లాగ్ గ్లోబల్ రస్ట్ ఇన్షియేటివ్(బీజిఆర్‌ఐ) చైర్‌పర్సన్‌గా గోధుమ రంగానికి సంబంధించిన పరిశోధన ఫలితాలను రైతుల దగ్గరికి తీసుకెళుతుంది. 2010లో ఏర్పాటు చేసిన జీని బోర్లాగ్ లాబ్ వుమెన్ ఇన్ ట్రిటికమ్ మెంటర్ అవార్డ్‌ను గోధుమరంగంలో విశిష్ట కృషి చేసిన వారికి, కొత్తతరాన్ని ప్రోత్సహిస్తున్న వారికి ఇస్తున్నారు. ఈ సంవత్సరం ఈ ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ అవార్డ్‌కు గానూ పంజాబ్‌కు చెందిన శాస్త్రవేత్త డా.పర్వీన్ చూనెజ ఎంపికైంది. లుథియానాలోని స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పర్వీన్ యువ మహిళా శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించడంలో చేసిన కృషికి ఈ అవార్డ్ లభించింది. ఇప్పటివరకు 30 మంది మహిళా యువ శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించింది. వీరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖస్థానాలలో పనిచేస్తున్నారు. గతంలో మన దేశం నుంచి డా.మిథాలీ బన్సాల్, డా.సాను ఆరోరా ఎర్లీ కెరీర్ విభాగంలో ఈ అవార్డ్‌కు ఎంపియ్యారు. పర్వీన్ ఆధ్వర్యంలోనే ఈ ఇద్దరు పీహెచ్డీ చేయడం విశేషం. వివిధ దేశాల నుంచి ఎర్లీ కెరీర్ విన్నర్స్‌తో పాటు మెంటర్స్‌ను కూడా ఎంపిక చేస్తుంది బీజిఆర్‌ఐ. మెంటర్ విభాగంలో ఈ అవార్డ్ అందుకోనుంది పర్వీన్. మన దేశం నుంచి ఈ విభాగంలో ఎంపికైన తొలి భారతీయ సైంటిస్ట్‌గా ప్రత్యేకత సాధించింది పర్వీన్. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో జన్మించిన పర్వీన్ కెఎన్ జైన్ గర్ల్స్ హైయర్ సెకండరీ స్కూల్లో చదువుకుంది. చదువులో ఎప్పుడూ ముందుండేది. సందేహాలను తీర్చుకోవడంలో ఎప్పుడూ సంశయించేది కాదు. లుథియానాలోని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్విటీలో బీఎస్సీ చేసింది. 1992లో పీహెచ్డీ పూర్తి చేసింది. 1996లో డీఎస్టీ యంగ్ సైంటిస్ట్ అవార్డ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్, న్యూ దిల్లీ ‘ఔట్‌స్టాండింగ్ ఉమెన్ సైంటిస్ట్’ అవార్డ్‌తో సహా ఎన్నో అవార్డ్లు అందుకుంది. ఇంటర్నేషనల్ వీట్ కాంగ్రెస్ సభ్యురాలిగా ఉంది. ‘పర్వీన్లో మార్గదర్శక నైపుణ్యాలే కాదు, గొప్ప స్నేహలక్షణాలు ఉన్నాయి. ఆమె దగ్గర పనిచేయడం అంటే ఎన్నో కొత్తవిషయాలను తెలుసుకునే అవకాశమే కాదు, క్రమశిక్షణ కూడా అలవడుతుంది’ అంటున్నారు పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ సర్వ్‌జీత్ సింగ్. లుథియానాలోని స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పర్వీన్ యువ మహిళా శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించడంలో చేసిన కృషికి ఈ అవార్డ్ లభించింది. ఇప్పటివరకు 30 మంది మహిళా యువ శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించింది. వీరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖస్థానాలలో పనిచేస్తున్నారు. -
వెలుగులు నింపే ‘ఓలిక్’ వేరుశనగ!
వేరుశనగలో అత్యంత మేలైన , మెట్ట ప్రాంత రైతులకు అధిక రాబడిని అందించే రకాలేవి? ఓలిక్ యాసిడ్ ఎక్కువ శాతం ఉండే రకాలు! ఎందుకని?.. సాధారణ వేరుశనగలు 2 నెలల్లోనే మెత్తబడి పోతాయి. వీటిలో ఓలిక్ యాసిడ్ 45–50% వరకు ఉండటమే కారణం. కాబట్టి, ఇటువంటి వేరుశనగలతో వివిధ ఉత్పత్తులను తయారు చేయటం కష్టం. ఓలిక్ యాసిడ్ 80% వరకు ఉంటే.. 9 నెలల వరకు మెత్తబడి పాడు కాకుండా నిల్వ చేయొచ్చు! అంతేకాదు.. ఓలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే వేరుశనగలు వినియోగదారుల ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా మేలు చేస్తాయి. అందుకే.. మన దేశంలో, ఇతర ఆసియా దేశాల్లోని ఆహార శుద్ధి కంపెనీలు ఆస్ట్రేలియా నుంచి ఓలిక్ యాసిడ్ 80% వరకు ఉన్న వేరుశనగలను ప్రతి ఏటా వేలాది టన్నులు దిగుమతి చేసుకుంటున్నాయి. ఓలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే వేరుశనగ రకాలను మనమే అభివృద్ధి చేసుకోగలిగితే ఎంతబావుంటుందో కదా..? ఆ రకాలు అధిక ఉష్ణోగ్రతను, బెట్టను, తిక్క తెగులు, తుక్కు తెగుళ్లను కూడా సమర్థవంతంగా తట్టుకొనగలిగినవైతే మన రైతులకు మరింత మేలు కదూ? సరిగ్గా ఏడేళ్ల క్రితం డా. పసుపులేటి జనీలకు ఈ ఆలోచన వచ్చింది. మెదక్ జిల్లా పటాన్‌చెరులోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ(ఇక్రిశాట్)లోని వేరుశనగ వంగడాల అభివృద్ధి విభాగంలో ముఖ్య శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆమె నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఏడేళ్ల పాటు కొనసాగించిన పరిశోధన సఫలీకృతమైంది. గుజరాత్‌లోని జునాగఢ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని తిరుపతి పరిశోధనా కేంద్రం, ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని పాలెం పరిశోధనా కేంద్రం, తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు కూడా ఈ పరిశోధనలో, క్షేత్రప్రయోగాల్లో పాలుపంచుకున్నారు. జన్యుమార్పిడి విత్తనాలు కావు.. తిరిగి వాడుకోవచ్చు.. ఇక్రిశాట్లో డా. జనీల ఆధ్వర్యంలో 2011 నుంచి ఓలిక్ యాసిడ్ అధికంగా ఉండే వంగడాలపై పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ఓలిక్ యాసిడ్ అధికంగా ఉండే అమెరికన్ వంగడం(సనోలిక్95ఆర్)తో స్థానిక వంగడాలను సంకరపరచి 16 కొత్త వంగడాలను రూపొందించారు. జన్యుమార్పిడి పద్ధతులను అనుసరించలేదు. మాలిక్యూలర్ మార్కర్స్తోపాటు అనేక సాంకేతికతలను వినియోగించడం ద్వారా సాధారణం కన్నా 3–4 ఏళ్ల ముందుగానే పరిశోధనను తక్కువ ఖర్చుతోనే కొలిక్కి తెచ్చామని డా. జనీల సంతోషంగా చెప్పారు. ఓలిక్ యాసిడ్ 80% వరకు ఉండే ఐ.సి.జి.వి. 03043 అనే రకంతో పాటు మరో రెండు వేరుశనగ వంగడాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ రకాలను సాగు చేసే రైతులు తమ పంట నుంచి కొన్ని కాయలను పక్కన పెట్టుకొని తిరిగి విత్తనంగా వాడుకోవచ్చు. స్థానికంగా క్షేత్ర ప్రయోగాలు చేసిన తర్వాత వేరుశనగ విస్తారంగా సాగయ్యే గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో 2017లో ప్రయోగాత్మకంగా సాగు చేయించారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌కు చెందిన నరసింహారెడ్డి తదితర రైతులు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటివరకూ రైతులు ఇష్టపడి సాగుచేస్తున్న వేరుశనగ రకాల కన్నా (5–15% నుంచి 84% వరకు) అధిక దిగుబడి వచ్చిందని, ఓలిక్ యాసిడ్ 80% వరకు వచ్చిందని డా. జనీల ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. సాధారణంగా మన వేరుశనగ గింజల్లో 48% వరకూ వచ్చే నూనె దిగుబడి.. ఐ.సి.జి.వి. 03043 రకంలో 53% రావటం విశేషమన్నారు. ఆరోగ్యదాయకం.. ఓలిక్ యాసిడ్ అధికంగా ఉండే వేరుశనగలు వినియోగదారులకు మరింత ఆరోగ్యదాయకమైనవి. ఓలిక్ యాసిడ్ తక్కువగా ఉండే సాధారణ వేరుశనగలు లేదా వాటితో తయారు చేసిన ఆహారోత్పత్తులు రెండు నెలల్లో మెత్తబడుతాయి. కాబట్టి, ఆహార శుద్ధి కర్మాగారాల యాజమాన్యాలు ఆస్ట్రేలియా నుంచి 9 నెలల పాటు నిల్వ సామర్థ్యం కలిగిన, అధిక ఓలిక్ యాసిడ్ ఉండే వేరుశనగలను ఏటా భారీగా దిగుమతి చేసుకుంటున్నాయి. ఇప్పుడు సిద్ధమైన కొత్త వంగడాలు పూర్తిగా సాగులోకి వస్తే ఈ కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మన దేశంలోని ఆహార శుద్ధి కర్మాగారాలకు ఇంకా ఓలిక్ యాసిడ్ ప్రాధాన్యంపై తగినంత చైతన్యం లేదని ఆమె అన్నారు. వీరిలో చైతన్యం పెంపొందించడంతోపాటు రైతులకు కొత్త వంగడాలను అందిస్తే పరిశ్రమకు, రైతులకు, వినియోగదారులకు కూడా మేలు కలుగుతుంది. ఓలిక్ యాసిడ్ అధికంగా ఉండడం వల్ల వేరుశనగ నూనె వాసన మెరుగ్గా ఉంటుందని, గుండె జబ్బుల నివారణతోపాటు అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరతాయని ఆమె అన్నారు. రైతుల ఉత్పత్తిదారుల సంఘాలు ఆహార శుద్ధి కంపెనీలతో ముందస్తు ఒప్పందాల మేరకు ఈ వంగడాలను సాగు చేయాలని సూచిస్తున్నారు. ఈ వంగడాలను సాగు చేయటం వల్ల రైతులకు అధిక ఉత్పత్తితోపాటు కనీసం 10% అధిక ధర కూడా లభిస్తుందని డా. జనీల చెబుతున్నారు. గుజరాత్లో సుమారు 8 వేల మంది రైతులతో కూడిన ఖెదుత్ ఫుడ్స్ అండ్ ఫీడ్స్ అనే సంస్థ ద్వారా ప్రయోగాత్మకంగా కొత్త వంగడాలను సాగు చేయించారు. మార్కెట్ అవసరాలకు తగినంత నాణ్యత కలిగిన వేరుశనగలను వారు పండించి లబ్ధిపొందుతున్నారని డా. జనీల వివరించారు. ప్రస్తుతం దేశంలో 48 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగవుతోంది. ఇక్రిశాట్ రూపొందించిన కొత్త వంగడాలు తక్కువ ఎరువులు, పురుగుమందులతోనే మంచి దిగుబడినిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అత్యధికంగా 40 వరకు ఊడలు వస్తున్నందున ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుంటాయని చెబుతున్నారు. సేంద్రియ వ్యవసాయదారులు కూడా ఈ వంగడాలను సాగు చేయడం ద్వారా మంచి గిట్టుబాటుధర పొందడానికి అవకాశం ఉంటుందంటున్నారు. చెట్టుకు 30కి పైగా కాయలున్నాయి..! పదేళ్లుగా వేరుశనగను సాగు చేస్తున్నా. కె6, టాగ్ 24 రకాలు మచ్చ(తిక్క) తెగులును తట్టుకోవటం లేదు. దిగుబడి 3, 4 క్వింటాళ్లే వస్తున్నది. ఈ ఏడాది ఐ.సి.జి.వి. 03043 రకం సాగు చేశా. మచ్చ తెగులును తట్టుకోవటంతో చేనంతా పచ్చగా ఉంది. ఊడలు ఎక్కువగా వచ్చాయి. 60 రోజుల తర్వాతే ఊడలు వస్తున్నాయి. చెట్టుకు 30కి పైగా కాయలు ఉన్నాయి. 5 నెలల పంట కాలం. ఆకుమచ్చ తెగులు రాలేదు కాబట్టి ఆకు రాల్లేదు. మంచి పశుగ్రాసం కూడా వస్తుంది. తుప్పు తెగులు ఒకటి, రెండు మొక్కలకు తప్ప రాలేదు. 10 రోజుల్లో కాయలు కోస్తాం. బాగా లాభదాయకంగా ఉంటుందనుకుంటున్నా. – మల్లాయపల్లి నరసింహారెడ్డి (86869 55757), వేరుశనగ రైతు, శ్రీరంగాపూర్, వనపర్తి జిల్లా నారాయణ, కె6 కన్నా అధిక దిగుబడి.. ఉత్పత్తిదారుల సంఘాలకు విత్తనాలిస్తాం! ఈ కొత్త వేరుశనగ వంగడాలను ఆంధ్రప్రదేశ్‌లో సాగు చేయించగా.. నారాయణ రకంతో సమానంగా దిగుబడి వచ్చింది. ఓలిక్ యాసిడ్ 80% వచ్చింది. అధిక ఉష్ణోగ్రతను, బెట్టను, తుప్పు తెగులు, తిక్క తెగులును తట్టుకున్నాయి. తెలంగాణలో కె6 కన్నా మెరుగైన దిగుబడి వచ్చింది. 2018లో కూడా క్షేత్రస్థాయి ప్రయోగాలు కొనసాగుతాయి. ఆ తర్వాత అధికారికంగా విడుదల అవుతాయి. అయితే, ఈ లోగానే కొంత మేరకు విత్తనోత్పత్తి కోసం వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలకు, జాతీయ విత్తన సంస్థ(ఎన్.ఎస్.సి.)కు వచ్చే ఖరీఫ్ నాటికి కొత్త విత్తనాలను అందించాలనుకుంటున్నాం. – డా. పసుపులేటి జనీల (99899 30855), ముఖ్య శాస్త్రవేత్త, ఇక్రిశాట్, పటాన్చెరు, మెదక్ జిల్లా. p.janila@cgiar.org వేరుశనగ రకాల మధ్య తేడాలను వివరిస్తున్న రైతు నరసింహారెడ్డి – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
ఆగస్టు 20న ఆక్వాపోనిక్స్‌పై శిక్షణ
అత్యాధునిక రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ (ఆక్వాపోనిక్స్) పద్ధతిలో.. తక్కువ స్థలంలో, తక్కువ ఖర్చుతో మంచినీటి చేపల అధిక దిగుబడి సాధించడంపై ఆగస్టు 20వ తేదీన యువ ఆక్వా రైతు శాస్త్రవేత్త విశ్వనాథరాజు శిక్షణ ఇవ్వనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం గండేడ్ గ్రామంలో గల తన ఆధునిక చేపల సాగు క్షేత్రంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం వరకు శిక్షణ ఇస్తారు. ఆక్వాపోనిక్స్ పద్ధతిలో చేపల సాగుకు తెలంగాణ ప్రభుత్వం 50% సబ్సిడీ ఇవ్వడానికి సుముఖత తెలిపిందని విశ్వనాథరాజు తెలిపారు. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు ఆయనను 90302 28669 నంబరులో సంప్రదించవచ్చు. -
ఉద్యాన తోటల పెంపకంలో రక్షిత సేద్యం లాభదాయకం
డీడీ సుబ్బరాయుడు, ఏడీ సత్యనారాయణ, ఇంజనీరు శృతి అనంతపురం అగ్రికల్చర్: ఉద్యాన తోటల పెంపకంలో రక్షిత సేద్యపు పద్ధతులు అవలంభిస్తే అధిక దిగుబడితోపాటు అదనపు ఆదాయం పొందొచ్చని ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) బీఎస్ సుబ్బరాయుడు, అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) సీహెచ్ శివసత్యనారాయణ, ఇంజనీరు శృతి తెలిపారు. ప్రభుత్వం పండ్లతోటల రైతులకు ప్రాధాన్యత ఇస్తూ వివిధ రకాల పథకాలు అమలు చేస్తున్నందున రైతులు వినియోగించుకోవాలని వారు సూచించారు. రక్షిత సేద్యం ప్రాధాన్యత : ఉద్యాన తోటల్లో ఇటీవల కాలంలో రక్షిత సేద్యం (ప్రొటెక్ట్డ్ కల్టివేషన్) వి«ధానాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఉద్యాన రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, అత్యాధునిక యాజమాన్య పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుండటంతో ఆ దిశగా రైతులు కూడా దృష్టి సారిస్తే ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుంది. పాలీహౌస్‌లు, షేడ్‌నెట్స్, గ్రీన్ హౌస్, ప్యాక్ హౌస్, ఫారంపాండ్స్, మల్చింగ్, కోల్డ్ స్టోరేజీలు, రైపనింగ్ ఛాంబర్లు తదితర పథకాలకు 50 శాతం రాయితీ వర్తిస్తుంది. వీటిలో వివిధ రకాల వాణిజ్య పంటలు సాగు చేయడం వల్ల తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన సుస్థిరమైన దిగుబడి వస్తుంది. పంట కాలంలోనూ, పంట కోత తర్వాత జరిగే నష్టాలను సైతం బాగా తగ్గించుకోవచ్చు. పంటలకు ఆశించే చీడపీడలు, తెగుళ్లను కూడా అరికట్టొచ్చు. కూరగాయలు, క్యాప్సికం, కీరదోస, జర్బేరా పూలు, గులాబీ, చామంతి లాంటి పంటలు వేసుకుంటే మామూలు పద్ధతిలో కన్నా రెండింతలు దిగుబడి వస్తుందని పరిశోధనలు, ప్రయోగాల ద్వారా నిరూపణ అయ్యింది. రైతుకు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నందున వినియోగించుకోవాలి. రాయితీలు : ఒక ఎకరా పాలీహౌస్ నిర్మాణంలో భాగంగా ఒక చదరపు మీటరుకు రూ.844 ఖర్చు అవుతుంది. ఒక ఎకరా పాలీహౌస్ నిర్మాణానికి రూ.40 లక్షలు ఖర్చు అవుతుండగా అందులో ప్రభుత్వం రూ.16.88 లక్షలు భరిస్తుండగా మిగతాది రైతులు చెల్లించాల్సి ఉంటుంది. షేడ్‌నెట్స్ విషయానికొస్తే ఒక చదరపు మీటర్‌కు రూ.460 ఖర్చు అవుతుండగా ఇందులో 50 శాతం రాయితీ వర్తిస్తుంది. షేడ్‌నెట్స్ ఒక ఎకరాలో నిర్మించుకోవాలంటే రూ.18 లక్షలు ఖర్చు కానుండగా అందులో రూ.9 లక్షలు ప్రభుత్వం భరిస్తుంది. ఫారంపాండ్ల విషయానికి వస్తే 20 “ 20 “ 3 మీటర్ల కొలతల నిర్మాణానికి రూ.75 వేలు సబ్సిడీ, ప్యాక్ హౌస్‌లకు రూ.2 లక్షలు సబ్సిడీ వర్తిస్తుంది. ఇక కోల్డ్ స్టోరేజీలు, రైపనింగ్ ఛాంబర్లకు 35 శాతం రాయితీ వర్తిస్తుంది. ఉద్యానశాఖ అధికారులను సంప్రదించి మరిన్ని వివరాలు, దరఖాస్తు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం 79950 86792, 79950 86790, 95151 63080 సంప్రదించాలి. -
పంట మార్పిడి.. అధిక దిగుబడి
నీటి పొదుపు ముఖ్యం.. రైతులకు అవగాహన అవసరం మండల వ్యవసాయ అధికారి నాగరాజు జగదేవ్‌పూర్: నీరు వ్యవసాయానికి ప్రాణాధారం. పంటలకు ఎంతో అవసరమైన నీటిని విచక్షణా రహితంగా వాడడం వల్ల జలవనరులు రోజు రోజుకు తరిగి నీటి ఎద్దడి ఏర్పడుతోంది. దీంతో నీటి కొరత ఏర్పడి సాగు చేయలేని దుస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం వర్షాలు పుష్కలంగా కురవడంతో చెరువులు, కుంటల్లోకి భారీగానీరు చేరింది. ఈ దశలో రబీలో వరితోపాటు, ఆరుతడి పంటలను చేసుకోవచ్చని మండల వ్యవసాయ అధికారి నాగరాజు తెలిపారు. ముఖ్యంగా పంట మార్పిడి వల్ల భూసారం పెరిగి నాణ్యమైన పంట దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. ఆయన అందించిన సలహాలు.. సూచనలు.. ఆరుతడి పంటలు సాగు చేయడం వల్ల ఎక్కువ దిగుబడి, ఆదాయాన్ని పొందవచ్చు. ఆరుతడి పంటలు సాగు చేయటం వలన తక్కువ నీరు, తక్కువ విద్యుత్, తక్కువ పెట్టుబడులతో అధిక ఆదాయాన్ని పొందడం వీలవుతుంది. ఒక ఎకరం వరిసాగుకు కావాలసిన నీటితో కనీసం 2 నుంచి 3 ఎకరాలు ఆరుతడి పంటలను సాగు చేయవచ్చు. వరుసగా వరి పండించడం కన్నా, పంట మార్పిడితో భూమి సారవంతమై, ఎరువుల ఖర్చు తగ్గి దిగుబడులు పెరుగుతాయి. పురుగులు, తెగుళ్లు కూడా తక్కువగా అశిస్తాయి. ఆరుతడి పంటలు వేయడం వల్ల మనకు నిత్యావసరాలైన పప్పులు, నూనెగింజలు, కూరగాయల కొరత కూడా తగ్గుతుంది. వరి మాగాణిలో కూడా వరికి ప్రత్యామ్నాయంగా రబీలో మొక్కజొన్న, జోన్న, గోధుమ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆవాలు, కుసుమలు, ఆముదం, సోయాచిక్కుడు, శనగ, మినుము, పెసర, ధనియాలు, మొదలైన పంటలను సాగు చేసుకోవాలి. వాతావరణ నేలలు నీటి లభ్యతలను బట్టి ఆరుతడి పంటలుగా పండించవచ్చు. అలాగే డ్రిప్పు సౌకర్యంతో ఆరుతడి పంటలను పండించుకోవాలి. మొక్కజొన్న రబీలో ఆరుతడి పంటగా మొక్కజొన్న పంటను ఆక్టోబర్, నవంబర్ మాసాలలో విత్తాలి. చలి బాగా ఉండే ప్రాంతాల్లో డిసెంబర్ నెలలో విత్తితే మొలక రాదు. తేమను ఉంచే నేలలు మొక్కజోన్న పంటలకు బాగా అనుకూలం. చౌడు, నీటి ముంపు నేలలు మొక్కజోన్న పంట సాగుకు పనికి రావు. పొద్దుతిరుగుడు ఈ పంటను నీటి పారుదల కింద రబీ, వేసవి పంటగా విత్తి అధిక దిగుబడి , అధిక ఆదాయం పొందవచ్చు. పొద్దుతిరుగుడు పంటను రబీలో నవంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి మొదటి వారం వరకు విత్తుకోవచ్చు. ఈ పంటను అన్ని రకాల నేలల్లోనూ సాగు చేయవచ్చు. కాకపోతే నీటి ముంపును తట్టుకోదు. ధనియాలు రబీలో నల్ల భూముల్లో ధనియాలు పండించడానికి చాలా అనుకూలం. చల్లని వాతావరణంతో పాటు తక్కువ ఉష్ణోగ్రత, వాతావరణంలో మంచు ఈ పంటకు అనుకూలం. నీటి సౌకర్యం ఉన్నచోట ఆరుతడి పంటగా తేలికపాటి నీటి తడులలో తక్కువ కాలంలో ఈపంటను పండించవచ్చు. గోధుమ పంట గోధుమ పంట ప్రధానంగా రబీ కాలపు పంట. ఈ పంట పెరుగుదలకు చల్లని వాతావరణంతో పాటు గాలిలో 50 శాతం కంటే తక్కువ తేమ, అల్ప ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలలో ఎక్కువ దిగుబడి పొందవచ్చు. ఈ పంట జిల్లాలో సాగుకు అనుకూలమే. నల్లరేగడి భూములలో వర్షాధారంగా సాగు చేయవచ్చు. ముఖ్యంగా తేమ నిలుపుకునే భూములు (బరువైన నేలలు) బాగా అనుకూలం. నీటి సౌకర్యం ఉన్న చోట ఆరుతడి పంటగా తేలిక తడులు పారించి అన్ని రకాల భూములలో గోధుమ పండించవచ్చు. శనగ శనగ పంట ఎక్కువ శాతం నల్లరేగడి భూముల్లో పండే పంట. మొక్కజొన్న పంట పూర్తి కాగానే చాలా మంది రైతులు శనగ పంట వేసేందుకు మొగ్గు చూపుతారు. ముందుగా రెండు మూడు సార్లు దుక్కిని దున్ని నాగలి లేదా ట్రాక్టరుతో విత్తనం వేయాలి. నీరు అధికంగా ఉంటే ఈ పంట పండడం సాధ్యం కాదు. మంచు ఎక్కువ శాతం ఉండే ప్రాంతాల్లో శనగ పంట బాగా పండుతుంది. ఆరుతడి పంటలకు నేల తయారీ ఆరుతడి పంటల సాగుకు నేల యాజమాన్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ వహించాలి. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, ఆముదం, శనగ పంటలను వరి కోసిన తరువాతే దుక్కిచేయకుండా విత్తే విధానం ఆచరణలోకి వచ్చింది. దీనిని జీరో టిల్లేజి విధానం అంటాం. వరి కోసిన తరువాత దుబ్బులు చిగురించకుండా ఉండేందుకు, అప్పటికే మొలచివున్న కలుపును నివారించేందుకు పారాక్వాట్ అనే కలుపును మందును పిచికారి చేయాలి. లీటరు నీటికి 8మి.లీ.కలుపు మందును కలుపు మొక్కలు, వరి దుబ్బులు బాగా తడిసేలా పిచికారి చేయాలి. తరువాత వెంటనే విత్తనాలు విత్తుకొవచ్చు. భూమిలో సరైన తేమ లేనప్పడే తేలికపాటి నీటితడి ఇచ్చి విత్తనాన్ని విత్తకోవాలి. లేదా విత్తే యంత్రాలు సహాయంతో వేసుకోవాలి. వేరుశనగ, ఆవాలు తదితర పంటలను సాగు చేయటానికి వరి తరువాత నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు నాగలితోగాని, ట్రాక్టరుతో దున్నటానికి వీలుపడదు. భూమి ఆరితే దున్నినప్పుడు పెద్ద పెద్ద పెడ్డలు ఏర్పడుతాయి. అందుకని తగినంత తేమ నేలలో ఉన్నప్పుడు రెండులేదా మూడు సార్లు దున్ని నేలను బాగా చదును చేసుకొని విత్తనం వేసుకోవాలి. -
ఈ సమయం.. అగ్గికి అనుకూలం
ముందు జాగ్రత్త చర్యలు నత్రజని ఎరువును తక్కువగా వేయడం, పొటాష్ ఎరువును ప్రతిసారీ ఎకరాకు 15 కేజీల చొప్పున వినియోగించడం, పొలం గట్లపై కలుపు మొక్కలు, గరిక తొలగించడం, పొట్ట దశలో 50 శాతం, వెన్నుదశలో ఒకసారి ట్రైసైక్లోజోల్ పొడి మందు 100 గ్రాములను 100 లీటర్ల నీటికి లేదా కాసుగామైసిన్ 2.5 మి.లీ మందును లీటరు నీటికి కలిపి పైరుపై పిచికారీ చేయాలి. అగ్గి తెగులు వ్యాప్తి ఇలా.. వాతావరణం చల్లగా ఉండి, గాలిలో తేమ ఎక్కువగా ఉంటే వరి ఆకుల అంచు వెంట ముదురు గోధమ రంగులో నూలుకండె ఆకారంలో, ఆకుల మధ్యలో బూడిద రంగులో మచ్చలు ఏర్పడతాయి. ఆకులు ఎండిపోయి తగలబడినట్లు కనిపిస్తాయి. ఈ లక్షణాలను అగ్గి తెగులు అంటారు. మంచు కురవడం, వర్షపు చిరు జల్లులు పడటం, నత్రజని ఎరువులు అధికంగా వాడటం వల్ల ఈ తెగులు త్వరగా వ్యాప్తి చెందుతుంది. వెన్ను మొదటి భాగంలో కణుపుల వద్ద అగ్గి తెగులు వస్తే వెన్ను విరిగి కిందకు వాలిపోతాయి. గింజలు సరిగా పాలు పోసుకోకపోవడం వల్ల ఎక్కువ శాతం తాలు గింజలు ఏర్పడతాయి. సుడిదోమ, దోమపోటు గోధుమ రంగులో ఉన్న దోమలు గుంపులుగా నీటి పైభాగాన దుబ్బులపై ఉండి రసాన్ని పీల్చడం వల్ల ఆకు, మొక్కలు పసుపు రంగులోకి మారి క్రమంగా సుడులు సుడులుగా ఎండిపోతాయి. చిన్న చిన్న రెక్కలు గల పురుగులు పూతదశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. తల్లిపురుగులు ప్రత్యేక కాళ్ల నిర్మాణం వల్ల అవి ఒక మూలగా కదులుతాయి. అన్ని పురుగులు మూలగా తిరగడం వల్ల పైరు సుడులుగా చనిపోతుంది. అందుల్లే వీటిని సుడిదోమ అని అంటారు. పైరు వెన్ను దశలో 20 నుంచి 25 పురుగులు ఉన్నట్లయితే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. పొలంలో నాట్లు వేసే సమయంలో ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీ చొప్పున తూర్పు, పడమర దిశలో కాలిబాటలు వదలాలి. పొలంలో నీటి మట్టం ఎక్కువ లేకుండా చూసుకోవాలి. అప్పుడప్పుడూ పొలాన్ని ఆరబెడుతూ ఉండాలి. చివరి దఫా ఎరువుల మోతాదుతో పాటు కార్భోప్యూరాన్ 3జీ పది కేజీలు లేక కార్భాఫ్ హైడ్రోక్లోరైడ్ 4జీ 8 కేజీల గుళికలు వాడాలి. కనీస ప్రమాద స్థాయిని గమనించిన వెంటనే క్రిమిసంహారక మందులైన ఇంనోఫెన్ప్రాజె 2.0 మి.లీ లేదా బూప్రోఫెజిమ్ 2 లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లే దా డైనటోఫ్యూరాన్ 0.5 గ్రాములను లీటరు నీటికి కలిపి దుబ్బు మొదళ్లకు తగిలేలా వృత్తకారంగా పొలం గట్ల నుంచి లోపలికి పిచికారీ చేస్తే దోమపోటు బారి నుంచి వరిపైరును సమర్థవంతంగా నివారించవచ్చు. నివారణ మార్గాలు అగ్గి తెగులు ఆశించిన వెంటనే ఐసోప్రొథియోలేన్ 1.5 మి.లీను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే తెగులు వ్యాప్తిని అరికట్టవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లోనే ఆకు ఎండు తెగులు, వెన్ను తీసిన పొలాల్లో మానిపండు తెగుళ్లు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆకు ఎండు తెగులు బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఆకుల అంచుల వద్ద పసుపు రంగు మచ్చలు ఏర్పడి పైనుంచి కిందకు ఎండిపోతాయి. దీనికి ఎటువంటి నివారణ మందులు లేవు. నత్రజని ఎరువులను ఒకే సారి కాకుండా మూడు నుంచి నాలుగు దఫాలుగా వేయాలి. తెగులు 5 శాతం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఎరువులు వేయడం ఆపాలి. పొలంలో నీటిని తీసివేయాలి. పూతదశలో అండాశయం శిలీంద్రం వల్ల పసుపు పచ్చ ముద్దగా, ఆకుపచ్చ రంగులోకి మారి చివరకు నల్లబడి చిన్న చిన్న ఉండలుగా తయారవుతాయి. కార్బండిజమ్ ఒక గ్రాము లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 2.5 గ్రాములు లేదా ప్రొఫికోనజోల్ ఒక మి.లీ మందును లీటరు నీటికి కలిపి వెన్నులు పైకి వచ్చే దశలో పిచికారీ చేసుకోవాలి. -
శ్రీవరి.. సిరులే మరి!
కొత్త పద్ధతి మంచిగనిపిస్తన్నది నాకు నీళ్ల సవులత్కు బోరున్నది. ఎప్పుడు ఏసినట్టె ఆనకాలంల ఎకరం ఒరేయాలనుకున్న. పొలం తయారు చేసేటందుకు దుక్కి దున్నుకుంటున్న. గప్పుడే మా ఉళ్లే ఉన్న సీనువాస్ సార్, ఆంజనేయులుతోని నా పొలం కాడికి వచ్చిండ్రు. శ్రీ పద్ధతిల ఒరి వేయమని ఒక్క తీరుగ జె ప్పిండ్రు. ఎట్లయితె అట్లయితదని ఆ ళ్లు చెప్పినట్టె నారు పోసిన. జెరంత ముదిరిన నారు ఏసిన. అయినా పె ద్దగ కష్టం లేకుండనె శేను బాగా ఎది గింది. నిరుడు 30 బస్తాలు పండిన శేన్ల 40-45 బస్తాలు మోస్తదనిపిస్తున్నది. ఒక్కరోజుల నలుగురు నాటేసిండ్రు. అన్ని ఖర్సులు బాగా తగ్గినయ్. - బాలయ్య, నెంటూరు వరి పొలంలో ఎల్లప్పుడూ నీరుంటే.. వరి పొలంలో ఎల్లపుడు సమృద్ధిగ నీరుంటేనే అధిక దిగుబడి వస్తుందన్నది అపోహ మాత్రమే. పొలంలో నీరు నిల్వ ఉన్నట్లయితే మొక్క వేరులో గాలి సంచులు తయారు చేసేందుకు ఎక్కువ శక్తి వినియోగించాల్సి ఉంటుంది. ధాన్యం తయారీకి దోహదపడాల్సిన ఈ శక్తిని గాలి సంచులు తయారు చేసి మొక్క బతకడానికి వాడుకుంటుంది. వేరు వ్యవస్థ కొసలు వరి పూత దశకు వచ్చేటప్పటికి 70 శాతం మేర కుళ్లి పోషకాలను తీసుకోలేవు. దీంతో దిగుబడి పడిపోతుంది. శ్రీ పద్ధతిలో సాధారణ వరి సాగుకులో మూడో వంతు నీరు మాత్రమే సరిపోతుంది. నీరు నిల్వ ఉండదు కాబట్టి వేర్లు భూమిలోనికి చొచ్చుకుపోయి మొక్కలు దృఢంగా, బలంగా పెరుగుతాయి. విత్తనంలో తాలు గింజల తొలగింపు విత్తుకొద్ది పంట అంటారు పెద్దలు. అందుకే మనం ఎంపిక చేసుకున్న విత్తనంలో తాలు గింజలు, రోగ కారక విత్తనాలు లేకుండా చూసుకోవాలి.శ్రీ వరి విధానంలో ఒక ఎకరం పొలంలో నాటు వేసేందుకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. తాలు తొలగించేందుకు విత్తనాలను మొదట మంచినీటిలో వేయాలి. తేలిన తాలు గింజలను తొలగించాలి. తరువాత విత్తనాలను ఉప్పు నీటిలో వేసి తేలిన వాటిని తీసేయాలి. నీటి అడుగు భాగానికి చేరిన విత్తనాలను (గట్టి గింజలు) మంచి నీటితో రెండు సార్లు కడిగి ఆవు మూత్రం, పేడ ద్రావణం పట్టించి నీడలో ఆరబెట్టి 24 గంటలు మండెకట్టాలి. నారుమడి యాజమాన్యం ‘శ్రీ’ పద్ధతిలో 8 నుంచి 12 రోజుల నారు నాటాలి కాబట్టి నారు పెంచడంలో మెలకువలు పాటించాలి. ఒక సెంటు మడిలో 2 కిలోల విత్తనం చల్లి నారు పెంచితే ఎకరం పొలానికి సరిపోతుంది. భూమిని మెత్తగా దున్ని దమ్ము చేసి, ఎత్తుగా తయారు చేసి చుట్టూ కాలువలు తీయాలి. తడిమట్టి జారిపోకుండా నారుమడి చుట్టూ చెక్కతోగాని, బొంగులతోగాని ఊతం ఏర్పాటు చేయాలి. నారుమడి తయారైన తరువాత చివి కిన మెత్తటి పశువుల ఎరువును ఒక పొరలాగా చల్లి, 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండెకట్టిన మొలకెత్తిన విత్తనాన్ని పలుచగా చల్లాలి. విత్తనాలపైన మరోపొర పశువుల ఎరువు చల్లి గడ్డిని కప్పాలి. మొలకెత్తిన వెంటనే గడ్డిని తీసేయాలి. శ్రీపద్ధతిలో లాభాలు మెండు శ్రీపద్ధతిలో విత్తన ఖర్చు బాగా తగ్గుతుంది. సాధారణ పద్ధతికి భిన్నంగా ఆరుతడి పంట కాబట్టి 30 నుంచి 40 శాతం వరకు నీటి వినియోగం తగ్గుతుంది. సేంద్రియ విధానం ఆచరించడం వల్ల ఆరోగ్యకరమైన, రుచికరమైన ధాన్యంతోపాటు, నాణ్యమైన పశుగ్రాసం లభ్యమవుతుంది. రసాయన ఎరువులు, పురుగుల మందుల ఖర్చు తగ్గుతుంది. వీడర్‌తో ఎక్కువగా మట్టిని గుల్ల చేయడంతో పోషక పదార్థాల లభ్యత అధికమై కంకి పొడవు, గింజ బరువు పెరిగి ఎక్కువ దిగుబడి వస్తుంది. 10 రోజుల వరకు పంటకాలం తగ్గుతుంది. ఖర్చు తగ్గి, దిగుబడి పెరుగుతుంది. నీటి కష్టాలుండవు. చీడపీడల నివారణ సేంద్రియ ఎరువుల వాడకం, మొక్కల మధ్య దూరం వల్ల ఈ పద్ధతిలో చీడపీడలు ఆశించే అవకాశాలు తక్కువ. ఎప్పుడైనా వీటిని నివారించాల్సిన సమయంలో సంప్రదాయ పద్ధతులు, సహజ జీవన ఎరువులు వాడాలి. వేపనూనె లేదా వేప గింజల కషాయంతో పురుగుల సంతతి అరికట్టవచ్చు. ప్రధాన పొలం తయారీ సాధారణ పద్ధతి మాదిరిగా ఎక్కువ రోజులు పొలంలో నీరు నిలబెట్టి లోతుగా దుక్కి దున్నకూడదు. పొలం దున్నడానికి, పచ్చిరొట్ట ఎరువు మురగడానికి సరిపడా నీటిని దాదాపు వారం రోజులపాటు పొలంలో ఉంచాలి. 3-4 అంగుళాల లోతుకు మించకుండా దుక్కి దున్నుకోవాలి. దీనివల్ల వీడర్ దిగబడదు. వరి మొక్కను పైననే నాటాలి కాబట్టి ఈ లోతు దుక్కి సరిపోతుంది. సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు దమ్ములో వేయాలి. దమ్ము చేసిన పొలంలో చేతితో లాగే రోలర్ మార్కర్‌తో 25ఁ25 సెంటీ మీటర్ల దూరంలో నిలువు, అడ్డంగా గీతలు గీయాలి. నాలుగు గీతలు కలిసిన చోట వరి నారు మొక్కలు నాటాలి. నాట్లు వేయడంలో జాగ్రత్తలు శ్రీపద్ధతిలో 8నుంచి 12 రోజుల వయసు లేత నారును నాటాలి. చలికాలంలో 13-15 రోజుల నారు వేయవచ్చు. నాటుకు ముందే ఎరువులు దుక్కిలో వేసి దమ్ము చేయాలి. లేత మొక్కను తక్కువ ఎత్తులో నాటడం వల్ల తొందరగా నిలదొక్కుకుని పిలకల సంఖ్య పెరుగుతుంది. నారు పీకిన తరువాత సాధ్యమైనంత త్వరగా అదేరోజు మొక్కలు నాటాలి. మొక్క అంటిపెట్టుకున్న గింజను వేర్లు దెబ్బతినకుండ బొటన వేలు, చూపుడు వేలు సహాయంతో గీతలు కలిసే చోట తక్కువ ఎత్తులో జాగ్రత్తగా నాటాలి. దూరంగా మొక్కలు నాటడం వల్ల ప్రతి మొక్క ఆకులకు సూర్యరశ్మి బాగా సోకుతుంది. దీంతో తగినంత స్థలం, నీరు, పోషకాలు అంది వేర్లు దృఢంగా పెరిగి మొక్క చకచకా వృద్ధి చెందుతుంది. నారువేసిన మరుసటి రోజు నుంచి 10 రోజుల వరకు పలుచగా నీరుపట్టాలి. నీటి పారుదల శ్రీపద్ధతిలో పొలం తడిచేలా మాత్రమే నీళ్లు పెట్టాలి. నేల సన్నటి నెర్రెలు ఏర్పడుతున్న దశలో మళ్లీ నీళ్లు పెట్టాలి. నేల, వాతావరణం ఆధారంగా ఎన్ని రోజులకోసారి నీళ్లు పెట్టాలో నిర్ణయించుకోవాలి. వీడరు తిప్పుటకు ఒకరోజు ముందు నీరు పెట్టాలి. శ్రీ పద్ధతిలో తడుల సంఖ్య 30 శాతం మేర తగ్గుతుంది. సాధారణ వరిలో ఒక కిలో విత్తనం పండించేందుకు 5,000 లీటర్ల నీరు అవసరం కాగా శ్రీపద్ధతిలో 2,000-2,500 లీటర్ల నీరు సరిపోతుంది. పొలాన్ని నిరంతరం తడుపుతూ ఆరబెట్టడం వల్ల నేలలోని సూక్ష్మ జీవులు బాగా వృద్ధి చెంది ఎక్కువ పోషకాలు సులభంగా మొక్కలకు అందుతాయి. పునరుత్పత్తి, పొట్ట దశలో కూడా పొలానికి పలుచగా నీళ్లు పెట్టాలి. కలుపు యాజమాన్యం పొలంలో నీరు నిలువకుండా చూస్తాం కాబట్టి కలుపు సమస్య అధికం. కలుపు నివారణకు వీడర్‌తో నాటిన 10 రోజులకు ఒకసారి, ఆ తరువాత 10-12 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి మరో మూడుసార్లు నేలను కదిలిస్తే కలుపు మొక్కలు నేలలో కలిసిపోతాయి. తద్వారా ప్రతిసారి హెక్టారుకు ఒక టన్ను పచ్చిరొట్ట ఎరువు భూమికి చేరుతుంది. అంతేకాకుండా మొక్కల వేళ్లకు ఆక్సిజన్ బాగా అందుతుంది. దీంతో సూక్ష్మజీవులు వృద్ధిచెంది నత్రజనిని స్థిరీకరిస్తాయి. వీడర్ చేరుకోలేని కుదుర్ల పక్కన ఉన్న కలుపు మొక్కలను చేతితో తీసేయాలి. వీడర్‌ను మహిళలు సైతం సులభంగా తిప్పి కలుపు నివారించుకోవచ్చు. -
ఒక తడి నీటితో సజ్జ, కందిలో అధిక దిగుబడి
మార్కాపురం : జిల్లాలో 76,300 ఎకరాల్లో కంది, 18, 800 ఎకరాల్లో సజ్జ పంటలు సాగవుతున్నాయి. ఎక్కువ మంది రైతులు సజ్జ, కందిని నేరుగా వేయగా.. కొందరు మాత్రం అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. జూలై నెలాఖరులో సాగు చేసిన సజ్జ పంట ప్రస్తుతం కంకి, సుంకు దశలో ఉంది. కంది పంట కూడా పూత దశలో ఉంది. మరో 25 రోజుల్లో పంటలు కోతకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడి సాధించవచ్చని మార్కాపురం వ్యవసాయాధికారి డీ బాలాజీనాయక్ తెలిపారు. బోర్ల కింద సాగు చేసిన రైతులు సజ్జ పంటకు ఒక తడి నీరివ్వాలని సూచించారు. ఇలా చేస్తే ఎకరాకు 12 నుంచి 14 బస్తాల వరకు దిగుబడి వస్తుందని చెప్పారు. సజ్జ, కంది పంటలను ప్రస్తుతం ఆశిస్తున్న తెగుళ్లు, నివారణ మార్గాలపై ఏఓ బాలాజీనాయక్ సూచనలు.. సలహాలు. వెర్రి కంకి తెగులు సజ్జ పంటను ఇప్పుడు వెర్రి కంకి తెగులు ఆశించే ప్రమాదం ఉంది. ఈ తెగులు సోకిన మొక్కల కాండంపై పూర్తిగా లేదా అసంపూర్తిగా ఆకులుగా మారిన పుష్పగుచ్చం ఏర్పడుతుంది. తెగులు సోకిన మొక్క ఆకులు పసుపు రంగులోకి మారతాయి. గాలిలో తేమ ఎక్కువగా ఉన్న వాతావరణంలో ఆకుల అడుగు భాగాన తెల్లని బూజు కనిపిస్తుంది. వ్యాధి సోకిన మొక్కలను పీకి కాల్చివేయడం ఉత్తమం. తేనె బంక తెగులు ఈ తెగులు సోకిన మొక్క నుంచి గులాబి లేదా ఎరుపు రంగులో ఉన్న తేనె లాంటి చిక్కని ద్రవం బొట్లు బొట్లుగా కారుతుంది. మొక్కలు పుష్పించే దశలో ఆకాశం మబ్బు పట్టి ఉన్నా, వర్షం తుంపర్లు పడినా, వాతావరణం చల్లగా ఉన్నా తెగులు వ్యాప్తి చెందుతుంది. దీని నివారణకు 2.5 గ్రాముల మాంకోజెబ్ మందును లీటరు నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. కందిలో ఆకు చుట్టు పురుగు కంది ప్రస్తుతం 50 రోజుల పంటగా ఉంది. కొన్ని చోట్ల ఆలస్యంగా కూడా సాగు చేశారు. కందిలో పురుగుల నివారణకు ఎకరాకు 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. కంది పెరిగే దశలో ఆకుచుట్టు పురుగు ఆశిస్తుంది. ఆకులు, పూతలను చుట్టగా చుట్టేసి లోపల ఉండి పత్రహరితాన్ని గోకి తింటుంది. ఈ పురుగు నివారణకు 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ మందును లీటరు నీటికి పిచికారీ చేయాలి. కంది పూత, పిందె దశలో ఉన్నప్పుడు కాయ తొలుచు పురుగు ఆశించే ప్రమాదం ఉంది. ఈ పురుగులు కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ ఒక కాయ నుంచి మరో కాయకు ఆశిస్తుంది. పైరు విత్తిన 90 నుంచి 100 రోజుల్లో చిగుళ్లను ఒక అడుగు మేర క త్తిరించాలి. ఎకరాకు నాలుగు లింగార్షక బుట్టలను అమర్చి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. -
యాంత్రీకరణతోనే అధిక దిగుబడి
రస్తాకుంటుబాయి(కురుపాం)న్యూస్‌లైన్: వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు ప్రతి గిరిజన రైతు పాటిస్తే ఆర్థికంగా ఎంతో మేలు ఉంటుందని పార్వతీపురం ఐటీడీఏ పీఓ రజిత్కుమార్షైనీ అన్నారు. అలాగే అధిక దిగుబడులు వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా సాధ్యపడతాయన్నారు. రస్తాకుంటుబా యి కృషి విజ్ఞాన కేంద్రంలో కృషి విజ్ఞాన కేం ద్రం-వ్యవసాయ సాంకేతిక యాజమాన్యసంస్థ లు మంగళవారం సంయుక్తంగా నిర్వహించిన వ్యవసాయ సాంకేతిక వారోత్సవాలకు పీఓ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి వెలిగించి వ్యవసాయసాంకేతిక వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈసందర్బం గా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇటీవలే బెంగళూరులో జరిగిన 600 కేవీకేల జాతీయ సదస్సులో రస్తాకుంటుబాయి కేవీకే చర్చల్లో పాల్గొనడం సంతోషించదగ్గ విషయమని అభినందించారు. గిరిజన రైతులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి ఐటీడీఏ ద్వారా తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి గిరిజన రైతు వ్యవసాయ సాంకేతిక వారోత్సవాలను సద్వినియోగం చేసుకుని శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించాలని సూచిం చారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించి న ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం సంచాలకుడు డాక్టర్ ఎ.శివశంకర్ మాట్లాడుతూ 1990లో సాగులో విత్తనాలను వెదజల్లే పద్ధతు ల్లో ఉండేవారని నేడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అవగాహన కల్పించుకుని వ్యవసాయంలో నూతన పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధించేలా ఎదిగారన్నారు ప్రస్తుతం కూలీలు దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు కాబట్టి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడు లు సాధించేందుకు సాంకేతిక పద్ధతులను విని యోగించుకోవాలన్నారు. అలాగే జిల్లాలో సవ ర భాషలో కూడా వివిధ పంటల కరపత్రాలను అందించడం దేశంలోనే ప్రప్రథమమన్నారు. ఈ వ్యవసాయ సాంకేతిక వారోత్సవాల్లో చింతపల్లి ఎ.డి.ఆర్ డాక్టర్ ఎన్.వేణుగోపాల్, నైరాకళాశాల అధిపతి డాక్టర్ ఎరుకునాయుడు, ఆత్మ పథకం పీడీ రాజబాబు, అనకాపల్లి ఎ.డి.డిఆర్ జమున మాట్లాడారు, అనంతరం కోసివేసిన పంటపొలాల్లో జీరో టిల్లేజ్ పద్ధతులు ద్వారా మొక్క జొన్న పంటవేసే కరదీపికతోపాటు ఇతర వ్యవసాయ పద్ధతులు పాటించే కరపత్రాలను పీఓతోపాటు, శాస్త్రవేత్తలు విడుదల చేశారు. కార్యక్రమంలో కేవీకే ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డాక్టర్ కెల్ల లక్ష్మణ్, కేవీకే సీనియర్ శాస్త్రవేత్తలు డి.చిన్నంనాయుడు, ఎ.ఉపేంద్ర, శ్రీనివాసరావు, భూసార కేంద్రం ఏడీఏలు నాగభూషణం,నాగాచారితోపాటు శాస్త్రవేత్తలు, అధిక సంఖ్యలో గిరిజన రైతులు పాల్గొన్నారు.