మొక్కజొన్న పంట
నీటి పొదుపు ముఖ్యం.. రైతులకు అవగాహన అవసరం
మండల వ్యవసాయ అధికారి నాగరాజు
జగదేవ్‌పూర్: నీరు వ్యవసాయానికి ప్రాణాధారం. పంటలకు ఎంతో అవసరమైన నీటిని విచక్షణా రహితంగా వాడడం వల్ల జలవనరులు రోజు రోజుకు తరిగి నీటి ఎద్దడి ఏర్పడుతోంది. దీంతో నీటి కొరత ఏర్పడి సాగు చేయలేని దుస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం వర్షాలు పుష్కలంగా కురవడంతో చెరువులు, కుంటల్లోకి భారీగానీరు చేరింది. ఈ దశలో రబీలో వరితోపాటు, ఆరుతడి పంటలను చేసుకోవచ్చని మండల వ్యవసాయ అధికారి నాగరాజు తెలిపారు. ముఖ్యంగా పంట మార్పిడి వల్ల భూసారం పెరిగి నాణ్యమైన పంట దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. ఆయన అందించిన సలహాలు.. సూచనలు..
ఆరుతడి పంటలు సాగు చేయడం వల్ల ఎక్కువ దిగుబడి, ఆదాయాన్ని పొందవచ్చు. ఆరుతడి పంటలు సాగు చేయటం వలన తక్కువ నీరు, తక్కువ విద్యుత్, తక్కువ పెట్టుబడులతో అధిక ఆదాయాన్ని పొందడం వీలవుతుంది. ఒక ఎకరం వరిసాగుకు కావాలసిన నీటితో కనీసం 2 నుంచి 3 ఎకరాలు ఆరుతడి పంటలను సాగు చేయవచ్చు.
వరుసగా వరి పండించడం కన్నా, పంట మార్పిడితో భూమి సారవంతమై, ఎరువుల ఖర్చు తగ్గి దిగుబడులు పెరుగుతాయి. పురుగులు, తెగుళ్లు కూడా తక్కువగా అశిస్తాయి. ఆరుతడి పంటలు వేయడం వల్ల మనకు నిత్యావసరాలైన పప్పులు, నూనెగింజలు, కూరగాయల కొరత కూడా తగ్గుతుంది.
వరి మాగాణిలో కూడా వరికి ప్రత్యామ్నాయంగా రబీలో మొక్కజొన్న, జోన్న, గోధుమ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆవాలు, కుసుమలు, ఆముదం, సోయాచిక్కుడు, శనగ, మినుము, పెసర, ధనియాలు, మొదలైన పంటలను సాగు చేసుకోవాలి. వాతావరణ నేలలు నీటి లభ్యతలను బట్టి ఆరుతడి పంటలుగా పండించవచ్చు. అలాగే డ్రిప్పు సౌకర్యంతో ఆరుతడి పంటలను పండించుకోవాలి.
మొక్కజొన్న
రబీలో ఆరుతడి పంటగా మొక్కజొన్న పంటను ఆక్టోబర్, నవంబర్ మాసాలలో విత్తాలి. చలి బాగా ఉండే ప్రాంతాల్లో డిసెంబర్ నెలలో విత్తితే మొలక రాదు. తేమను ఉంచే నేలలు మొక్కజోన్న పంటలకు బాగా అనుకూలం. చౌడు, నీటి ముంపు నేలలు మొక్కజోన్న పంట సాగుకు పనికి రావు.
పొద్దుతిరుగుడు
ఈ పంటను నీటి పారుదల కింద రబీ, వేసవి పంటగా విత్తి అధిక దిగుబడి , అధిక ఆదాయం పొందవచ్చు. పొద్దుతిరుగుడు పంటను రబీలో నవంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి మొదటి వారం వరకు విత్తుకోవచ్చు. ఈ పంటను అన్ని రకాల నేలల్లోనూ సాగు చేయవచ్చు. కాకపోతే నీటి ముంపును తట్టుకోదు.
ధనియాలు
రబీలో నల్ల భూముల్లో ధనియాలు పండించడానికి చాలా అనుకూలం. చల్లని వాతావరణంతో పాటు తక్కువ ఉష్ణోగ్రత, వాతావరణంలో మంచు ఈ పంటకు అనుకూలం. నీటి సౌకర్యం ఉన్నచోట ఆరుతడి పంటగా తేలికపాటి నీటి తడులలో తక్కువ కాలంలో ఈపంటను పండించవచ్చు.
గోధుమ పంట
గోధుమ పంట ప్రధానంగా రబీ కాలపు పంట. ఈ పంట పెరుగుదలకు చల్లని వాతావరణంతో పాటు గాలిలో 50 శాతం కంటే తక్కువ తేమ, అల్ప ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలలో ఎక్కువ దిగుబడి పొందవచ్చు. ఈ పంట జిల్లాలో సాగుకు అనుకూలమే. నల్లరేగడి భూములలో వర్షాధారంగా సాగు చేయవచ్చు. ముఖ్యంగా తేమ నిలుపుకునే భూములు (బరువైన నేలలు) బాగా అనుకూలం. నీటి సౌకర్యం ఉన్న చోట ఆరుతడి పంటగా తేలిక తడులు పారించి అన్ని రకాల భూములలో గోధుమ పండించవచ్చు.
శనగ
శనగ పంట ఎక్కువ శాతం నల్లరేగడి భూముల్లో పండే పంట. మొక్కజొన్న పంట పూర్తి కాగానే చాలా మంది రైతులు శనగ పంట వేసేందుకు మొగ్గు చూపుతారు. ముందుగా రెండు మూడు సార్లు దుక్కిని దున్ని నాగలి లేదా ట్రాక్టరుతో విత్తనం వేయాలి. నీరు అధికంగా ఉంటే ఈ పంట పండడం సాధ్యం కాదు. మంచు ఎక్కువ శాతం ఉండే ప్రాంతాల్లో శనగ పంట బాగా పండుతుంది.
ఆరుతడి పంటలకు నేల తయారీ
ఆరుతడి పంటల సాగుకు నేల యాజమాన్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ వహించాలి. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, ఆముదం, శనగ పంటలను వరి కోసిన తరువాతే దుక్కిచేయకుండా విత్తే విధానం ఆచరణలోకి వచ్చింది. దీనిని జీరో టిల్లేజి విధానం అంటాం. వరి కోసిన తరువాత దుబ్బులు చిగురించకుండా ఉండేందుకు, అప్పటికే మొలచివున్న కలుపును నివారించేందుకు పారాక్వాట్ అనే కలుపును మందును పిచికారి చేయాలి.
లీటరు నీటికి 8మి.లీ.కలుపు మందును కలుపు మొక్కలు, వరి దుబ్బులు బాగా తడిసేలా పిచికారి చేయాలి. తరువాత వెంటనే విత్తనాలు విత్తుకొవచ్చు. భూమిలో సరైన తేమ లేనప్పడే తేలికపాటి నీటితడి ఇచ్చి విత్తనాన్ని విత్తకోవాలి. లేదా విత్తే యంత్రాలు సహాయంతో వేసుకోవాలి.
వేరుశనగ, ఆవాలు తదితర పంటలను సాగు చేయటానికి వరి తరువాత నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు నాగలితోగాని, ట్రాక్టరుతో దున్నటానికి వీలుపడదు. భూమి ఆరితే దున్నినప్పుడు పెద్ద పెద్ద పెడ్డలు ఏర్పడుతాయి. అందుకని తగినంత తేమ నేలలో ఉన్నప్పుడు రెండులేదా మూడు సార్లు దున్ని నేలను బాగా చదును చేసుకొని విత్తనం వేసుకోవాలి.