మార్కాపురం : జిల్లాలో 76,300 ఎకరాల్లో కంది, 18, 800 ఎకరాల్లో సజ్జ పంటలు సాగవుతున్నాయి. ఎక్కువ మంది రైతులు సజ్జ, కందిని నేరుగా వేయగా.. కొందరు మాత్రం అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. జూలై నెలాఖరులో సాగు చేసిన సజ్జ పంట ప్రస్తుతం కంకి, సుంకు దశలో ఉంది. కంది పంట కూడా పూత దశలో ఉంది. మరో 25 రోజుల్లో పంటలు కోతకొచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడి సాధించవచ్చని మార్కాపురం వ్యవసాయాధికారి డీ బాలాజీనాయక్ తెలిపారు. బోర్ల కింద సాగు చేసిన రైతులు సజ్జ పంటకు ఒక తడి నీరివ్వాలని సూచించారు. ఇలా చేస్తే ఎకరాకు 12 నుంచి 14 బస్తాల వరకు దిగుబడి వస్తుందని చెప్పారు. సజ్జ, కంది పంటలను ప్రస్తుతం ఆశిస్తున్న తెగుళ్లు, నివారణ మార్గాలపై ఏఓ బాలాజీనాయక్ సూచనలు.. సలహాలు.
వెర్రి కంకి తెగులు
సజ్జ పంటను ఇప్పుడు వెర్రి కంకి తెగులు ఆశించే ప్రమాదం ఉంది. ఈ తెగులు సోకిన మొక్కల కాండంపై పూర్తిగా లేదా అసంపూర్తిగా ఆకులుగా మారిన పుష్పగుచ్చం ఏర్పడుతుంది. తెగులు సోకిన మొక్క ఆకులు పసుపు రంగులోకి మారతాయి. గాలిలో తేమ ఎక్కువగా ఉన్న వాతావరణంలో ఆకుల అడుగు భాగాన తెల్లని బూజు కనిపిస్తుంది. వ్యాధి సోకిన మొక్కలను పీకి కాల్చివేయడం ఉత్తమం.
తేనె బంక తెగులు
ఈ తెగులు సోకిన మొక్క నుంచి గులాబి లేదా ఎరుపు రంగులో ఉన్న తేనె లాంటి చిక్కని ద్రవం బొట్లు బొట్లుగా కారుతుంది. మొక్కలు పుష్పించే దశలో ఆకాశం మబ్బు పట్టి ఉన్నా, వర్షం తుంపర్లు పడినా, వాతావరణం చల్లగా ఉన్నా తెగులు వ్యాప్తి చెందుతుంది. దీని నివారణకు 2.5 గ్రాముల మాంకోజెబ్ మందును లీటరు నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
కందిలో ఆకు చుట్టు పురుగు
కంది ప్రస్తుతం 50 రోజుల పంటగా ఉంది. కొన్ని చోట్ల ఆలస్యంగా కూడా సాగు చేశారు. కందిలో పురుగుల నివారణకు ఎకరాకు 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. కంది పెరిగే దశలో ఆకుచుట్టు పురుగు ఆశిస్తుంది. ఆకులు, పూతలను చుట్టగా చుట్టేసి లోపల ఉండి పత్రహరితాన్ని గోకి తింటుంది. ఈ పురుగు నివారణకు 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ మందును లీటరు నీటికి పిచికారీ చేయాలి.
కంది పూత, పిందె దశలో ఉన్నప్పుడు కాయ తొలుచు పురుగు ఆశించే ప్రమాదం ఉంది. ఈ పురుగులు కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ ఒక కాయ నుంచి మరో కాయకు ఆశిస్తుంది. పైరు విత్తిన 90 నుంచి 100 రోజుల్లో చిగుళ్లను ఒక అడుగు మేర క త్తిరించాలి. ఎకరాకు నాలుగు లింగార్షక బుట్టలను అమర్చి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
ఒక తడి నీటితో సజ్జ, కందిలో అధిక దిగుబడి
Published Mon, Sep 15 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 PM
Advertisement