రూ.19,200 లంచం తీసుకుంటుండగా పట్టివేత
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి వెంకటేష్ అరెస్ట్
వివరాలు వెల్లడించిన వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య
లెక్క చూపని రూ.1.72లక్షల నగదు స్వాధీనం
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకటేష్ అలియాస్ వెంకట్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం చోటుచేసుకున్న ఈఘటన వివరాలను వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వెల్లడించారు. జిల్లాలోని దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గుండగాని హరీష్.. దంతాలపల్లి మండల కేంద్రంలో 128 గజాల భూమి కొనుగోలు చేశాడు.
రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా గజానికి రూ.200 చొప్పున డిమాండ్ చేయగా.. రూ.150 చొప్పున ఇస్తానని బేరం కుదుర్చుకుని వరంగల్ జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం సాయంత్రం మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పూర్తికాగానే రూ.19,200 నగదును అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకటేష్‌కు ఇవ్వమని సబ్ రిజిస్ట్రార్ చెప్పగా.. హరీష్ ఆ డబ్బులను అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వెంకట్ వద్ద లెక్క చూపని మరో రూ.1.72లక్షలు నగదు ఉండగా స్వాధీనం చేసుకున్నారు.
సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆలేటి వెంకట్‌ను అదుపులోకి తీసుకుని వరంగల్‌లోని ఏసీబీ కోర్టుకు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. దాడుల్లో ఏసీబీ సీఐలు శ్యాంసుందర్, రాజు, సునీల్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment