టీచర్‌తో వివాహేతర సంబంధం.. ఇద్దరు పిల్లులున్నా ప్రియుడే కావాలని.. | Mahabubabad SP Sudhir Reveals Shocking Details In Partha Sarathi Case, Check More Details Inside | Sakshi
Sakshi News home page

టీచర్‌తో వివాహేతర సంబంధం.. ఇద్దరు పిల్లులున్నా ప్రియుడే కావాలని..

Published Fri, Apr 4 2025 7:26 AM | Last Updated on Fri, Apr 4 2025 10:31 AM

Mahabubabad SP Sudhir Key Details Over Crime Case

సాక్షి, మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామ శివారు బోరింగ్‌తండా సమీపంలో గత నెల 31వ తేదీన అర్ధరాత్రి హత్యకు గురైన పార్ధసారథి కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్య.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిందని మహబూబాబాద్‌ ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని జగదీశ్‌ కాలనీలో నివాసం ఉండే తాటి పార్ధసారథికి స్వప్నతో వివాహం జరగగా వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్వప్నకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏటపాక మండలం నెల్లిపాకలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న సొర్లాం వెంకట విద్యాసాగర్‌తో పరిచయం ఉంది. స్వప్న తల్లిగారి ఇంటి ప్రాంతంలో వెంకట విద్యాసాగర్‌ ఇల్లు అద్దెకు తీసుకుని ఉండగా 2016లో స్వప్నకు పరిచయమయ్యాడు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం పార్ధసారథికి తెలియడంతో దంపతుల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. పార్ధసారథి హెచ్చరించినా స్వప్న పట్టించుకోలేదు.

ఈ క్రమంలోనే పార్ధసారథికి మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి ఎంజేపీలో హెల్త్‌ సూపర్‌వైజర్‌ ఉద్యోగం రాగా గతేడాది ఫిబ్రవరి నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. సెలవుల సమయంలో ఇంటికి వెళ్లి వస్తుండగా అప్పుడప్పుడు స్వప్నకు వీడియో కాల్‌ చేసి మాట్లాడేవాడు. అయితే వివాహేతర సంబంధానికి భర్త అడ్డు ఉన్నాడని, అతడిని ఎలాగైనా అంతమొందించాలని స్వప్న తన ప్రియుడు వెంకట విద్యాసాగర్‌కు చెప్పింది. దీంతో వెంకట విద్యాసాగర్‌.. కొత్తగూడెం మండలానికి చెందిన తెలుగూరి వినయ్‌కుమార్‌, శివశంకర్‌, ఏటపాక మండలానికి చెందిన వంశీతో మాట్లాడి పార్ధసారథిని హత్య చేయించాలని పథకం రచించించారు.

దీంతో, ముగ్గురు వ్యక్తులకు రూ.5 లక్షలు సుపారీగా ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉగాది, రంజాన్‌ సెలవుల కోసం పార్ధసారథి కొత్తగూడెం వచ్చి మార్చి 31వ తేదీన సాయంత్రం దంతాలపల్లికి వెళ్లే క్రమంలో కొత్తగూడెంలో దంపతులు షాపింగ్‌ చేశారు. అనంతరం పార్ధసారథి తన బైక్‌పై బయలుదేరాక స్వప్న వెంటనే వెంకట విద్యాసాగర్‌కు ఫోన్‌ చేసి తన భర్త వెళ్తున్న సమాచారం తెలిపింది. దీంతో సుపారీ గ్యాంగ్‌ ఓ కారును అద్దెకు తీసుకుని పార్ధసారథిని వెంబడిస్తూ మహబూబాబాద్‌ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామ శివారు బోరింగ్‌తండా సమీపంలోకి చేరుకోగానే అడ్డగించి దారుణంగా హత్య చేశారు.

ఈ కేసులో పార్ధసారథి భార్య స్వప్న, ప్రియుడు వెంకట విద్యాసాగర్‌ను అరెస్ట్‌ చేయగా వినయ్‌కుమార్‌, శివశంకర్‌, వంశీ పరారీలో ఉన్నారని తెలిపారు. అదే విధంగా ఏడాది క్రితం పార్ధసారథిపై దాడి జరిగిన ఘటనలో రెక్కీ నిర్వహించినట్లు కూసం లవరాజు అనే వ్యక్తిని గుర్తించగా అతడు కూడా పరారీలో ఉన్నారన్నారు. కాగా, కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన డీఎస్పీ తిరుపతిరావు, సీఐలు సర్వయ్య, సూర్యప్రకాశ్‌, హథీరాం,నరేందర్‌, రవికుమార్‌, ఎస్సైలు దీపిక, మురళీధర్‌, సతీశ్‌, ఐటీకోర్‌ పీసీ సుమన్‌, క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ బృందం సభ్యులను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement