సీఎం మొనగాడు కాదు.. మోసగాడు
కాంగ్రెస్ హామీల అమలుకు ఢిల్లీలో రాహుల్ ఇంటిని ముట్టడిస్తాం
తొర్రూరు రైతుధర్నాలో మాజీ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, మహబూబాబాద్: ‘తెలంగాణ సాధించిన కేసీఆర్.. పదేళ్ల పాలనలో రైతు పక్షపాతిగా ఉన్నారు. ఆయనది రైతుగుండె.. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులను మోసగించిన సీఎం రేవంత్‌రెడ్డిది రాతి గుండె’అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. అందరికీ రుణమాఫీ చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్లతో శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో బీఆర్‌ఎస్ రైతు మహాధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో హరీశ్‌రావు మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు కల్ల్లబొల్లి మాటలు చెప్పి, నేనే మొనగాడిని.. రాష్ట్రాన్ని బాగుచేసేది నేనే అని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి అసలు స్వ రూపం బయట పడిందన్నారు. ఆయన మొనగాడు కాదు .. మోసగాడని ప్రజలు గ్రహించారని చెప్పారు.
రుణ మాఫీ పై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒకతీరు.. మంత్రి తు మ్మల మరోతీరు మాట్లాడి రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. సీఎం మాటలు నమ్మిన రైతులు రూ.2 లక్షలకు పైగా ఉన్న అప్పులు చెల్లించారని, రుణమాఫీ అవుతుందని అధిక వడ్డీకి డబ్బులు తెచ్చి ఇప్పు డు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకు సీఎం రేవంత్‌రెడ్డిని, ప్రభుత్వాన్ని విడిచి పెట్టేది లేదని హరీశ్ అన్నారు. హామీల అమలుకు దసరా తర్వాత ఢిల్లీలోని రాహుల్‌గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
మంత్రుల్ని, ఎమ్మెల్యే లను నిలదీయాలని ఆయన పిలుపు నిచ్చారు. కాగా, ధర్నా సందర్భంగా ఓ తొండ తాటికొండ రాజయ్య చొక్కాలోకి వెళ్లడంతో కార్యకర్తలు అప్రమత్తమై దానిని తీసివేశారు. దీంతో కొంతసేపు నవ్వులు విరిశాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదనాచారి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment