ఆగని జోరు
జి.మాడుగుల పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్న గంజాయిని పరిశీలిస్తున్న పాడేరు ఏఎస్పీ శశికుమార్‌రెడ్డి
యథేచ్ఛగా గంజాయి రవాణా దాడులు జరుగుతున్నా జంకని స్మగ్లర్లు నెల రోజుల్లో 13 టన్నుల గంజాయి పట్టివేతఇక్కడ చెల్లించేది రూ. లక్షల్లో.. ఆర్జించేది కోట్లలో..
పాడేరు: ఎక్కడ చూసినా గంజాయి గుప్పుమంటోంది. మన్యం నుంచి యథేచ్ఛగా గంజాయి రవాణా సాగుతోంది. జిల్లాలో రోజుకో చోట పోలీసులు గంజాయి రవాణాను పసిగట్టి అడ్డుకుంటున్నా గంజాయి రవాణా నిత్యకృత్యంగా మారింది. పోలీసుల నిఘా ఉన్నా లెక్క చేయకుండా గంజాయి రవాణాకు స్మగ్లర్లు వెనుకాడటం లేదు. ఈ ఏడాది మన్యంలో పెద్ద ఎత్తున గంజాయి సాగైనట్లు తెలుస్తోంది. రెండు మాసాలుగా గంజాయి రవాణా సాగుతోంది. మన్యం నలుమూలల నుంచి గంజాయిని రవాణా చేస్తున్నారు. పోలీసు, ఎక్సైజ్ అధికారుల కళ్లుగప్పి నిరాటంకంగా తరలిస్తున్నారు. వేలాది ఎకరాల్లో పండిస్తున్న గంజాయిపై ఈ ఏడాది నియంత్రణ లేకపోవడంతో రవాణా జోరు ఎక్కువైంది. వాహన ప్రమాదాల్లో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడుతోంది. మన్యం నుంచి జిల్లా కేంద్రానికి ఆటోలు మొదలుకొని కార్లు, వ్యాన్లు, లారీల్లో భారీగా గంజాయి రవాణా సాగిస్తున్నారు. మన్యం నుంచి విశాఖ జిల్లా కేంద్రానికి పలు దారుల్లో రాత్రి పగలు తేడా లేకుండా గంజాయి రవాణా జరుగుతోంది. జనవరి నెలలో పలుచోట్ల రవాణాలో పోలీసులకు సుమారు 13 వేల కిలోలు గంజాయి పట్టుబడింది. గొలుగొండ, దేవరాపల్లి, నర్సీపట్నం, పెదబయలు, వేపాడ, రావికమతం, చింతపల్లి, హుకుంపేట, గోపాలపట్నం, గుత్తులపుట్టు, అరకులోయ, గొలుగొండ, చింతపల్లి ప్రాంతాల్లో ఇటీవల పోలీసులు రవాణా అవుతున్న గంజాయిని పట్టుకున్నారు.
జనవరి 22న విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నంలో లారీలో భారీగా రవాణా అవుతున్న 3 వేల కిలోలు గంజాయిని, విజయవాడలో రవాణాకు సిద్ధం చేసి ఉంచిన మరో 700 కిలోల గంజాయిని 23న పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం విజయవాడలో గంజాయి వ్యాపారంలో సూత్రధారిగా ఉన్న నార్ల వంశీకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం జి.మాడుగుల మండలంలోని గెమ్మెలి ప్రాంతంలో రవాణాకు సిద్ధం చేసి ఉంచిన 2 వేల కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం చోడవరం సమీపంలోని గాంధీగ్రామం వద్ద 480 కిలోలు స్వాధీనం చేసుకున్నారు.
గిరిజనుల అమాయకత్వమే ఆసరా
మన్యంలో గిరిజనుల అమాయకత్వమే ఆసరాగా చేసుకున్న గంజాయి స్మగ్మర్లు కోట్లాది రూపాయాలు ఆర్జిస్తున్నారు. ఇక్కడ గిరిజనులతో సాగు చేయించి శీలవతి రకం కిలో రూ.2వేలకు గంజాయిని సిద్ధం చేసుకుని తమిళనాడు రాష్ట్రంలో రవాణ చేస్తూ కిలో గంజాయికి రూ.10వేల చొప్పున అమ్మకాలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదే మన్యంలో సాగు చేసే గంజాయి అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో రూ.20వేలకు అమ్ముడవుతుంది. దీంతో ఎక్కువ మొత్తంలో భారీగా ఎగుమతులు జరుగుతున్నాయి.