![Five Students Addicted to marijuana and turned into smugglers - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/5/sdfdfdf.jpg.webp?itok=6DM-YvE5)
నెల్లూరు (క్రైమ్): గంజాయికి బానిసైన ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు స్మగ్లర్లుగా అవతారమెత్తిన ఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. సోమవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్రా మెమోరియల్ కాన్ఫరెన్స్ హాల్‌లో కావలి డీఎస్పీ డి.ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళానికి చెందిన ఎస్.పవన్‌కల్యాణ్, విశాఖపట్టణానికి చెందిన లోకనాథ్ అఖిల్, విజయనగరం జిల్లాకు చెందిన బి.రవితేజ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలానికి చెందిన అమర్‌నాథ్ (కారు డ్రైవర్) వేలూరులోని విట్ కళాశాలలో ఇంజనీరింగ్ చదివారన్నారు. వీరంతా అక్కడ చదువుతున్న సమయంలోనే గంజాయికి బానిసలయ్యారని తెలిపారు. మత్తుకు బానిసైన వీరు గంజాయి తామే సరఫరా చేస్తే, తమ అవసరాలు తీరడంతో పాటు అధికంగా డబ్బులొస్తాయని భావించి స్మగ్లర్లుగా అవతారమెత్తారని చెప్పారు. విశాఖ ఏజెన్సీలోని తమ స్నేహితుడి ద్వారా గంజాయిని కొనుగోలు చేసి రైలు, రోడ్డు మార్గాన వేలూరుకు తరలించేవారని తెలిపారు. విశాఖ ఏజెన్సీలో కేజీ రూ.3 వేలకు కొనుగోలు చేసి వేలూరులో రూ.25 వేలకు విక్రయిస్తున్నారని, రెండేళ్లుగా ఈ అక్రమ రవాణా నిరాటంకంగా సాగుతోందని వివరించారు.
సరుకు తీసుకెళుతూ..
నిందితులు పవన్‌కల్యాణ్, లోక్‌నాథ్ అఖిల్, రవితేజ, అమర్‌నాథ్ అద్దెకు కారు తీసుకుని విశాఖ ఏజెన్సీలోని అరకులో గంజాయిని కొనుగోలు చేశారు. కారులో వేలూరుకు బయలు దేరారు. కావలి వద్ద కారును ఆపి తమ స్నేహితుడైన గంజాయి విక్రేత (మహారాష్ట్ర, పూణేకు చెందిన) ప్రత్యూష్ సిన్హాతో మాట్లాడుతుండగా.. అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేయడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో సోమవారం వారందరిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించగా ఈ వ్యవహారంలో మరికొంతమంది హస్తం ఉందని చెప్పడంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment