మావోయిస్టుల పీఎల్ జీఏ వారోత్సవాలకు వారం ముందు నుంచే మన్యంలో భయం కమ్ముకుంది. ఇప్పటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే మళ్లీ హింసకు, దాడులకు తలపడేట్టు కనిపిస్తోంది. ఓవైపు ఒత్తిడి ఉన్నా మావోయిస్టులు గ్రామాల్లో విస్తృతంగా సమావేశాలు ఏర్పాటు చేయడం చూస్తే వారోత్సవాలను యథాతథంగా నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది. మరోవైపు పోలీసులు కూడా అంతే దీక్షతో ఉన్నారు. మావోయిస్టులకు ఎలాగైనా చెక్ చెప్పాలన్న లక్ష్యంతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
కొయ్యూరు/ చింతపల్లి, న్యూస్‌లైన్: మావోయిస్టులు ఏటా నిర్వహించే ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం (పీఎల్‌జీఏ) వారోత్సవాలు చేరువవుతున్న కొద్దీ మన్యం లోతట్టు ప్రాంతాల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు దాడులు చేసే అవకాశం ఉండడంతో మన్యంలో రాజకీయ నాయకులు, ప్రత్యేకించి పాలక పక్ష ప్రతినిధులు ఉలిక్కి పడుతున్నారు. మావోయిస్టుల జోరుకు పగ్గాలు వేయడానికి పోలీసులు కూడా విస్తృత ప్రయత్నాలు ప్రారంభించారు. అడవుల్లో కూంబింగ్ ఉధృతం చేశా రు. అదనపు బలగాలను అధికారులు మొహరిస్తున్నారు. 13వ పీఎల్‌జీఏ వారోత్సవాలు డి సెంబర్ 2 నుంచి ప్రారంభం కాబోతున్నాయి.
వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టుల ఏక్షన్ టీమ్‌లు రంగంలోకి వచ్చినట్టు పోలీసులకు సమాచారం అందడంతో అనూహ్య పరిణామాలు జరగకుండా ఉన్నతాధికారులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉన్న నేతలను, సర్పంచ్‌లను, వారి హిట్ లిస్టులో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెబుతున్నారు. నాయకులను అప్రమత్తం చేయాలని మావోయిస్టు ప్రాంతాల్లో పనిచేస్తున్న పోలీసులను ఎస్పీ ఆదేశించారు. దీంతో ముప్పు ఉన్న నాయకులు మైదాన ప్రాంతాల కు తరలి వెళ్లాలని పోలీసులు చెబుతున్నారు.
హింసే లక్ష్యం
మన్యంలో తమ ఉనికి చాటుకోవడానికి, మావోయిస్టులు హింసామార్గాన్ని ఎన్నుకున్నట్టు స్పష్టమవుతోంది. ఈనెల 20 వరకు నిరసన దినాలు పాటించాలని గతంలో పిలుపు ఇచ్చిన మావోయిస్టులు, ఓవంక పోలీ సుల కూంబింగ్ సాగుతూ ఉండగానే రక్తం చిందించారు. ఇన్ఫార్మర్లుగా పని చేస్తున్న వారిపై గురిపెట్టారు. రెండు నెలల వ్యవధిలో ముగ్గురిని చంపారు. వారోత్సవాల్లో కూడా ఇదే పరి స్థితి పునరావృతమవుతుందని పోలీసులు భావిస్తున్నారు. అందుకే మావోయిస్టుల జోరు కు పగ్గాలు వేయడానికి విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటికే అదనపు బలగాలను గ్రామాలకు తరలిస్తున్నారు.
కాంగ్రెస్ నేతల ఆందోళన
పీఎల్‌జీఏ వారోత్సవాలతో కాంగ్రెస్ నే తలు కలవరపడుతున్నారు. పోలీసు యం త్రాంగం హెచ్చరికలతో వారంతా మండల కేంద్రాలకే పరిమితమవుతున్నారు. మారుమూల గ్రామాల్లో పర్యటనలు కూడా రద్దు చేసుకున్నారు. చింతపల్లి, జీకే వీధి, జి.మాడుగుల,పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలకు చెందిన కొంతమంది కాంగ్రెస్ నేత లు వారోత్సవాలు ముగిసే వరకు మైదాన ప్రాంతాలకు వెళ్లిపోవాలని భావిస్తున్నట్టు తె లుస్తోంది.
విస్తృతంగా సమావేశాలు
ఇటీవల కాలంలో మావోయిస్టులు మారుమూల ప్రాంతాల్లో అధికంగా సంచరిస్తూ గ్రామాల్లో సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. మిలీషియా సభ్యులు కూడా మావోయిస్టు పార్టీ కార్యకలాపాలను వ్యాపింపజేస్తున్నారు. పెదబయలు, జి.మాడుగుల, ముంచంగిపుట్టు, చింతపల్లి మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో మావోయిస్టుల సంచారం అధికంగా ఉందని సమాచారం అందడంతో పోలీసులు కూడా అందుకు తగ్గట్టు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. అయితే పోలీసులు గాలిస్తున్నా మావోయిస్టులు ఏదో ఒక చోట కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో కూడా పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పార్టీలో కొత్త వ్యక్తులు ఈ ప్రాంతానికి వచ్చి కార్యకలాపాలు ఉధృతంగా నిర్వహిస్తున్నారని, చత్తీస్‌గఢ్ ప్రాంతం నుంచి వచ్చిన మావోయిస్టు నేతలు వ్యూహ రచన చేస్తున్నారని తెలుస్తోంది. కిల్లంకోట పంచాయతీలో మావోయిస్టులు ప్రజా కోర్టు నిర్వహించిన సమయంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గుత్తి కోయల గిరిజనులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
వారోత్సవాలను అడ్డుకుంటాం
ఏజెన్సీలోని మా వోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలను అడ్డుకునేందుకు పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంది. ఏజెన్సీలో, ఎవోబీలో గాలింపు చర్యలను ము మ్మరం చేశాం. అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో తనిఖీలు కూడా జరుపుతున్నాం. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంటోం ది. అధికార పార్టీ ప్రజాప్రతిని ధులు, నాయకులకు రక్షణ కల్పిస్తున్నాం.
- దామోదర్, నర్సీపట్నం ఓఎస్డీ