కావాలంటే నాయకులను చంపేయండి: ఎంపీ
ఆయన స్వయానా ఎంపీ. నిన్న మొన్నటివరకు జైల్లో ఉండి, ఈ మధ్యే బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు ఓ సరికొత్త వివాదానికి తావిచ్చారు. జన అధికార్ పార్టీ ఎంపీ అయిన రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ దేశవ్యాప్తంగా చాలా ఫేమస్. మావోయిస్టులు కావాలంటే రాజకీయ నాయకులను చంపేయొచ్చు గానీ, భద్రతా దళాల సిబ్బందిని ఏమీ చేయొద్దని కోరారు. నాయకులు దేశాన్ని దోచేసుకుంటున్నారని, భద్రతా దళాలు దేశానికి రక్షణ కల్పిస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
అందువల్ల మావోయిస్టులు ముందుగా నాయకులను చంపేయాలని కోరారు. గతంలో రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలో ఉండి.. తర్వాత బహిష్కరణకు గురైన ఆయన తాజాగా హాజీపూర్ పట్టణంలో మాట్లాడుతూ ఇలా వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలో తీవ్రవాదం కూడా తగ్గిపోతుందని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారని, కానీ నోట్ల రద్దు జరిగి ఇన్నాళ్లయిన తర్వాత కూడా ఎందుకు మావోయిస్టుల దాడులు కొనసాగుతున్నాయని పప్పు యాదవ్ ప్రశ్నించారు.
ఇంతకుముందు కూడా పప్పూ యాదవ్ తీవ్రస్థాయిలోనే వ్యాఖ్యలు చేశారు. అవినీతిపరులైన రాజకీయ నాయకులు, అధికారులను ఎవరైనా కొట్టిచంపితే వారికి రూ. 10 లక్షలు నజరానాగా ఇస్తానని గతంలో ప్రకటించారు. అవినీతిపరులకు వ్యతిరేకంగా స్టింగ్ ఆపరేషన్లు చేసినా, ఆధారాలు సంపాదించినా వారికి రూ. 25వేలు నజరానాగా ఇస్తానని చెప్పారు. అవినీతిపరుల్ని ప్రభుత్వం అణచివేయకపోతే దళితులు, సమాజంలోని అట్టడుగు వర్గాలవారికి తుపాకులు ఇవ్వాల్సి వస్తుందని గతంలో హెచ్చరించారు.