మలివిడతలోనూ.. అదే జోరుపోలింగ్ 73% | 73% in the second polling | Sakshi
Sakshi News home page

మలివిడతలోనూ.. అదే జోరుపోలింగ్ 73%

Published Sat, Apr 12 2014 12:21 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

మలివిడతలోనూ.. అదే జోరుపోలింగ్ 73% - Sakshi

మలివిడతలోనూ.. అదే జోరుపోలింగ్ 73%

  • జమావోయిస్టుల హెచ్చరికలను లెక్క చేయని గిరిజనులు
  •  ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు
  •  బ్యాలెట్‌బాక్సులు ఎత్తుకెళ్లడంతో 16న బూసిపుట్టులో రీపోలింగ్
  •  మాదిగమళ్లలో పోలింగ్‌కు అంతరాయం
  •  గరిమండలో దళసభ్యుల హల్‌చల్
  •  కుట్టిలో ఎన్నికల బహిష్కరణ
  •  విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : అసాధారణ భద్రత నడుమ ప్రాదేశిక ఎన్నికల తుదివిడత పోలింగ్ అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు మినహా శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టులు పిలుపునిచ్చినప్పటికీ ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.  ఒక చోట మావోయిస్టులు బ్యాలెట్ బాక్సును ఎత్తుకుపోయిన సంఘటన మినహా.. మిగిలిన మండలాల్లో ఎన్నికలు సజావుగా జరిగాయి.

    దీంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. తుది దశలో శుక్రవారం 17 జెడ్పీటీసీ, 273 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సుమారుగా 73 శాతం వరకు పోలింగ్ జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఉదయం పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోలాహలం కనిపించినప్పటికీ 10.30 వరకు ఓటింగ్ మందకొడిగా సాగింది. 11 గంటల తరువాత కాస్త పుంజుకుంది.

    ఒక్కసారిగా ఓటర్లు కేంద్రాలకు రావడంతో భారీగా క్యూలైన్లు దర్శనమిచ్చాయి. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో ఇంటర్నెట్ సదుపాయమున్న 29 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసి అధికారులు జిల్లా కేంద్రం నుంచి స్వయంగా పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. అలాగే 519 కేంద్రాల్లో వీడియోగ్రాఫర్లను నియమించి పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్‌ను వీడియో తీయించారు.
     
    మధ్యాహ్నం నుంచి పుంజుకున్న పోలింగ్
     
    ఉదయం 11 గంటల తరువాత నుంచి పోలింగ్ పుంజుకుంది. భారీగా లైన్లలో నిలబడి మరీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా మహిళలు, వృద్ధులు సైతం ఇబ్బందులు పడుతూనే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ తొలి రెండు గంటలు డుంబ్రిగుడలో 5 శాతం, పెదబయలులో 7.10 శాతం, ఇలా ఏ మండలంలోను కనీసం 13 శాతం ఓటింగ్ కూడా నమోదు కాలేదు.

    ఉదయం 9 గంటలకు కేవలం 11.80 శాతం ఓటింగ్ మాత్రమే జరిగింది. అలాగే 11 గంటల వరకు 26.80 శాతం, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 45.70 శాతం, 3 గంటల వరకు 55 శాతం పోలింగ్ జరిగింది. సాయంత్రం అయిదు గంటలు తరువాత కొన్ని చోట్ల ఓటర్లు ఉండడంతో వారికి స్లిప్పులు పంపిణీ చేసి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. అయితే రవాణా సదుపాయం, మొబైల్ సిగ్నల్స్ లేని ప్రాంతాలు ఏజెన్సీలో ఉండడంతో పూర్తి సమాచారం జిల్లా అధికారులకు అందలేదు. పోలింగ్ సరళిని బట్టి అప్పటి వరకు ఉన్న సమాచారాన్ని పరిగణలోకి తీసుకొని దాదాపుగా 73 శాతం ఓటింగ్ జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం మధ్యాహ్నానికి గాని పూర్తి సమాచారం అందే అవకాశం లేదని చెబుతున్నారు.
     
    స్లిప్పుల పంపిణీలో గందరగోళం
     
    మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో దళసభ్యులకు భయపడిన కొందరు గిరిజనులు ఓటింగ్‌కు దూరమయ్యారు. దీంతో మన్యంలో పోలింగ్ శాతం కొంత తగ్గింది. అలాగే వచ్చిన ఓటర్లకు  స్లిప్పులు అందకపోవడం, ఓట్లు మరో సెగ్మెంట్‌లో కలసిపోవడం వంటి కారణాలు కూడా ఓటింగ్‌శాతం తగ్గడానికి దోహదపడ్డాయి. ప్రభుత్వ సిబ్బంది ఓటరు స్లిప్పులు పంపిణీచేయాల్సి ఉన్నప్పటికీ ఏజెన్సీలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ కారణంగా చాలాచోట్ల ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

    ఒక పంచాయతీ పరిధిలోని ఓట్లు మరో పంచాయతీలో కలిసి పోయాయి. దీనివల్ల తమ ఓట్లు ఎక్కడున్నాయో తెలియక పలువురు తికమక పడ్డారు. ఓటేయకుండానే నిరాశగా ఇళ్లకు వెనుదిరిగారు. ఓటు హక్కు ఉన్నప్పటికీ ఓటరు ఐడీ, ఆధార్, రేషన్‌కార్డు వంటివి తీసుకురాకపోవడంతో పెద్ద సంఖ్యలో మరికొందరు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. ప్రధానంగా జీకేవీధి మండలంలోని పామురాయి. కూసుగొంది, అగ్రహారం, వాడమామిడి, చీపురుగొంది, తదితర మారుమూల గ్రామాల నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపలేదు.
     
    కొన్ని విశేషాలు
    పెదబయలు మండలం ఇంజరి సెగ్మెంట్‌లోని 2 పోలింగ్ కేంద్రాల్లోను ఓటర్ల జాబితాలు తారుమారుకావడంతో కేవలం 200 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగతావారంతా ఉసూరుమంటూ వెళ్ళిపోయారు.
         
     ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టులో మావోయిస్టులు అలజడి సృష్టించారు. బ్యాలెట్ బాక్స్‌ను ఎత్తుకుపోయారు. పోలింగ్ జరుగుతుండగా మధ్యాహ్నం గ్రామంలోకి పది మంది సాయుధ దళసభ్యులు వచ్చారు. వారి ఇద్దరూ కేంద్రం లోపలికి వెళ్లి బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లడంతో పోలింగ్ నిలిచిపోయింది. ఈ సంఘటనపై పీవో జి.రాఘవన్, ఏపీవో ఎన్.అప్పాల నాయుడులు ఎన్నికల అధికారి ఎం.కిషోర్‌కు తెలియజేశారు. అప్పటికి మొత్తం 1154 ఓట్లకు 330 మాత్రమే పోలయ్యాయి. ఇదే మండల దోడిపుట్టులో ఓటర్ల తోపులాట కారణంగా సుమారు గంటపాటు పోలింగ్ నిలిచిపొయింది.
         
     జీకేవీధి మండలం గుమ్మరేవుల పంచాయతీ మాదిగమళ్లలో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. ఇక్కడ ఓటు స్లిప్పుల పంపిణీ వివాదాస్పదమైంది. ఆగ్రహం చెందిన గిరిజనులు 11 గంటల సమయంలో సిబ్బందిని నిర్బంధించారు. గదులకు బయట తాళాలు వేశారు. అప్పటికి 1450 ఓట్లకు 450 మాత్రమే పోలయ్యాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో వారిని విడిచిపెట్టాక మళ్లీ పోలింగ్ కొనసాగించారు.
         
     కొయ్యూరు మండలం గరిమండలో మావోయిస్టులు హల్‌చల్ చేశారు. పోలింగ్ సిబ్బంది ఉండగానే  గురువారం రాత్రి గ్రామంలోకి వచ్చి పోస్టర్లు ఎన్నికలకు వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారు. బహిష్కరించాలని పిలుపునిచ్చారు. పోలింగ్ సిబ్బందితో పాటు గ్రామస్తులు రాత్రంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. శుక్రవారం భయృడుతూనే కొద్ది మంది మాత్రమే ఓటేయడానికి వచ్చారు. ఇక్కడ 1,800 మందికి  50 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
         
     డుంబ్రిగుడ మండలం రంగిలిసింగి పంచాయతీృకుట్టి గ్రామంలోని పీటీజీలు ఎన్నికలను బహిష్కరించారు. ఒడిశా సరిహద్దులో ఉన్న ఈ గ్రామం ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోలేదు. గ్రామంలోని 105 మంది ఓటర్లలో ఏ ఒక్కరూ ఓటేయలేదు. సార్వత్రిక ఎన్నికలను కూడా బహిష్కరిస్తామని ప్రకటించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement