తుది సమరం
- ప్రాదేశిక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
- సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత
- మారుమూల గూడేలకు గుర్రాలపై బ్యాలెట్‌బాక్సుల తరలింపు
విశాఖ రూరల్/పాడేరు, న్యూస్‌లైన్ : మలి విడత ప్రాదేశిక సమరానికి రంగం సిద్ధమైంది. మన్యంలోని మారుమూల గూడేలకు బ్యాలెట్‌బాక్సులు, పోలింగ్ సిబ్బంది తరలింపునకు అధికారులు అష్టకష్టాలు పడ్డారు. పెదబయలు మండలం ఇంజరి సెగ్మెంట్‌లోని చీకుపనస, ఇంజరి కేంద్రాలకు ఎన్నికల సామగ్రి,సిబ్బందిని చేరవేసేందుకు గుర్రాలను ఆశ్రయించారు. స్థానిక ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునివ్వడంతో అంతటా భయానక వాతావరణం నెలకొంది.
17 మండలాల్లో 38 సమస్యాత్మక,73 అత్యంత సమస్యాత్మక, 189 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం 572 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు గట్టి భద్రత చర్యలు చేపట్టారు.
కొయ్యూరు మండలం యు.చీడిపాలెం, బూదరాళ్ళ, జీకేవీధి మండలం గుమ్మరేవుల, గాలికొండ, జర్రెల, వంచెల, దేవరాపల్లి, పెదవలస, చింతపల్లి మండలం కుడుముసారి, తమ్మెంగుల, జి.మాడుగుల మండలం లువ్వాసింగి, కోరాపల్లి, బీరం, బొయితిలి, పెదబయలు మండలం ఇంజరి, జామిగుడ, బొంగరం, ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు, కుమడ, లక్ష్మిపురం, రంగబయలు, బుంగాపుట్టు వంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు బ్యాలట్ పత్రాలు, బాక్సుల తరలింపు కత్తిమీద సామైంది. చాలా మంది సిబ్బంది కాలినడకనే పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు.
ఏర్పాట్లు పూర్తి : 17 జెడ్పీటీసీ, 273 ఎంపీటీసీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. ఇందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జెడ్పీటీసీ స్థానాలకు 100 మంది, ఎంపీటీసీలకు 1062 మంది అభ్యర్థులు తలపడుతున్నారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 6,84,825 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 3,33,545 మంది పురుషులు, 3,51,279 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరి కోసం మొత్తం 795 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1624 బ్యాలెట్ బాక్సులను వినియోస్తున్నారు. ఎన్నిల నిర్వహణకు 874 మంది పీవో, 874 మంది ఏపీవో, 2620 మంది వోపీవో మొత్తంగా 4368 మంది సిబ్బందిని నియమించారు. వీరు గురువారం మధ్యాహ్నం ఆయా పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు. వారి కోసం అధికారులు ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేశారు.
29 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ : సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉన్న పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ సరళిని జిల్లా కేంద్రం నుంచి స్వయంగా పర్యవేక్షించేందుకు 29 కేంద్రాల్లో ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అలాగే ఇంటర్నెట్ సదుపాయం లేని 519 కేంద్రాల్లో పోలింగ్‌ను వీడియో తీసేందుకు వీడియోగ్రఫర్లను, స్టాటిక్ ఫోర్స్‌ను నియమించారు. 41 కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లతో ప్రశాంతం వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు చేపడుతున్నారు.
రెవెన్యూ కేంద్రాల్లో స్ట్రాంగ్ రూమ్‌లు
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు మే 7వ తేదీ తరువాత జరగనుంది. దీంతో అప్పటి వరకు బ్యాలెట్ బాక్సులను రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో భద్రపరచాలని అధికారులు నిర్ణయించారు. పోలింగ్ అనంతరం ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులను ఆయా మండలాల రిసెప్షన్ సెంటర్‌కు తీసుకువచ్చి అక్కడ నుంచి పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తారు. అనకాపల్లి డివిజన్‌కు ఏఎంఏఎల్ కాలేజీలోను, నర్సీపట్నం డివిజన్‌తో పాటు పాడేరులో మూడు మండలాల బ్యాలెట్ బాక్సులను నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోను, పాడేరులో మిగిలిన 8 మండలాలకు సంబంధించి పాడేరు ప్రభుత్వ డిగ్రీకాలేజీలో స్ట్రాంగ్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు.