ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఉనికి
చాటుకోవడానికి మావోయిస్టుల వ్యూహ రచన
అప్రమత్తమైన రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం..
ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నిఘా అధికారులతో తాజా పరిస్థితిపై సమీక్ష.. నిరంతర కో-ఆర్డినేషన్
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో తమ ఉనికిని చాటుకోవడానికి మావోయిస్టులు వ్యూహ రచన చేశారనే సమాచారంతో రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం అప్రమత్తమైంది. ఇటీవల ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కుసుమ జిల్లాలో 16 మందిని కాల్చి చంపిన మావోయిస్టుల చర్యను దృష్టిలో ఉంచుకుని మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎన్నికల్లో నక్సల్స్ విధ్వంసకాండకు పాల్పడకుండా చేసేందుకు అవసరమైన వ్యూహాలను పోలీసు అధికారులు సిద్ధం చేస్తున్నారు.
ఇందులో భాగంగా నక్సల్ కార్యకలాపాలు అధికంగా ఉన్న సరిహద్దు రాష్ట్రాలు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలకు చెందిన ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులతో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడి తాజా పరిస్థితిని సమీక్షించారు. వారితో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఆంధ్రా-ఒడిశా, ఆంధ్రా-ఛత్తీస్‌గఢ్, ఆంధ్రా-మహారాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టు దళాల కదలికలపై నిఘా పెంచారు. దళాలనేగాక స్పెషల్ యాక్షన్ టీమ్‌లను మావోయిస్టులు రంగంలోకి దింపే ప్రమాదం ఉందని కూడా నిఘా వర్గాలకు సమాచారం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇటు తెలంగాణ, అటు ఉత్తరాంధ్రలలో ఆయా జిల్లాల ఎస్పీలను అధికారులు అప్రమత్తం చేశారని తెలిసింది. ముఖ్యంగా ఆంధ్రా, ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ, ఇటు తెలంగాణ రాష్ట్ర కమిటీలను చురుకుగా పనిచేయించడం ద్వారా రెండు ప్రాంతాల్లోతమ ఉనికిని చాటుకోవడానికి మావోయిస్టు నాయకత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు నిఘా అధికారులకు సమాచారం ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకుని సరిహద్దుల్లోని ప్రభావిత రాష్ట్రాల పోలీసు యంత్రాంగాలతో కలిసి కట్టుగా పని చేయాలని మరోవైపు కేంద్ర హోంశాఖ సైతం పై మూడు రాష్ట్రాలతో పాటు రాష్ట్రానికి సూచించినట్లు తెలిసింది.
నక్సల్స్‌పై పెరిగిన నిఘా
Published Sun, Mar 16 2014 1:54 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement