ముమ్మర తనిఖీలు చేపట్టిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టుల పేరిట వెలుస్తున్న పోస్టర్లతో రాజకీయ నాయకులు, పోలీసులు కూడా కలవర పడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించాలని, రాజకీయ నేతలు ఎవరూ ప్రచారం నిర్వహించరాదని పేర్కొం టూ ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులు పోస్టర్లు అంటించి, కరపత్రాలు పంచారు. విశాఖ ఏజెన్సీ, ఆంధ్ర-ఒడిశా స్పెషల్‌జోన్ కమిటీ ఏరియాల్లో మావోలు పోస్టర్ల ద్వారా ఇప్పటికే హెచ్చరికలు జారీచేశారు. అదేవిధంగా ఖమ్మం సరిహద్దుల్లోని గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లోనూ పోస్టర్లు అంటించిన మావోలు కొందరు నేతలకు వ్యక్తిగత లేఖలు కూడా పంపినట్టు సమాచారం.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు నిఘాను ముమ్మరం చేశారు. ఇటువంటి బెదిరింపులు గతంలో కూడా చేశారని, అయినప్పటికీ ముందు జాగ్రత్తగా భద్రతను కట్టుదిట్టం చేశామని అధికారులు పేర్కొంటున్నారు. అదేసమయంలో అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు, నక్సల్స్ సానుభూతి పరులపై నిఘాను పెంచినట్టు తెలిసింది. మరోపక్క, మావోల హిట్ లిస్టులో ఉన్న నేతలను పోలీసులు అలెర్ట్ చేస్తున్నారు. గ్రేహౌండ్స్ బలగాలతో గాలింపును ముమ్మరం చేశారు.