మే 7న సీమాంధ్రలో జరిగే రెండో విడత పోలింగ్‌పై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు.
సాక్షి, హైదరాబాద్: మే 7న సీమాంధ్రలో జరిగే రెండో విడత పోలింగ్‌పై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. మరోవైపు ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు ఏవోబీ స్పెషల్ జోన్‌కమిటీ కార్యకలాపాలపై గ్రేహౌండ్స్ బలగాలను అప్రమత్తం చేశారు. సీమాంధ్రలో రెండో విడత పోలింగ్ ప్రక్రియ శాంతియుతంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో విశాఖ ఏజెన్సీ ఏరియాలో కూడా మావోయిస్టుల కదలికలపై నిఘాను పెంచారు.
డీజీపీ ప్రసాదరావు సీమాంధ్రలో బందోబస్తు గురించి గురువారం సీనియర్ పోలీసు అధికారులతో సమీక్షించారు. ప్రధానంగా రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పోలింగ్ సందర్భంగా హింసాయుత సంఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన హెచ్చరికలతో అప్రమత్తం అయ్యారు. అలాగే ఏవోబీలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు.