మన్యంపై మొద్దు నిద్ర | manyam leg swelling disease government | Sakshi
Sakshi News home page

మన్యంపై మొద్దు నిద్ర

Published Thu, Oct 6 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM

మన్యంపై మొద్దు నిద్ర

మన్యంపై మొద్దు నిద్ర

వరుసగా చనిపోతున్నా చలనం లేదాయె
కాళ్లవాపు, పొట్టవాపు రోజుకొకటి వెలుగులోకి
రోజుల పసిగుడ్డులనుంచి వృద్ధుల వరకు మృత్యువాత
ఇంతవరకూ నిర్ధారణ కాని వ్యాధి 
నాటు సారా తాగడం వల్లనేనని ప్రకటనలు
చిన్నపిల్లలు, విద్యార్థులు మృతికీ తాగుడే కారణమా?
తరువాత అదీ ఓ కారణమంటూ మాట మార్పు
‘సాక్షి’ వరుస కథనాలతో కొంత కదలిక
 జగన్‌ మోహన్‌ రెడ్డి ఆరాతో మరింత హడావుడి
సాక్షి ప్రతినిధి, కాకినాడ/వి.ఆర్‌.పురం/చింతూరు :
మన్యంలో గిరిజనుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారాయి. మరణశయ్యపై ఉన్న ‘తూర్పు’ మన్యానికి భరోసా కల్పించలేక సర్కార్‌ చేతులెత్తేస్తోంది. గడచిన నెలన్నర రోజులుగా మన్యం వాసులను వణికిస్తున్న కాళ్లవాపు వ్యాధి అసలు ఎందుకు వస్తుందో ఇంతవరకు నిర్థారణ కాలేదు. కాకినాడ రంగరాయ, విశాఖ ఆంధ్రా మెడికల్‌ కళాశాలలకు చెందిన వైద్య బృందాలు రోగుల రక్త నమూనాలు సేకరించినా నివేదికలు మాత్రం ఇంకా రాలేదు. ఆ నివేదికలు ఎప్పుడు వస్తాయో అధికారులు ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. నాటుసారా తాగడంతోనే మరణాలు సంభవించాయని మొదట్లో జిల్లా కలెక్టర్‌ వెల్లడించినట్టు పలు పత్రికల్లో (సాక్షి కాదు) వార్తలు వచ్చాయి. మృతుల్లో ఇంటర్మీడియట్‌ చదువుతున్న ఇద్దరు విద్యార్థులుండటం, అందులో ఒక విద్యార్థిని కావడంతో విమర్శలు వెల్లువెత్తడంతో నాటుసారా మాత్రమే కారణం కాదని అది కూడా ఒకటై ఉంటుందని సర్థిచెప్పే ప్రయత్నం చేశారు. వ్యాధి నియంత్రణ, వ్యాధిగ్రస్తులకు భరోసా ఇవ్వడంలో పాలకుల చొరవ, ప్రభుత్వ ప్రయత్నాలు విమర్శపాలవుతున్నాయి. కాళ్లవాపు వ్యాధి అదుపులోకి రాకపోగా, మలేరియా, టైపాయిడ్, విషజ్వరాలతో మృతి చెందుతున్న గిరిజనుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.
ఏజెన్సీలో ఇంత ఆందోళనకరమైన పరిస్థితులున్నా నామమాత్రపు చర్యలతో కాలక్షేపం చేస్తూ వ్యాధి అదుపులోకొచ్చిందని జిల్లా యంత్రాంగం చెబుతూ వస్తోంది. కాళ్లవాపు వ్యాధి వీఆర్‌పురం, చింతూరు, కూనవరం మండలాల్లో గ్రామాలను వణికిస్తోంది. అంతుచిక్కని ఈ వ్యాధితో ఏడుగురు గిరిజనులు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఇద్దరు ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థులు కూడా ఉన్నారు. ఇంకా ఈ వ్యాధితో అటు విలీన మండలాల్లో, ఇటు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 50కి పై మాటే. మన్యంలో నెలకొన్న పరిస్థితులపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించి ముళ్లుకర్రతో వెంటపడడంతో తాబేలు నడకలా పరిశీలిస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి ఆరా తీస్తున్న విషయం పత్రికల్లో రావడంతో గిరిజన శాఖా మంత్రి హడావుడిగా పర్యటించారు. 
బాబు, కామినేనిలు జిల్లాకు వచ్చినా...
వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్‌ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు ఈ నెలన్నరలో జిల్లా పర్యటనకు వచ్చి వెళ్లిన వారే. కానీ కాళ్లవాపు వ్యాధితో మృతి చెందిన కుటుంబాల వైపు కన్నెత్తిచూసే తీరిక, ఓపిక వారికి లేకుండా పోయిందని గిరిజన సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఆరోగ్యశాఖా మంత్రి కామినేని జగ్గంపేటలో పలు ప్రారంభోత్సవాలకు హాజరవడానికి తీరిక దొరికింది కానీ తమను పలకరించడానికి దొరకలేదా అని మన్యంవాసులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా నుంచి కేబినెట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దేవినేని ఉమ కనీసం కన్నెత్తి చూడలేకపోవడాన్ని బట్టే గిరిజనులపై ఎంతటి శ్రద్ధ కనబరుస్తున్నారో అర్థమవుతోందంటున్నారు.
ఆగని మరణాలు...
కాళ్లవాపు వ్యాధితో ఏడుగురు గిరిజనులు మృతి చెందగా, తాజాగా రాజవొమ్మంగి మండలం పూదూడి, పాకవెల్లిలో నెల వయసు పసికందులు ఇద్దరు, మారేడుమిల్లి మండలం వేటుకూరుకు చెందిన ఆరో తరగతి విద్యార్థి రాజారెడ్డి తాజాగా బుధవారం అనారోగ్యంతో మృతిచెందడం గమనార్హం.సరిగ్గా ఏడాది క్రితం వీఆర్‌పురం రాజుపేట కాలనీలో దుర్గాభవానీ అనే యువతి కాళ్లవాపు వ్యాధితో కాళ్లు చచ్చుబడిపోగా విజయవాడలో రెండు కాళ్లు తొలగించేశారు. ఇప్పుడు ఆ యువతి కిడ్నీల వాధితో బాధపడుతూ కాకినాడ జీజీహెచ్‌లో చికిత్సపొందుతోంది. 
ఇచ్చిన లక్ష ఏ మూలకు...?
కాళ్లవాపు వ్యాది మృతులకు ప్రభుత్వం రూ.లక్ష ఇచ్చింది. అంతుచిక్కని వ్యాధి వచ్చాక స్థానికంగా వైద్యానికే లక్ష ఖర్చు అయ్యిపోయింది, ప్రభుత్వం ఇచ్చిన లక్ష ఏమూలకూ రాలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భర్త కోల్పోయి బతుకు భారమైన కుటుంబం, చేతికందొచ్చిన కొడుకును కోల్పోయి తల్లిదండ్రులు...ఇలా ఏ కుటుంబాన్ని కదిలించినా కన్నీటి గాధలే. ఏజన్సీలో వైద్యసేవలు మెరుగు పరుస్తామన్న హామీ కార్యరూపం దాల్చలేదు. కొత్తగా వైద్యుల పోస్టులు భర్తీ కాకపోగా ఉన్న వైద్యులే మన్యం వీడిపోతున్నారు. మన్యంలో మరణ మృదంగంపై పాలకులు మానవతాదృక్పధంతో స్పందించి వారికి మనో ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement