=సరిహద్దులో చెలరేగిన మావోయిస్టులు
=ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరి హతం
=మృతుల్లో ఒకరు మహిళ
=మన్యం బంద్‌కు మిశ్రమ స్పందన
పాడేరు/సీలేరు, న్యూస్‌లైన్ : ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)మరోసారి ఉలిక్కిపడింది. మన్యంలో బుధవారంనాటి బంద్‌కు మిశ్రమ స్పందన కనిపించినప్పటికీ సరిహద్దు ఒడిశాలో మావోయిస్టులు చెలరేగిపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్బంధ చర్యలను నిరసిస్తూ మావోయిస్టు ఏవోబీ జోన ల్ కమిటీ పిలుపు మేరకు ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు నిరసన దినాలు పాటించారు.
ఇవి బుధవారం ప్రశాంతంగా ముగుస్తాయనుకున్న తరుణంలో మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పోలీస్‌స్టేషన్ పరిధి వెజ్జంగి గుడలో వంతల సతీరావు(30), వంతల లక్ష్మి(27)లను పోలీ సు ఇన్‌ఫార్మర్ల నెపంతో దళసభ్యులు హతమార్చారు. ఉదయాన్నే సాయుధులైన 20 మంది మావోయిస్టులు గ్రామంలోకి ప్రవేశించితో 20 నిమిషాలు వారితో మాట్లాడారు. అనంతరం ఇద్దరినీ గొడ్డలితో నరికి చంపారు. సతీరావు 15 ఏళ్ల కిందట దళంలో పనిచేసి జనజీవన స్రవంతిలోకి వచ్చాడు. లక్ష్మి ఆశా వర్కర్‌గా పనిచేస్తోంది.
ఈమె భర్త రాజబాబును కూడా చంపడానికి మావోయిస్టులు యత్నించారు. అతడు తప్పించుకుని అడవిలోకి పారిపోయాడు. పది రోజులుగా ఏవోబీలో గ్రేహౌం డ్స్, బీఎస్‌ఎఫ్, ఎస్‌వోజీ, జీవీఎఫ్ బలగాలు మారుమూల గ్రామాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అయినా మావోయిస్టులు చెలరేగి ఇద్దరిని పొట్టనపెట్టుకున్నారు. దీంతో మారుమూ ల గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ఏజెన్సీ బంద్‌కు మిశ్రమ స్పందన
మన్యంలో బుధవారంనాటి ఏవోబీ బంద్‌కు మిశ్రమ స్పందన కనిపించింది. పోలీసుల విస్తృత ప్రచారంతో మావోయిస్టుల బంద్‌ను కొన్ని ప్రాంతాల్లోని గిరిజనులు పట్టించుకోలేదు. జి.మాడుగుల మండలం మద్దిగరువు, పెదబయలు మండలం గోమంగి, కొరవంగి, లక్ష్మీపేట, ముంచంగిపుట్టు మండలం కుమడ ప్రాంతాల్లో రవాణా స్తంభించింది. ఆర్టీసీ సర్వీసులతోపాటు ప్రైవేటు వాహనాలు కూడా తిరగలేదు. పోలీసుల సూచనలతో పాడేరు నుంచి ముంచంగిపుట్టు వరకు బస్సులు నడిపారు.
అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట, పాడేరు మండలాల్లో బంద్ ప్రభావం కానరాలేదు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు యథావిధిగా పనిచేశాయి. దుకాణాలు కూడా తెరుచుకున్నాయి. పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల, చింతపల్లి, కొయ్యూరు మండల కేంద్రాల్లో బంద్‌కు మిశ్రమ స్పందన కనిపించింది. చింతపల్లి, కించుమండ వారపు సంతలు యథావిధిగానే జరిగాయి.
జీకే వీధి, చింతపల్లి మండలాల్లోని మారుమూల ప్రాంతాలకు మాత్రం రవాణా స్తంభించింది. మావోయిస్టుల బంద్ పిలుపుతో మన్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం ముందస్తుగానే అప్రమత్తమైంది. మావోయిస్టు ప్రభావిత మండలాల్లోని మారుమూల గ్రామాల్లో పోలీసు గాలింపు చర్యలను కూడా విస్తృతం చేసింది. మండల కేంద్రాల్లో తనిఖీలు కూడా జరిపారు.
ఉలిక్కిపడిన ఏవోబీ
Published Thu, Nov 21 2013 1:29 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement