సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఉత్తరాన ఉరికి వస్తున్న భాస్కర్ దళం.. ఈశాన్యం నుంచి చొచ్చుకొస్తున్న మావోయిస్టులు.. వెరసి పోలీసులకు కంటి మీద కునుకు కరువైంది. రాష్ట్రంలోకి చొరబడాలని మావోయిస్టులు, వెనక్కి తరిమికొట్టాలని గ్రేహౌండ్స్ బలగాలు చూస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో భారీగా మావోయిస్టులు కాచుకుని ఉన్నారన్న సమాచారంతో సీఆర్‌పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్ దళాలు అప్రమత్తమయ్యాయి. వీరు చొరబడితే విధ్వంసాలకు దిగుతారన్న ముందస్తు సమాచారంతో దండకారణ్యంలో జల్లెడ పడుతున్నాయి. తెలంగాణ నుంచి దాదాపు 50 కి.మీ.దూరం ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా ఇంజారం గ్రామం వద్దే వారిని నిలువరించేందుకు సీఆర్‌పీఎఫ్ కోబ్రా, గ్రేహౌండ్స్ దళాలు డ్రోన్ కెమెరాలతో మైదానాలు, వాగులు, వంకలపై నిఘా పెంచారు. సీఆర్‌పీఎఫ్ వద్ద ఉన్న డ్రోన్ కెమెరాలు చాలా ప్రత్యేకమైనవి. భూమి మీద చీమనైనా గుర్తించగలిగే శక్తి వీటి ప్రత్యేకత. పైగా వేల మీటర్ల ఎత్తున ఎగిరే వీటిని భూమి మీద నుంచి గుర్తించడం సాధ్యం కాదు.
దండకారణ్యం జల్లెడ: ఈ నెల 13వ తేదీన ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలో దాదాపు 300 మంది మావోయిస్టులు వాగు దాటుతున్న దృశ్యాలు సీఆర్‌పీఎఫ్ డ్రోన్‌కు చిక్కాయి. వీరు సమీపంలోని సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై దాడి చేసేందుకు భారీగా తరలిరావడం గమనార్హం. వీరంతా సుకుమా జిల్లాకు సమీపంలోని ఇంజారం గ్రామం దాకా వచ్చారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు ద్వారా తెలంగాణలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి వారిని వెనక్కివెళ్లేలా చేయడంలో దాదాపు వేయిమందికిపైగా కోబ్రా–గ్రేహౌండ్స్ పోలీసులు సఫలీకృతమయ్యారు. అయినా, వదలని పోలీసు బలగాలు వీరిని దండకారణ్యం వైపు తరిమికొట్టే వ్యూహంతో కూంబింగ్ చేస్తున్నాయి. వీరిని తెలంగాణ సరిహద్దు నుంచి వీలైనంత వరకు దూరంగా పంపాలన్న ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో వీరు సాయుధ బలగాలను ఏమార్చి ఇతర మార్గాల్లో రాష్ట్రంలోకి రాకుండా.. సరిహద్దు వెంబడి సైతం పటిష్ట నిఘా ఉంచారు.
ఆ 300 మంది మావోయిస్టులు ఎక్కడ?
Published Tue, Sep 22 2020 8:13 AM | Last Updated on Tue, Sep 22 2020 9:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment