- ఒక వైపు మావోయిస్టుల విధ్వంసాలు
- మరోవైపు పోలీసుల కూంబింగ్‌లు
కొయ్యూరు,. న్యూస్‌లైన్ : గిరిజన పల్లెలు భయంతో వణుకుతున్నాయి. కరవమంటే కప్పకు కోపం...విడవమంటే పాముకు కోపం అన్న చందాన ఉంది వారి పరిస్థితి. ఓ వైపు మావోయిస్టులు వరుస విధ్వంసాలకు తెగబడుతుండగా మరో వైపు పోలీసులు కూంబింగ్‌లతో హడలెత్తిస్తున్నారు. ఎన్నికలు బహిష్కరించాలని ఓ వైపు మావోయిస్టులు పిలుపునిస్తుండగా ఎన్నికలను పక్కా గా నిర్వహించాలని పోలీసు లు ప్రతినబూనారు. దీంతో ఇరువర్గాల నడుమా గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
వారం కిందట బూదరాళ్ల పంచాయతీలో ముకుడుపల్లి, కిండంగి గ్రామాలకు చెందిన 21 మంది మిలీషియా సభ్యులు జిల్లా రూరల్ ఎస్సీ దుగ్గల్ ఎదుట లొంగిపోయారు. మరో ఐదుగురిని అరెస్టు చేశారు. కొన్ని గ్రామాలను పోలీసులు చుట్టుముట్టి గిరిజనులను తీసుకుపోవడంతో వారి బంధువులు మండల కేంద్రానికి వచ్చి నేతలను కలుస్తున్నారు. అయితే పోలీసులు వద్ద ఉన్న సమాచారం మేరకు గిరిజనులను తీసుకెళ్లి విచారిస్తున్నారు. వారు సానుభూతిపరులు అని తేలితే అరెస్టు చేస్తున్నారు.
మావోయిస్టులు ఇటీవల విధ్వంసాలకు పాల్పడడంతో పోలీసులు వాటిని నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం మావోయిస్టుల చర్యలను కట్టడి చేసేం దుకు అవుట్ పోస్టులను ఏర్పాటు చేయాలని చూస్తుంటే వాటిని ఉపసంహరించుకోవాలంటూ గిరిజనులు ర్యాలీలు,ఆందోళనలు చేస్తున్నారు. పోలీసు అధికారులు మాత్రం ఆ ర్యాలీల వెనక మావోయిస్టుల హస్తం ఉందని బలంగా నమ్ముతున్నారు.
ఎక్కువమందిపై బైండోవర్లు..? : 2009 ఎన్నికల్లో మారుమూల ప్రాంతాలకు సంబంధించి ఎవరికైతే మావోయిస్టులతో సంబంధాలున్నాయని కేసులు పెట్టారో అలాంటి వారిపై తిరిగి బైండోవర్లు చేసే అవకాశం ఉంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న బూదరాళ్ల,పలకజీడి, పెదలంక కొత్తూరు, ఎం.బీమవరం లాంటి చోట్ల ఎన్నికలు నిర్వహించడం కష్టంగా నే ఉంటుంది. అధికారులు కొన్ని చోట్లకు నడిచి వెళ్ల్లాలి. పోలింగ్ సిబ్బంది కూడా ఇబ్బందులు పడతారు. దీంతో ఎన్నికల విధులకు ఆటంకం కలిగించకుండా ఉండేం దుకు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.