మంచం పట్టిన మన్యం | Manyam peoples deases | Sakshi
Sakshi News home page

మంచం పట్టిన మన్యం

Jul 16 2016 3:44 AM | Updated on Sep 4 2017 4:56 AM

మంచం పట్టిన మన్యం

మంచం పట్టిన మన్యం

ఏజెన్సీలో రోగాలు ముసురుకుంటున్నాయి. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు గెడ్డల్లో కొత్తనీరు చేరి కలుషితమవుతుంది.

మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. పీహెచ్‌సీలన్నీ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. కలుషిత నీరు, పారిశుద్ధ్యం లోపించడం, దోమతెరలు పంపిణీ కాకపోవడం వంటి సమస్యలతో గిరిజనులు రోగాల బారినపడుతున్నారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయకపోవడంతో గిరిజనులంతా పీహెచ్‌సీలకు పరుగులు తీస్తున్నారు. మరోవైపు పూర్తిస్థాయిలో వైద్యులు లేకపోవడం, మందులు అరకొరగా ఉండటంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.
 
* ఏజెన్సీని చుట్టుముడుతున్న రోగాలు
* రోగులతో నిండిన పీహెచ్‌సీలు
* కలుషిత నీటితో తప్పని అవస్థలు

సీతంపేట: ఏజెన్సీలో రోగాలు ముసురుకుంటున్నాయి. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు గెడ్డల్లో కొత్తనీరు చేరి కలుషితమవుతుంది. కొన్ని గ్రామాల ప్రజలు తాగునీటి కోసం గెడ్డనీటిపైనే ఆధారపడటంతో గిరిజనులు టైఫాయిడ్ వంటి విషజ్వరాల వ్యాధుల బారిన డుతున్నారు. మరికొన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం క్షీణించడంతో దోమలు స్వైరవిహారం చేస్తూ మలేరియా వంటి వ్యాధులను కలుగజేస్తున్నాయి. దీంతో ఏజెన్సీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి.

ముఖ్యంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటివరకు 250కిపైగా మలేరియా కేసులు నమోదైనట్టు అధికారులు చెబుతుండగా వాటి సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చని అనధికార అంచనా. టైఫాయిడ్, డయేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయి.
 
అరకొరగా వైద్య సిబ్బంది..
ఐటీడీఏ పరిధిలో 27 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. మరో 151 ఉప ఆరోగ్య కేంద్రాలు, 2 ఏరియా ఆస్పత్రులు, 10 సీహెచ్‌సీలు 10 ఉన్నాయి. హైరిస్క్ ప్రాంతమైన సీతంపేట ఏజెన్సీలో సీతంపేట, దోనుబాయి, కుశిమి, మర్రిపాడు గ్రామాల్లో పీహెచ్‌సీలు ఉన్నాయి. రోజుకు ఒక్కో పీహెచ్‌సీలో 50 నుంచి 100 మంది వరకు ఓపీ నమోదవుతోంది. వారపు సంత రోజుల్లో ఆ సంఖ్య 200 వరకు ఉంటుందని వైద్యసిబ్బంది చెబుతున్నారు.

వీరికి వైద్యసేవలు అందించేందుకు పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఎక్కడా కానరావడం లేదు. సీతంపేటలో ఇద్దరు వైద్యాధికారులు మాత్రమే ఉన్నారు. గతంలో నలుగురు వైద్యులు ఉండేవారు.  దోనుబాయి, కుశిమి పీహెచ్‌సీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.   
 
మందులు బయటకొనాల్సిందే..
పీహెచ్‌సీల్లో అరకొరగానే మందులు ఉంటున్నాయి. అత్యవసర సమయాల్లో రోగులు బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. సెలైన్ బాటిళ్లు, ఇతర యాంటీబయాటిక్ మందులను బయట కొనుగోలు చేయాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. మలేరియా నిర్మూలనకు ఇప్పటి వరకు దోమతెరలు పంపిణీ చేయలేదు. నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి ఉండటంతో మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
చర్యలు తీసుకుంటున్నాం..
ఈ విషయమై డిప్యూటీ డీఎంహెచ్‌వో ఎంపీవీ నాయిక్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా గిరిజనులకు సక్రమంగా వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పూర్తిస్థాయిలో మందులను అందుబాటులో ఉంచామన్నారు. ఎటువంటి కొరత లేదని తెలిపారు.
 
వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి
గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పా టు చేయాలి. గ్రామా ల్లో ఇప్పుడు వైరల్, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఏ గ్రామం లో చూసినా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. వీరందరికీ వైద్యసేవలు అందించాలి.
- ఎస్.లక్ష్మి, ఎంపీపీ, సీతంపేట
 
వైద్యులను నియమించాలి
అన్ని పీహెచ్‌సీలకు పూర్తిస్థాయిలో వైద్యులను నియమించి వైద్యసేవలు అందించాలి. మందులన్నీ అందుబాటులో ఉంచే లా చర్యలు తీసుకోవా లి. గిరిజనులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి.
- ఎ.భాస్కరరావు, గిరిజన సంఘ నాయకుడు
 
అదుపులోకి రాని డయేరియా
వాబ(సారవకోట): మండలంలోని అన్నుపురం పంచాయతీ వాబ గ్రామంలో విజృంభించిన డయేరియా(అతిసార) శుక్రవారం నాటికీ అదుపులోకి రాలేదు. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక పీహెచ్‌సీ డయేరియా రోగులతో నిండిపోయివడంతో శిథిలావస్థకు చేరిన పాత భవనంలోనే వైద్య సేవలందించారు. గ్రామంలో సుమారు 40 మంది వ్యాధి బారిన పడటంతో అక్కడ కూడా వైద్య శిబిరం కొనసాగిస్తున్నారు. గ్రామానికి చెందిన దినేష్, మధుల పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. చోడసముద్రం, పురుషోత్తుకర్ర, చిన్నకిట్టాలపాడు, గొర్రిబంద గ్రామాల్లోనూ అతిసార వ్యాపించినట్లు సమాచారం. సారవకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పూర్తిస్థాయిలో సిబ్బంది ఉన్నా కంటిజెంట్ వర్కర్ రోగులకు సెలైన్లు ఇస్తుండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement