మన్యంలో మృత్యు ఘంటికలు
మన్యంలో మృత్యు ఘంటికలు
Published Sun, Apr 9 2017 10:26 PM | Last Updated on Tue, Sep 5 2017 8:22 AM
కాళ్లవాపు వ్యాధితో మరో గిరిజనుడి మృతి
చింతూరులో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు లేనట్టేనా?
రంపచోడవరం/వీఆర్ పురం : ఏజెన్సీలో మళ్లీ మృత్యుఘంటికలు మోగుతున్నాయి. మృత్యువాత పడుతున్న గిరిజనుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. పెరుగుతునే ఉంది. విలీన మండలం చింతూరు ఏరియా ఆస్పత్రిలో ఆదివారం కాళ్లవాపు వ్యాధితో మరో గిరిజనుడు ప్రాణాలు కోల్పోయాడు. వీఆర్ పురం మండలం కుంజంవారిగూడెం గ్రామానికి చెందిన పర్షిక ధర్మయ్య ( 30) పది రోజులుగా కాళ్లవాపు వ్యాధితో బాధపడుతూ శనివారం చింతూరు ఏరియా ఆస్పత్రిలో ప్రాణాలు వదిలాడు. ఒకే వ్యాధి లక్షణాలతో అనేక మంది చనిపోతున్నా అధికార యంత్రంగంలో కదలిక రావడం లేదు. వ్యాధి కారణాలు, నివారణ, చికిత్స గురించి ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదు.
రేఖపల్లిలో ప్రారంభమై...
వీఆర్‌పురం మండలం రేఖపల్లి పంచాయతీ పరిధిలోని అన్నవరం గ్రామంలో కాళ్లవాపు వ్యాధితో తొలి మరణం సంభవించింది. తరువాత క్రమంలో ఇతర మండలాల్లో కాళ్లవాపు లక్షణాలతో గిరిజనులు మృత్యువాత పడడం ప్రారంభమైంది.కాళ్లవాపుతో ఇప్పటి వరకు విలీన మండలాల్లో మొత్తం 13 మంది గిరిజనులు మరణించారు. వీఆర్‌పురం మండలంలో 8 మంది, చింతూరు మండలంలో నలుగురు, కూనవరంలో ఒకరు మృత్యువాతపడ్డారు. కాళ్లవాపుతో బాధపడుతున్న వారిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించినా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి.
నేటికీ అందని పౌష్టికాహారం
కాళ్లవాపు వ్యాధి ప్రభావంతో విలీన మండలాలు అతలాకుతలమయ్యాయి. ప్రభావిత గ్రామాల పర్యటనకు వచ్చిన ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కేవలం మాటలు చెప్పి వెళ్లారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ప్రభావిత గ్రామాల్లోని ప్రజలకు పౌష్టికాహారం అందించేందుకు రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పాలు, పౌష్టికాహారం పంపిణీ చేసేలా చర్యలు చేపడతామని కలెక్టర్ అరుణ్‌కుమార్ స్వయంగా హామీ ఇచ్చారు. కానీ అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. గిరిజనుల ఆరోగ్యంపై అధికారులు చూపుతున్న శ్రద్ధ ఏమిటో అర్థమవుతోంది. విలీన మండలాల్లో రక్షిత నీరు లేకపోవడం వల్ల వ్యాధులకు కారణమవుతుందని భావించారు. రక్షిత నీరు అందించేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. తాజాగా మరో గిరిజనుడు కాళ్లవాపు వ్యాధితో మృతి చెందడంతో అధికారుల హడావుడి మళ్లీ మొదలైంది.
ఇప్పటికీ గుర్తించని మూలాలు
కాళ్లవాపు వ్యాధితో గిరిజనులు మరణించి నాలుగు నెలలు కావస్తున్నా ఆ వ్యాధి రావడానికి గల కారణాలను గుర్తించలేకపోయారు. విలీన మండలాల నుంచి ఈ వ్యాధి బారిన పడిన సుమారు 200 మందికి పైగా రోగులు కాకినాడ జీజీహెచ్‌కు వెళ్లి చికిత్స పొందారు. వ్యాధి బారిన పడిన వారికి కిడ్నీలు పనిచేయకపోవడంతో చింతూరులో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. నేటికీ చింతూరు ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయలేదు. డయాలసిస్ అవసరమైన రోగులను కాకినాడ జీజీహెచ్‌కు తరలిస్తున్నారు. మన్యంలో మృత్యుఘంటికలు ఆపేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Advertisement
Advertisement