మన్యానికి మాయరోగం
మన్యానికి మాయరోగం
Published Thu, Dec 8 2016 12:17 AM | Last Updated on Mon, Sep 4 2017 10:09 PM
గిరిజనంపై విరుచుకుపడుతున్న కాళ్లవాపు వ్యాధి
నాలుగు నెలల వ్యవధిలో 14 మంది మృత్యువాత
వ్యాధి మూలాలు కనుగొనడంలో ప్రభుత్వం విఫలం
ఇచ్చిన హామీల అమలు గాలికి..
బాధితులకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ అధినేత జగన్
నేడు బాధితులకు పరామర్శ
ఆ రోగం.. ఇంటి పెద్దదిక్కులను పొట్టనపెట్టుకుంది.. ఆ ఇంటి మహలక్ష్ములను బలితీసుకుంది. ఎందరినో అనాథలను చేసింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. నాలుగు మాసాల్లో ఏకంగా 14 మంది ప్రాణాలను హరించింది. వారి కుటుంబాలను శోకసంద్రంలో ముంచింది. కాళ్లవాపు వ్యాధి అన్నారే తప్ప.. అదేం రోగమో పూర్తిగా నిర్ధారించని అధికారగణం, కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించని పాలకుల తీరు మన్యంవాసులను మరింత బాధించాయి. అయితే వారికి కొండంత భరోసానిస్తూ.. వైఎస్సార్ సీపీ జిల్లా నేతలు అండగా నిలిచారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు. తాజాగా వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం మన్యంలో పర్యటించి కాళ్లవాపు బాధితులను పరామర్శించనున్నారు. కాళ్లవాపు వ్యాధి. వీఆర్ పురం మండలం రేఖపల్లి పంచాయతీ పరిధి అన్నవరం గ్రామంలో తొలుత ప్రారంభమై పరిసర గ్రామాలకు, చింతూరు, కూనవరం మండలాలకు వ్యాపించింది. ఈ వ్యాధి బారినపడి వీఆర్‌పురం మండలంలో ఎనిమిది మంది, చింతూరు మండలంలో ఐదుగురు, కూనవరం మండలంలో ఒకరు, మొత్తం 14 మృతిచెందారు.
కన్నెత్తి చూడని పాలకులు
ఏజన్సీలో కాళ్లవాపు మరణాలతో గిరిజనులు ప్రాణాలు విడుస్తున్నా జిల్లాకు చెందిన ప్రభుత్వ పెద్దలు కనీసం కన్నెత్తి చూడ లేదు. ఓ మంత్రి చుట్టపుచూపుగా వచ్చి బాధితులను హడావిడిగా పరామర్శించి వెళ్లారే తప్ప ఇప్పటి వరకు ఆయనిచ్చిన హామీలు నెరవేరలేదు. ఏదో అరకొర సాయంగా వీఆర్‌పురం మండలానికి చెందిన ఆరు కుటుంబాలకు మాత్రమే రూ.లక్ష చొప్పున పరిహారం ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. జిల్లాకు చెందిన హోంమంత్రి, ఆర్థికశాఖ మంత్రులతో పాటు ఇన్‌చార్జి మంత్రి, స్థానిక ఎంపీలెవరూ బాధితులను పరామర్శించక పోవడం విమర్శలకు తావిస్తోంది.
కార్యరూపం దాల్చని కలెక్టర్ హామీ
కాళ్లవాపునకు నాటుసారా కూడా కారణమని జిల్లా కలెక్టర్ పేర్కొనడంతో ఈ ప్రాంత గిరిజనుల మనోభావాలు దెబ్బతిన్నాయి. మృతుల్లో ఇంటర్ విద్యార్థులూ ఉన్నారు. ఏజన్సీ ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పాలు, పౌష్టికాహార పదార్థాలు పంపిణీ చేసేలా చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ ఇచ్చిన హామీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
పత్తాలేని నివేదిక
కాళ్ల వాపు ప్రభావంతో 14 మంది గిరిజనులు మరణించినా.. ఆ వ్యాధి మూలాలు కనుగొనడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ వ్యాధితో విలీన మండలాల నుంచి 200 మందికి పైగా రోగులు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స చేయించుకున్నారు. వైద్య నిపుణులు గ్రామాల్లో పర్యటించి రోగులు, స్థానికుల రక్త నమూనాలు, ఆహారం, నీరు తదితర నమూనాలు సేకరించారు. వ్యాధి నిర్ధారణ కోసం దిల్లీ నుంచి కేంద్ర వైద్య బృందం పర్యటిస్తుందని చెప్పినా.. ఆ దిశగా అడుగుపడలేదు. కాళ్లవాపు అనేది వైద్య పరిభాషలో లేదని కిడ్నీ సంబంధిత వ్యాధితోనే కాళ్లవాపులు వస్తున్నాయని వైద్యసిబ్బంది చెబుతున్నారు. మరోవైపు రంపచోడవరంలో బ్లడ్‌బ్యాంక్, చింతూరులో కిడ్నీ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తామని జిల్లా అధికారులు ప్రకటించి నెలలు గడుస్తున్నా నేటికీ ఏర్పాటు చేయలేదు. అలాగే చింతూరు ఏరియా ఆసుపత్రిని ప్రధాన వైద్యకేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన అధికారులు అరకొర సిబ్బందిని నియమించి చేతులు దులుపుకొన్నారు.
Advertisement
Advertisement