వనసీమ వణుకుతోంది..
వనసీమ వణుకుతోంది..
Published Wed, Sep 28 2016 11:22 PM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM
విలీన మండలాల్లో కాళ్లవాపు కలవరం
ఇప్పటికే కొందరు మృత్యువాత
కాకినాడ జీజీహెచ్‌లో 43 మందికి చికిత్స
నెలన్నరైనా అంతుపట్టని వ్యాధిమూలం
కాకినాడ సిటీ : లేళ మందలపై విరుచుకుపడ్డ బెబ్బులిలా.. మన్యంలోని విలీన మండలాల్లో గిరిజనులను భయకంపితుల్ని చేస్తున్న కాళ్లవాపు వ్యాధిని గుర్తించి నెలన్నర దాటి నా దానికి కారణాలేమిటో అంతు చిక్కడం లేదు. ఇప్పటికే ఈ వ్యాధి కొందరిని పొట్టన పెట్టుకుంది. కాగా వీఆర్ పురం, చింతూరు, కూనవరం మండలాల నుంచి 43 మంది ఈ వ్యాధితో ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 15 మంది మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారని జీజీహెచ్ వైద్యులు నిర్ధారించారు. వారిలో జోగయ్య, బొజ్జి, మల్లమ్మలకు వ్యాధి తీవ్రంగా ఉన్నట్టు గుర్తించి డయాలసిస్ చేస్తున్నారు. జయమ్మ అనే మహిళకు హెపో థైరాయిడ్ సమస్య ఉండటంతో ప్రత్యేకమైన వైద్యం అందిస్తున్నారు. మిగిలిన వారి రక్త నమూనాల నివేదికలు రావల్సి ఉందంటున్నారు. కాళ్ళవాపుతో జీజీహెచ్‌లో ఉన్న రోగులు ఆయాసం, బీపీ, రక్తహీనత, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. విశాఖపట్నం నుంచి వచ్చిన ముగ్గురు నెఫ్రాలజిస్టులతో పాటు జీజీహెచ్ మెడిసిన్ విభాగం హెచ్‌వోడీలతో కూడిన వైద్యుల బృందం సేవలు అందిస్తోంది.
చిల్లిగవ్వ ఇవ్వలేదు..
కాళ్లవాపు పీడితులకు అసలు వచ్చిన రోగమేమిటో ఇంతవరకూ నిర్థారణ కాకపోవడం గిరి జనులను కలవరపరుస్తోం ది. జీజీహెచ్‌లోని ఈఎన్‌టీ బ్లాక్‌లో 43 మందికి వైద్య సేవలందిస్తున్నారు. ఇంకా ఎంత కాలం ఉండాలి, తమను ఇళ్లకు ఎప్పుడు పంపిస్తారని వ్యాధిగ్రస్తులు అడుగుతున్నారు. ఇంటి వద్ద తమ వారి పరిస్థితి ఏమిటని ఆవేదన చెందుతున్నారు. వ్యాధిగ్రస్తుల సహాయకులకూ ఆర్థిక సాయం అందిస్తామన్నా ఇంతవరకు చిల్లిగవ్వ ఇవ్వలేదు. కాళ్ళవాపు ప్రబలిన గ్రామాల్లో ప్రజలు తీసుకుంటున్న ఆహారం, తాగునీరు, నూనె తదితరాల నమూనాలను పరీక్షల నిమిత్తం హైదరాబాద్ ల్యాబ్‌కు పంపగా ఏమీ లేదని నివేదికలు వచ్చినట్టు జీజీహెచ్ వర్గాల ద్వారా తెలిసింది. అధికారులు మాత్రం పసరు మందుల వినియోగం, నాటుసారా, జీలుగు, తాటికల్లుల్లో కలిపే రసాయనాలే కారణాలు కావచ్చంటున్నారు.
Advertisement
Advertisement