ఏజెన్సీలో వసివాడి ‘పోతున్నా’రు
రాజవొమ్మంగి మండలంలో ఆగని శిశు మరణాలు
రెండు నెలల్లో ఆరుగురు మృతి
గత ఏడాది నుంచి 21 మంది కన్ను మూత
ఫలితాన్నివ్వని వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు
మరో శిశువు అసువులు బాయకుండా చర్యలన్న కలెక్టర్ హామీ నీటిమూటే
ఆ తరువాత మరో ఆరుగురు మృత్యువాత
కడుపు పండిందంటే సందడి పడ్డా ఆ బిడ్డ రూపం తలచుకుంటూ మురిసిపోయా పెరుగుతూ కదలాడుతుంటే.. ఆ బుజ్జి కాళ్లు ...చేతుల స్పర్శ కొత్త అనుభూతులు పంచిందయ్యా... నెలలు దగ్గర పడుతున్నా... ప్రసవం మరో జన్మని తెలిసినా... పురిటినొప్పుల బాధ భయపెడుతున్నా అమ్మ అనే ఆ కమ్మని పిలుపుకోసం అన్నీ తట్టుకున్నానయ్యా.. పేగు తెంచుకుంది... ఊపిరిపోసుకుంది ఆ శ్వాసే ఆగిపోతుంటే... అమ్మా అనే పిలుపు సరే.. ఆ... అనే ఏడుపే లేకుంటే ఆ స్వరమే మూగబోతే... జాలిగా చూసే ఆ కళ్లే మూతపడితే...
ఈ చావు కేకలు ఎన్నాళ్లయ్యా ఈ కడుపు కోత ఇంకెన్నాళ్లయ్యా...
రాజవొమ్మంగి, (రంపచోడవరం) : మన్యంలో ఓ మండలం ... అక్కడే వరుస శిశు మరణాలు... చావుకేక వినిపించగానే జిల్లా వైద్యాధికారుల హడావుడి... ప్రజా ప్రతినిధుల పరామర్శలు ... అది మరిచిపోకముందే మరో మరణం...ఇలా ఈ ఏడాదిలోనే ఆరుగురు చనిపోగా ...గత ఏడాదిలో చోటుచేసుకున్న మరణాలను కూడితే 21. ఈ మండలంలో గత ఐదు నెలలుగా ఒకదాని తరువాత ఒకటిగా మాతాశిశు మరణాలు సంభవిస్తున్నా ప్రభుత్వం వాటిని అదుపు చేయలేకపోతోంది.
l శనివారం రాజవొమ్మంగి కమ్మరిపేటకు చెందిన పోలోజు రాజేశ్వరికి నాలుగున్నర నెలల క్రితం జన్మించిన ఆడ శిశువు ఊపిరి ఆడక చనిపోయింది.
l మండలంలోని లోదొడ్డి పంచాయతీ, కేశవరం గ్రామానికి చెందిన గోము బుజ్జమ్మకు జన్మించిన సుమారు మూడు నెలల వయసున్న ఆడ శిశువు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ నెల 15న చనిపోయింది.
l ఈ నెల 13న రాజవొమ్మంగిలో దేశెట్టి లోవకుమారి అనే ఆరు నెలల బాలింత మరణించగా, ఈ నెల 10న లోదొడ్డి గ్రామంలో ముర్ల బంగారికి పుట్టిన 47 రోజుల వయసున్న పాప చనిపోయింది. లోదొడ్డి గ్రామం లోతట్టు ప్రాంతంలో ఉండడంతో ఆలస్యంగా వెలుగు చూసింది.
l లోదొడ్డి గ్రామానికే చెందిన ముర్ల బంగారి (20) డిసెంబర్ 26న ఇంటి వద్దనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమె జడ్డంగి పీహెచ్‌సీలో ప్రసవానంతర వైద్య సేవలు పొందింది. ఆమెకు పుట్టిన పాప కడుపు నొప్పితో బాధపడుతూ ఈ నెల 11న ఏడుస్తుండడంతో కుటుంబీకులు జడ్డంగి పీహెచ్‌సీకు తరలించారు. ఆ పాప మార్గ మధ్యలోనే చనిపోయింది. ఈ విధంగా ఈ ఏడాదిలో ఇప్పటికే ఐదుగురు శిశువులు, ఒక బాలింత చనిపోయారు.
l జనవరి 6న వంచంగి గ్రామంలో కోసూరి నాగమణికి, జనవరి 12న కేశవరం గ్రామంలో మేలిన వీరలక్షి్మకి, ఫిబ్రవరి 6న దోనెలపాలెంలో పడాల వెంకటలక్ష్మికి పుట్టిన పాపలు ఒకరి తరువాత ఒకరు చనిపోయారు. గతేడాది ఇదే రీతిలో అక్టోబర్ నెల నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకూ 16 మంది నవజాత శిశువులు, ఒక బాలింత మరణించారు. మాతాశిశు పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామంటూ ప్రభుత్వం అట్టహాసంగా చేస్తున్న ప్రచారాన్ని ఈ మరణాలు అపహాస్యం చేస్తున్నాయి.
ప్రచారం మినహా నివారణ సున్నా...
జిల్లాలో ఎక్కడా లేని విధంగా రాజవొమ్మంగి మండలంలోనే వరుసగా మాతా శిశు మరణాలు సంభవిస్తున్నాయి. అయినప్పటికీ వైద్య,ఆరోగ్యశాఖ పనితీరు మెరుగుపడకపోవడం పట్ల గిరిజనులు తప్పుపడుతున్నారు. ఇప్పటి వరకూ మాతా శిశు సంక్షేమం, వైద్య, ఆరోగ్య శాఖలు ఇంతవరకూ మండలంలో తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వలేదని ఈ మరణాలు ధ్రువీకరిస్తున్నాయి. మాతా శిశుమరణాల విషయంలో అప్రమత్తంగా ఉన్నామని, మరో శిశువు మరణించకుండా అన్ని చర్యలూ తీసుకొంటున్నామని రెండు నెలల కిందట లోదొడ్డి వచ్చిన కలెక్టర్ అరుణ్‌కుమార్ గిరిజన ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఈ మరణాలు కొనసాగుతుండడం పట్ల గిరిజనులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రక్తహీనత, పౌష్టికాహారం లోపాలతో గర్భిణులు అనారోగ్యం పాలవడం, పూర్తిస్థాయి వైద్యసేవలు మన్యంలో అందుబాటులో లేకపోవడం గిరిబిడ్డల పాలిట శాపంగా పరిణమిస్తోంది.
ప్రతికూల వాతావరణమూ కారణం..
రాజవొమ్మంగి పీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండడం లేదు. చనిపోయిన శిశువుల్లో ఎక్కువ మంది శ్వాస ఆడక ఇబ్బంది పడిన వారే. ఈ శిశువులకు స్థానిక పీహెచ్‌సీలో ప్రాథమిక వైద్యం అనంతరం కాకినాడలోని ప్రభుత్వ సాధారణ ఆస్పత్రికి తరలించే లోగానే ప్రాణాలు వదులుతున్నారు. ఈ క్రమంలో రాజవొమ్మంగి పీహెచ్‌సీలోనే శ్వాస సంబంధ, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుడిని అందుబాటులో ఉంచగలిగితే ఇలాంటి మరణాలను చాలావరకూ అరికట్టవచ్చని స్థానికులు వేడుకుంటున్నారు. అంతంత మాత్రం ఆరోగ్యంతో ఉండే ఈ ప్రాంత పసికందుల మృతికి ప్రతికూల వాతావరణం కూడా కారణంగా కనిపిస్తోందని అంటున్నారు.