గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తాం
గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తాం
Published Fri, Dec 9 2016 11:38 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
అభిరుచులకు అనుగుణంగా మెనూకు..
ఉపాధి కూలీలకు ప్రసూతి సెలవులకు ప్రతిపాదనలు
జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్
రంపచోడవరం : ఏజెన్సీలో మాతా శిశు మరణాలపై అధికార యంత్రాంగం స్పందించింది. రాజవొమ్మంగి మండలంలో మాతా శిశు మరణాలపై సాక్షి ప్రత్యేక కథనం ప్రచురించింది. జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ శుక్రవారం రంపచోడవరం వచ్చి ఐటీడీఏ పీవో ఎఎస్ దినేష్‌కుమార్‌తో కలిసి గర్భిణులకు అందించాల్సిన పౌష్టికాహారంపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో మాతా శిశు మరణాల రేటును తగ్గించేందుకు గర్భిణుల అభిరుచులకు అనుగుణంగా ప్రసవానికి ముందు తరువాత పోషకాహార మెనూ రూపొందించి ప్రభుత్వానికి నివేదించి అనుమతి తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. మండలంలోని నరసాపురం పీహెచ్‌సీలో ప్రధాన మంత్రి సురక్షా మాతృత్వ అభియాన్ కార్యక్రమం పేరిట గర్భిణుల ఆరోగ్య మేళాను నిర్వహించారు. ప్రతి నెల 9న ప్రధాన మంత్రి సురక్షా మాతృత్వ అభియాన్ పేరిట అన్ని పీహెచ్‌సీల్లో గైనకాలజీస్ట్‌లతో వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ప్రసవం ఇబ్బంది అయ్యే గర్భిణులను గుర్తించి తగిన వైద్యం అందిస్తామన్నారు. పీహెచ్‌సీకి వచ్చే గర్భిణులకు ఐటీడీఏ ఉచితంగా భోజనం కల్పిస్తుందన్నారు. గర్భిణులకు టేక్‌హోం రేషన్ ఇంటికి ఇవ్వకుండా అంగన్వాడీలోనే ఆహారం తీసుకునేలా ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఇక్కడి గర్భిణులకు 7 శాతం మాత్రమే రక్తం ఉంటుందని కనీసం 12 శాతం రక్తం ఉండేలా జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఉపాధి పనికి వెళ్లే మహిళలకు కష్టమైన పనులు అప్పగించొద్దన్నారు. ఉపాధి పనికి వెళ్లకుండా ప్రసూతి సెలవులు ఇచ్చేలా ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. అంగన్వాడీ వర్కర్లు పనితీరు మెరుగుపరచుకోకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. కలెక్టర్ సతీమణి, శిశు సంజీవని జిల్లా కోఆర్డినేటర్ శ్రీదేవి మాట్లాడుతూ ఏజెన్సీలో మాతా శిశు మరణాలు తగ్గించేందుకు మండలానికి 10 అంగన్వాడీ కేంద్రాలు చొప్పున 11 మండలాల్లో 110 కేంద్రాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని అంగన్వాడీ మోనటరింగ్ కమిటీ నియమిస్తామన్నారు. ఐదు నూర్లు పేరిట 100 గుడ్లు, 100 గ్లాసుల పాలు, ఐరన్ మాత్రలు, బెల్లం వేరుశనగ అచ్చులను గర్భిణులు తీసుకోవాలన్నారు. ఏజెన్సీలో పోషకాహార లోపాల తరువాత పరిణామాలపై ఇప్పటికే అధ్యయనం చేశారన్నారు. ఏడీఎం అండ్ హెచ్‌ఓ పవన్కుమార్, సావిత్రి, రేణుక, గైనకాలజీస్ట్ కావ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement