మాతా శిశు మరణాలు అరికట్టడంలో ప్రభుత్వం విఫలం
మృతులకు రూ.3 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
వైఎస్సార్‌సీపీ నేత అనంత బాబు
గంగవరం (రంపచోడవరం): ఏజెన్సీలో మాతా శిశు మరణాలను నివారించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, నియోజకవర్గ కన్వీనర్ అనంత ఉదయభాస్కర్ (బాబు) విమర్శించారు. శనివారం మండలంలో పర్యటించిన ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. రంపచోడవరం ఏజెన్సీ డివిజన్‌లో దాదాపు అన్ని మండలాల్లో శిశు మరణాలు సంభివిస్తున్నాయని, అధికంగా రాజవొమ్మంగి మండలంలో జరుగుతున్నాయన్నారు. శిశు మరణాలపై ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. మృతుల కుటుంబాలకు రూ.మూడు లక్షల వంతున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఏజెన్సీ పర్యటన సమయంలో మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున ఆర్థిక సాయం అందించారన్నారు. వరుసగా శిశు మరణాలు సంభవిస్తున్నా ప్రభుత్వం, అధికారులు వాటిని అరికట్టడంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. గిరిజనులకు సరైన వైద్య సేవలు అందడంలేదన్నారు. గిరిజన గ్రామాలలో వైద్యశిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహించి గర్భిణులు, బాలింతలను చైతన్య పరచాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో గిరిజనులకు మౌలిక సౌకర్యాలు అందడంలేదన్నారు. తాగునీటి ఎద్దడి నివారణకు పటిష్టమైన చర్యలను తీసుకోవాలని ఆయన డిమాండ్ చేవారు. ఆయన వెంట మండల కన్వీనర్ అమృత అప్పలరాజు, మాజీ కన్వీనర్ కల్లం సూర్యప్రభాకర్, జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యులు ఏడుకొండలు, ముప్పనశెట్టి శ్రీను, మండల నాయకులు ఇరాట రమణ, బేబీరాణి, గంగాదేవి, తిరుపతిరావు, మాడెం కుమార్, మాగంటి శ్రీను, స్థానిక సర్పంచ్ అక్కమ్మ తదితరులు ఉన్నారు.