
మన్యంలో విస్తరిస్తున్న పైనాపిల్
తొలిసారిగా చేయూతనిస్తున్న ఉద్యాన శాఖ:
1200 ఎకరాల్లో సాగు
చింతపల్లి: మన్యంలో పైనాపిల్ సాగు విస్తరిస్తోంది. ఈ పంటప్ల ఆసక్తి చూపే రైతులకు ఉద్యానశాఖ చేయూతనిస్తోంది. ఎకరాకు రూ.10, 500 ఆర్థిక సాయం చేస్తోంది. గతేడాది నాలుగు వందల ఎకరాల్లో ఈ పంటను చేపట్టిన గిరిజనులు, ఈ ఏడాది 800 ఎకరాల్లో చేపట్టారు. ఏజెన్సీ వాతావరణం పైనాపిల్ సాగుకు అత్యంత అనుకూలం. ప్రభుత్వపరంగా ప్రోత్సహం లేక ఇంతకాలం నామమాత్రంగా సాగుచేసేవారు. ఉద్యానశాఖ అన్ని రకాల పండ్ల తోటల పెంపకానికి సాయపడుతోంది. పైనాపిల్ సాగుకు ఆర్థికంగా సాయపడే అవకాశం లేక పోవడంతో, ఇంత కాలం రైతులు ఈ పంట పట్ల కు అంతగా ఆసక్తి కనబరచ లేదు. 2012-13లో ఉద్యానశాఖ ఏడీ ప్రభాకర్‌రావు, నాబార్డ్ బృందం చింతపల్లి మండలం తాజంగి ప్రాంతంలో పర్యటించి, పైనాపిల్ సాగు అవకాశాలపై అధ్యయనం చేసింది. సాగు అవకాశాలు మెండుగా ఉండడంతో ప్రణాళిక రూపొందించి, ఉద్యానశాఖ రాష్ట్ర కమిషనర్‌కు నివేదించింది. నాబార్డ్ సహాయంతో గిరిజన వికాస్ స్వచ్ఛంద సంస్థ ఇరవై గ్రామాల్లో 20 రైతు క్లబ్‌లు ఏర్పాటుచేసి పైనాపిల్ సాగువిధానం, ఎరువుల వినియోగం, సస్యరక్షణ, దిగుబడులు వంటి అంశాలపై స్థానిక ఉద్యాన పరిశోధన స్థానంలో శిక్షణ ఇప్పించడంతో పాటు, ఇతర జిల్లాల్లో రైతులు సాగుచేస్తున్న తోటల వద్దకు తీసుకు వెళ్లి ప్రత్యక్ష అవగాహన కల్పించారు.
పైనాపిల్ సాగు ప్రణాళిక లను పరిశీలించిన రాష్ట్ర ఉద్యానశాఖ కమిషన్ ఆర్థిక సాయానికి ముందుకు వచ్చింది. ఎకరా భూమిలో పంట సాగుకు రూ.25 వేలు ఖర్చవుతుంది. పిలకలు, క్రిమి సంహారక మందులు కొనుగోలుకు, ఎకరాకు రూ.10,500లు చొప్పున, ఉచితంగా రెండేళ్ల పాటు ఆర్థిక సాయం చేస్తుంది. ఒక్కో రైతు పది ఎకరాల వరకు సాగు చేసుకునేందుకు సాయం అందిస్తుంది. ఈఏడాది అనంతగిరి మండలంలో 100 ఎకరాలు,చింతపల్లి మండలంలో700 ఎకరాల్లో పైనాపిల్ సాగు చేపట్టారు. ఇలా మన్యంలో సాగు విస్తీర్ణం పెరుగుతోంది.
సద్విని యోగం చేసుకోవాలి
పైనాపిల్ సాగుకు తాము అందిస్తున్న సహాయాన్ని సద్విని యోగం చేసుకోవాలి. పకృతి వైపరీత్యాలకు వ్యవసాయ పంటలు దెబ్బ తింటున్నాయి. రైతులు నష్టాల పాలవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఈ అవకాశాన్ని అంది పుచ్చుకుని ఉద్యాన పంటల సాగుకు ముందుకు రావాలి. - జి.ప్రభాకర్రావు, ఉద్యానశాఖ ఏడీ:
అవగాహన కల్పిస్తున్నాం
పైనాపిల్ సాగు పట్ల గిరిజన రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. సాగు లాభదాయకంగా ఉంటుంది. అలవాటు పడే వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. తాజాగా మరి కొంత మంది రైతులకు అవగాహన కల్పించేందుకు శ్రీకాకుళం జిల్లా సీతంపేటకు తీసుకు వెళ్లాము. మా ప్రయత్నం ఫలించినందుకు సంతోషంగా ఉంది.
- నెల్లూరి సత్యనారాయణ, కార్యదర్శి, గిరిజనవికాస్ స్వచ్ఛంద సంస్థ, జీకే వీధి