తొక్క తీసిన క్లీన్ కాఫీ గింజలు
సాక్షి, విశాఖపట్నం: రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు లేకుండా.. విశాఖ మన్యంలో ప్రకృతి సిద్ధంగా పండుతున్న కాఫీ గింజలకు డిమాండ్ పెరిగింది. పల్ప్ తీసిన (క్లీన్) కాఫీ గింజలకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధర పలికింది. గత ఏడాది కిలోకు రూ. 90 నుంచి రూ. 110 వరకూ ఉన్న ధర ఈ ఏడాది రూ. 150 వరకూ పెరిగింది. ప్రస్తుతం అనుకూల వాతావరణ పరిస్థితుల్లో కాఫీ గింజల దిగుబడి కూడా బాగా పెరిగింది.
దీంతో గిరిజన రైతులు కాఫీ తోటల సాగుపై మక్కువ చూపిస్తున్నారు. ఫలితంగా ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. 1985లో 10,107 ఎకరాల్లో ఉన్న కాఫీ తోటలు.. గతేడాది నాటికి 2,22,390 ఎకరాలకు విస్తరించాయి. ఈ సీజన్‌లో 1.65 లక్షల ఎకరాల్లో కాఫీ గింజల పంట వచ్చింది. దాదాపు 11,500 మెట్రిక్ టన్నుల మేర దిగుబడి వచ్చిందని పాడేరు ఐటీడీఏ కాఫీ ప్రాజెక్టు సహాయ సంచాలకులు రాధాకృష్ణ చెప్పారు. ఈ ఏడాది మరో 15 వేల ఎకరాల్లో కాఫీగింజల సాగును విస్తరిస్తామని తెలిపారు. రానున్న ఆగస్టు నెలలో నాటేందుకు వీలుగా నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేస్తున్నారు. మొక్కలు నాటిన ఐదేళ్ల తర్వాత ఫలసాయం చేతికొస్తుంది.
ఏటా కాఫీ తోటల విస్తరణ....
సాధారణంగా మార్చి–ఏప్రిల్ నెలల్లో ఐదారు పెద్ద వర్షాలు, పూత దశలో 15 డిగ్రీల నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, నీరు నిలవని సారవంతమైన ఏటవాలు భూములు కాఫీ సాగుకు అనుకూలం. ఇటువంటి అనుకూల పరిస్థితులున్న విశాఖ మన్యంలో 2025–26 సంవత్సరం నాటికి మరో 58 వేల ఎకరాలకు కాఫీ తోటలను విస్తరించాలనే లక్ష్యంతో ఐటీడీఏ కృషి చేస్తోంది. ప్రస్తుతం ఏజెన్సీలో దాదాపు 1.20 లక్షల విస్తీర్ణంలో వరి, చోడి, రాజ్‌మా, సామలు, మొక్కజొన్న, కందులు వంటి పంటలు సాగు చేస్తున్నారు. వాటి సాగు కన్నా కాఫీ, అంతరపంటగా మిరియాల సాగు లాభసాటిగా ఉండటంతో గిరిజన రైతులు కాఫీ సాగు వైపు మొగ్గు చూపిస్తున్నారు.
విదేశాల్లో పెరుగుతున్న ప్రాచుర్యం...
మన్యంలో పూర్తిగా సేంద్రియ విధానంలో పండుతున్న అరబికా రకం కాఫీ.. విదేశాల్లో అరకు కాఫీగా ప్రాచుర్యం పొందుతోంది. ఇక్కడి ఉత్పత్తిలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని జీసీసీ ఏటా వెయ్యి టన్నుల వరకూ క్లీన్ కాఫీ గింజలు కొనుగోలు చేస్తోంది. మరో పది శాతం స్థానిక ప్రైవేట్ వ్యాపారులు కొంటున్నారు. మిగతా 80 శాతం విదేశాలకు ఎగుమతి అవుతోంది. మహీంద్ర గ్రూప్‌నకు చెందిన అరకు గ్లోబల్ హోల్డింగ్స్ అనే సంస్థ ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ‘అరకు కాఫీ’ పేరుతో కాఫీ షాప్ ఏర్పాటు చేసింది.
ధర అదుర్స్..
ఈ ఏడాది ఎకరానికి సగటున 100 నుంచి 120 కిలోల క్లీన్ కాఫీ గింజల దిగుబడి వచ్చింది. కిలోకు రూ. 140 నుంచి రూ. 150 వరకూ ధర ఉంది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కూడా ధర పెంచడంతో ప్రైవేట్ వ్యాపారులు, సంస్థలు పెంచక తప్పలేదు. ఇక కాఫీలో అంతరపంటగా ఒక్కో ఎకరాకు 150 నుంచి 160 మిరియం పాదులు ఉంటే అదనంగా రూ. 40 వేల వరకూ ఆదాయం రైతులకు వస్తోంది. విశాఖ మన్యంలోని 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటి పరిధిలోని 3,952 గ్రామాల్లో 1.34 లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి. దాదాపుగా 200 గ్రామ పంచాయతీల పరిధిలో కాఫీ తోటలు ఉన్నాయి. 80 శాతం కుటుంబాలు వాటిపై ఆధారపడుతున్నాయి. విశాఖ మన్యంలో కాఫీ గింజల సాగును ప్రోత్సహించడానికి పాడేరు ఐటీడీఏ, కాఫీ బోర్డు ప్రాంతీయ పరిశోధన కేంద్రం (ఆర్‌సీఆర్‌ఎస్) విశేష కృషి చేస్తున్నాయి. విత్తనాలు, నర్సరీల ఏర్పాటుకు అవసరమైన సామగ్రిని రాయితీపై ఐటీడీఏ అందిస్తోంది. నర్సరీలను గిరిజన రైతులే స్వయంగా అభివృద్ధి చేసుకుంటున్నారు.
ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం...
గిరిజనుల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహాలు అందిస్తోంది. చింతపల్లి ట్రైబల్ ఆర్గానిక్ కాఫీ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. చింతపల్లి మండలంలో చిన్న, సన్నకారు కాఫీ రైతులను సంఘటితం చేసి రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్‌పీఓ)ను ఏర్పాటు చేసింది. దీన్ని మాక్స్ (ఎంఏసీఎస్) యాక్ట్ కింద రిజిస్టర్ చేశారు. తద్వారా రైతులే తాము ఉత్పత్తి చేసిన కాఫీ పంటను మేలైన పద్ధతుల్లో పల్పింగ్ చేయించుకునే అవకాశం ఏర్పడింది. ఆ కాఫీ గింజలను టాటా కాఫీ లిమిటెడ్ తదితర పెద్ద సంస్థలకు విక్రయించడం ద్వారా అధిక ధర పొందుతున్నారు. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో కాఫీ దిగుబడి వచ్చింది. వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతం వంటి అనుకూల వాతావరణమే దీనికి కారణం.
– రాధాకృష్ణ, సహాయ సంచాలకులు, పాడేరు ఐటీడీఏ కాఫీ ప్రాజెక్టు
చదవండి:
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! మే 31న ఉద్యోగ క్యాలెండర్
104కు మరింత ప్రాచుర్యం: సీఎం వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment