ముంచంగిపుట్టు(అరకులోయ)అల్లూరి సీతారామరాజు జిల్లా: ఒక్కసారి కొరికితే.. నోటినిండా తియ్యటి తేనెలూరుతుంది. ఎంత తిన్నా జిహ్వ చాపల్యం తీరక.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజనులు తయారుచేసే మామిడి తాండ్ర రుచి అలాంటిది మరి. వేసవి వచ్చిందంటే చాలు. మన్యంలో మామిడి తాండ్ర హడావుడి మొదలవుతుంది. ఇక్కడ తయారయ్యే తాండ్ర రుచులు మైదాన ప్రాంత ప్రజల మనసునూ దోచుకుంటున్నాయి. కొండ, అటవీ ప్రాంతాల్లో లభించే మామిడి పండ్లతో తయారు చేసే తాండ్ర.. చాలా రుచిగా ఉంటుంది. గిరిజన మహిళలు తయారు చేసే ఈ తాండ్రకు మన్యంతో పాటు మైదానంలో మంచి గిరాకీ ఉంది.
చదవండి: హమ్మ తొండా.. ఎంత పనిచేశావే!
ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా గ్రామాల్లోని చాపలు, ప్లేట్లలో మామిడి తాండ్ర తయారు చేసే పనిలో గిరిజన మహిళలు బిజీగా ఉన్నారు. వారపు సంతలో కిలో తాండ్ర రూ.100 వరకు పలుకుతున్నా.. ఎంతో రుచిగా ఉండడంతో కొనుగోలుదారులు ధరను లెక్క చేయడం లేదు. మామిడి పండ్ల సీజన్ అయిపోయిన తర్వాత కూడా తాండ్రను భద్ర పరుచుకుని తినే అవకాశం ఉండడంతో కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్ తగ్గట్టుగా మన్యం మహిళలు తాండ్రను తయారు చేస్తున్నారు.
తాండ్రను తయారు చేస్తున్న గిరిజన మహిళ
సహజసిద్ధంగా తయారీ
గిరిజన గ్రామాలకు అనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో మామిడి చెట్లకు కాసే కొండ మామిడి పండ్లను ఇంటిల్లిపాదీ సేకరిస్తారు. వాటిని శుభ్రపరిచి పెద్ద డబ్బాలు, బిందెలలో వేసి రోకలితో దంచుతారు. మామిడి రసాన్ని చాటలు, ప్లేట్లు, చాపలపై పలుచగా ఆరబెడతారు. వీటిలో ఎటువంటి రసాయనాలు కలపకుండానే పొరలు, పొరలుగా వేస్తారు. వారం, పది రోజుల పాటు ఆరబెట్టి.. తర్వాత తాండ్రగా ప్యాక్ చేస్తారు.
తాండ్ర తయారీకి కొండ మామిడి పండ్లను సేకరిస్తున్న చిన్నారులు
తొక్కతో పచ్చడి
మామిడి పండ్ల నుంచి వచ్చిన రసాన్ని తాండ్రగా తయారు చేస్తుండగా.. మిగిలిన మామిడి తొక్కలు, టెంకలను వేరు చేస్తారు. తొక్కలను కొందరు కారంతో, మరికొందరు బెల్లంతో కలిసి ఎండ బెడతారు. బాగా ఎండిన తర్వాత వీటిని డబ్బాల్లో నిల్వ చేసుకుంటారు. ఏడాది పొడవునా గంజి అన్నంతో పచ్చడి మాదిరిగా వినియోగిస్తారు. కొన్ని గ్రామాల్లో మామిడి టెంకలను ఎండబెట్టి పిండిగా చేస్తారు. దీన్ని ఉడగబెట్టి అంబలిగా చేసుకుని ఆరగిస్తారు. మామిడి టెంకలతో కూరను కూడా తయారు చేస్తారు. ఈ కూరను లొట్టలేసుకుని మరీ తింటారు.
వారపు సంతల్లో విక్రయాలు
మన్యంలో గిరిజనులు తయారు చేసే తాండ్రకు మంచి డిమాండ్ ఉంది. మైదాన ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి కిలో రూ.100 నుంచి రూ.120 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఎటువంటి రసాయనాలు కలపకుండా తయారు చేయడంతో ఇక్కడ తయారైన తాండ్రపై వ్యాపారులు మక్కువ చూపిస్తున్నారు. తాండ్రను ముక్కలుగా చేసి.. ముక్క రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు.
వారపు సంతల్లో విక్రయాలు
మన్యంలో గిరిజనులు తయారు చేసే తాండ్రకు మంచి డిమాండ్ ఉంది. మైదాన ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి కిలో రూ.100 నుంచి రూ.120 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఎటువంటి రసాయనాలు కలపకుండా తయారు చేయడంతో ఇక్కడ తయారైన తాండ్రపై వ్యాపారులు మక్కువ చూపిస్తున్నారు. తాండ్రను ముక్కలుగా చేసి.. ముక్క రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు.
డిమాండ్ తగ్గట్టుగా ఉత్పత్తి
ఏటా మామిడితో ఆదాయం సంపాదిస్తున్నాం. మొదట్లో మామిడి తాండ్రను ఇంట్లో వాడకం కోసం మాత్రమే తయారు చేసుకునేవాళ్లం. వారపు సంతల్లో తాండ్రకు డిమాండ్ పెరగడంతో ఉత్పత్తి పెంచాం. కొంత మంది వ్యాపారులు ఇంటికి వచ్చి మరీ తాండ్రను కొనుగోలు చేస్తున్నారు. సహజసిద్ధంగా తయారుచేయడం వల్ల రుచిగా ఉంటుంది. ఈ సీజన్‌లో ఆదాయం బాగుంటుంది.
–రాధమ్మ, సుజనకోట, ముంచంగిపుట్టు మండలం
Comments
Please login to add a commentAdd a comment