మామిడి తాండ్ర ఉత్పత్తిపై అధ్యయనం
మామిడి తాండ్ర ఉత్పత్తిపై అధ్యయనం
Published Wed, Oct 5 2016 11:14 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
∙కోస్తాలో మండపీతల పెంపకంపై ప్రత్యేక దృష్టి
∙కలెక్టర్ అరుణ్‌కుమార్
జిల్లా కలెక్టరేట్ (కాకినాడ రూరల్) : జిల్లాలోని నాలుగు ప్రధాన కేంద్రాలుగా 14 గ్రామాల్లో ఏటా 4,200 టన్నుల మేర మామిడితాండ్ర ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలు పెంపొందించడంపై సమగ్ర అధ్యయనం చేయనున్నట్టు కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. కాకినాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉద్యాన, మత్స్యశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం ద్వారా ఉత్పత్తి అవుతున్న మామిడి తాండ్ర తయారీలో సాంకేతిక పరమైన అంశాలను జత చేస్తే వీరికి మరింత మార్కెటింగ్ సౌకర్యాలు లభిస్తాయన్నారు. తొండంగి, పండూరు, కోరుకొండ, ఆత్రేయపురం వంటి ప్రాంతాల్లో కుటీర పరిశ్రమగా ఉన్న మామిడితాండ్ర తయారీదారులకు అవసరమైన మెళకువలు నేర్పించడం ద్వారా, సోలార్ డ్రైయర్ల వినియోగించే ప్రక్రియ ద్వారా ఉత్పత్తి సామర్థ్యం పెంచవచ్చన్నారు. మామిడితాండ్ర ఉత్పత్తిపై అధ్యాయనం చేయడానికి ఒక ఏజెన్సీని గుర్తించాలని డీఆర్‌డీఏ ప్రాజెక్టు అధికారిని, ఉద్యానవనశాఖ అధికారులను కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశించారు. ఈ అధ్యాయనానికి అవసరమైన కన్సల్టెన్సీకి జిల్లాకు వినూత్న కార్యక్రమాల అమలు కోసం విడుదలైన నిధుల నుంచి ఫీజు చెల్లిస్తామన్నారు.
మండ పీతల పెంపకం
జిల్లాలో పల్లం, చిరయానం ప్రాంతాల్లో మండపీతలను పెంచే రైతులను ప్రోత్సహించడానికి చర్యలు చేపట్టాలని మత్స్యశాఖ అధికారులకు కల్టెకర్ అరుణ్‌కుమార్ సూచించారు. మండపీతల పెంపకానికి మంచి డిమాండ్ ఉందన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న 300 చెరువులకు మండపీతల సీడ్ అవసరమని ఈ ఉత్పత్తి కేంద్రం త్వరలో బాపట్లలో ఏర్పాటు చేసే అవకాశం ఉందని మత్స్యశాఖ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అదే విధంగా తాళ్లరేవు మండలం పోలేకుర్రులో ఉన్న 176 రొయ్యల చెరువుల పనితీరును కూడా పరిశీలించి మత్స్యకారులను ప్రోత్సహించాలన్నారు.
కూరగాయల గ్రేడింగ్ సెంటర్లు
జిల్లాలోని లంక గ్రామాలైన కేదారలంక, థానేలంక, ఊబలంక వంటి ప్రాంతాల్లో రైతులను గ్రూపులుగా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లుగా ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో కూరగాయల గ్రేడింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అరుణ్‌కుమార్ అధికారులకు సూచించారు. కూరగాయల గ్రేడింగ్ కేంద్రం ఏర్పాటుకు పెదపట్నంలో స్థలాన్ని కేటాయించాలని అమలాపురం ఆర్డీవోకు ఫోన్‌లో సూచించారు. మడికి వద్ద జాతీయ రహదారిపై ఉన్న కూరగాయల మార్కెట్ సమీపంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున ఈ మార్కెట్‌ను వేరొక ప్రాంతానికి మార్చాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మైక్రో ఇరిగేషన్ పనులను సమీక్షించారు. ఈ ఏడాది 3 వేల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ పనులు చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. మత్స్యశాఖ డీడీ ఎస్.అంజలి, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారి ఎం.సుబ్బారావు, మత్స్యశాఖ ఏడీలు కె.కనకరాజు, శ్రీనివాసరావు, రామతీర్థం, ఉద్యానవనశాఖ ఏడీలు కె.గోపీకుమార్, సిహెచ్.శ్రీనివాసులు, కె.చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement