మన్యంలో.. కొత్త గ్రామం
♦ అవాక్కైన ఎంపీడీఓ విజయ
♦ ఆ గ్రామంలో రోగాలతో అల్లాడుతున్న గిరిజనం
రాజవొమ్మంగి (రంపచోడవరం) : రోగాలు రొస్టులతో అల్లాడుతూ ఎటువంటి అభివృద్ధికీ నోచుకోని ఓ గ్రామం గురువారం రాజవొమ్మంగి మండలంలో వెలుగులోకి వచ్చింది. జ్వరాలతో బాధ పడుతోన్న ముగ్గురు పిల్లలను చంకనెత్తుకొని లాగరాయి పీహెచ్‌సీకు ఓ ఆదివాసీ వచ్చాడు. అతడు చూపిన దారి వెంబడి ఎంపీడీఓ కేఆర్ విజయ ఆ గ్రామానికి వెళ్లారు. తాగునీరు, రోడ్డు లేని చాపరాయి వంటి కొత్తపాలెం.. అనే ఓ గ్రామాన్ని అక్కడ చూసి అవాక్కయ్యారు. అనంతరగిరి నుంచి లోతట్టుకు కాలినడకన వెళ్లిన ఎంపీడీఓ.. లాగరాయి పీహెచ్‌సీ వైద్యాధికారి సూసాన్, సిబ్బంది సహాయంతో వైద్యశిబిరం ఏర్పాటు చేసి మలేరియా తదితర రోగాలతో బాధ పడుతోన్నవారికి చికిత్స అందేలా చర్యలు తీసుకొన్నారు. ఎంపీడీఓ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. 15 మంది పిల్లలతో, సుమారు 35 మంది పెద్దవారితో ఉన్న కొత్తపాలెం అనే గ్రామంలో కోదుజాతి ఆదివాసీలు కొండపోడు చేస్తూ నివసిస్తున్నారు.
ఈ గ్రామం ఉందని ఇంతవరకు అధికారిక లెక్కల్లో లేదు. తాగునీటికి ఓ నేలబావిపై ఆధారపడి జీవిస్తుండడంతో గిరిజనులు రోగాల బారిన పడ్డారని ఎంపీడీఓ చెప్పారు. ఈ గ్రామం ఇటు లబ్బర్తి పంచాయతీకు మరో వైపు కిండ్ర పంచాయతీ సమీపంలో ఉందన్నారు. పిల్లల పౌష్టికాహారం కోసం అనంతరగిరిలోని అంగన్‌వాడీ సెంటర్‌కు నెలకు ఒకసారే వస్తున్నారని వివరించారు. ఇక్కడ నివశించే గిరిజనులు మొక్కజొన్న, గంటెలు, సామలు వంటి సంప్రదాయ పంటలు పండిస్తూ జీవిస్తున్నారని, మరుగున పడిన ఈ గ్రామం వివరాలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళతానని ఎంపీడీఓ స్థానిక విలేకరులకు తెలిపారు.
మరో చాపరాయి కాకుండా చూడాలి
ఇటువంటి గ్రామాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలి. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆదివాసీలకు చేయూత ఇవ్వాలి. ప్రస్తుతం వారికి తాగునీరు, రహదారి, వైద్యం, పౌష్టికాహారం అందజేసి కొత్తపాలెం మరో చాపరాయి కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.
– అనంత ఉదయ భాస్కర్ వైఎస్సార్ సీపీయువజన విభాగం జిల్లా అధ్యక్షులు