
మన్యంపై మంచు దుప్పటి
విశాఖ ఏజెన్సీ వాసులు చలి గుప్పిట చిక్కి వణికిపోతున్నారు. ఇక్కడ పలు ప్రాంతాల్లో అత్యంత కనిష్ట ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి.
సాక్షి నెట్‌వర్క్: విశాఖ ఏజెన్సీ వాసులు చలి గుప్పిట చిక్కి వణికిపోతున్నారు. ఇక్కడ పలు ప్రాంతాల్లో అత్యంత కనిష్ట ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు రంగారెడ్డి జిల్లా తాండూరులోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విశాఖ మన్యంలో ఎన్నడూలేని విధంగా డిసెంబర్ రెండో వారం నుంచే చలి తీవ్రత అధికమవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసరమైతే తప్ప ఇంటికే పరిమితమవుతున్నారు. ఆదివారం పాడేరుఘాట్‌లోని మోదమాంబ పాదాలు వద్ద 1 డిగ్రీ, లంబసింగిలో 2 డిగ్రీలు, మినుములూరు కేంద్ర కాఫీ బోర్డు వద్ద 4 డిగ్రీలు, చింతపల్లిలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దీంతో కాఫీతోటల్లో పనులకెళ్లే కార్మికులు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. గతేడాది జనవరిలో ఈ ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవగా.. ఈ సారి డిసెంబర్‌లోనే ఆ పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం అయితే కానీ, సూర్యుడి వెలుగులు కనిపించడం లేదు. మొత్తానికి మన్యంపై మంచు దుప్పటి పరచుకుంది. చీకటి పడితే బయటకు రాలేని పరిస్థితి ఇక్కడ ఉంది. ఏజెన్సీకి వస్తున్న పర్యాటకులు కూడా చలికి తట్టుకోలేక మైదాన ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోతున్నారు. కాగా, రంగారెడ్డి జిల్లా తాండూరులో కూడా చలి వణికిస్తోంది. ఈనెల 9న 5.5 డిగ్రీలు, 10న 6.7, 11న 5.6, డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవగా.. ఆదివారం ఇది 8.5 డిగ్రీలుగా ఉంది. ఉదయం 10 గంటలైనా మంచు కురుస్తుండడంతో ఈ ప్రాంత వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.