రక్తపాతం జరగని ఉద్యమాల్లేవు. కానీ రక్తపాతం జరక్కుండా ఉద్యమాన్ని నడిపించాలని ప్రయత్నించిన ఉద్యమ నాయకులున్నారు. అలాంటి ధీరులలో జాతీయ కథానాయకుడు గాంధీజీ అయితే, మన ఊరి విప్లవ నాయకుడు అల్లూరి! మన్యంలో కొండదళానికి, తెల్లదండుకి మధ్య అరవై రెండు సార్లు కాల్పులు జరిగినా, అనవసరమైన రక్తపాతం జరక్కుండా సీతారామరాజు అనేకసార్లు నిరోధించగలిగాడు. అంతటి సంయమనం ఇప్పటి మన అవసరం. ఎప్పటికీ మన ఆదర్శం. హింస కోసం హింస అనే పోకడకు ఉద్యమాన్ని దూరంగా ఉంచి, శత్రువుపై విప్లవాగ్నులు కురిపించిన మన్యం మహాత్ముడు, మహోద్యమ అగ్నికణం అల్లూరి. నేడు ఆయన జయంతి. 1897 జూలై 4న విజయనగరం దగ్గరి పాండ్రంగిలో వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించారు అల్లూరి సీతారామరాజు.
అలసి.. సొలసి
స్వామి వివేకానంద 1902 జూలై 4న యథావిధిగా రోజూవారీ కార్యక్రమాలు నిర్వర్తించుకున్నారు. శిష్యులకు బోధనలు చేశారు. భోంచేసిన తరువాత కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నారు. కొద్దిసేపటి తరువాత ఆయనకు చిన్న వణుకు లాంటిదేదో కలిగింది. అయినప్పటికీ తనను చూడడానికి వచ్చిన వారితోనూ, శిష్యులతోనూ చాలా ఉల్లాసంగా నవ్విస్తూ గడిపారు. రాత్రి 9 గంటల సమయంలో అలసిపోయినట్లుగా కనిపించారు. చేతులలో సన్నగా వణుకు ప్రారంభమైంది. చిన్నగా అరిచి లేచి కూర్చున్నాడు. దీర్ఘంగా శ్వాస పీల్చి నెమ్మదిగా శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. ఆయన శిష్యులు తల్లితండ్రులను కోల్పోయిన అనాథల్లా దుఃఖించారు. జీవించినది 39 ఏళ్లే అయినా భారతీయ ఆధ్మాత్మిక చరిత్రలో ఆయన ఒక భాగంగా నిలిచిపోయారు. 1984 నుంచి భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని ‘జాతీయ యువజన దినోత్సవం‘ గా పాటిస్తోంది.
చివరి కోరిక
‘మన జాతీయ పతాకం’ పేరుతో యంగ్ ఇండియా పత్రికలో గాంధీజీ రాసిన మాటలు ప్రత్యేకమైనవి. ‘‘జాతీయ పతాకాన్ని ఖరారు చేయడానికి కాంగ్రెస్ సభలలో ఆయన పడిన శ్రమ, తపనలకు నేను అభినందిస్తున్నాను. నేను విజయవాడ వెళ్లినప్పుడు ఆకుపచ్చ, ఎరుపు – ఆ రెండు రంగులతో పతాకాన్ని రూపొందించవలసిందని వెంకయ్యగారికి సూచించాను. పతాకం మధ్యలో ధర్మచక్రం ఉండాలని కూడా సూచించాను. తరువాత మూడు గంటలలోనే వెంకయ్యగారు పతాకం తెచ్చి ఇచ్చారు’’ అని గాంధీజీ తన పత్రికలో రాశారు. జాతీయ పతాక నిర్మాతగా ఆ గుర్తింపును పింగళి వెంకయ్య కోరుకోలేదు కానీ, తన విల్లులో చివరి కోరిక ఒకటి వెలిబుచ్చారు. తన పార్థివదేహం మీద (1963 జూలై 4 న బెజవాడలో ఒక తాటాకు ఇంట్లో కన్నుమూశారు) జాతీయ పతాకాన్ని కప్పాలని కోరుకున్నారు. ఆయన కోరికను భరతజాతి నెరవేర్చింది.
Comments
Please login to add a commentAdd a comment