భారత స్వాతంత్య్ర సమరం, స్వాతంత్య్రం వచ్చిన సందర్భం, రెండో ప్రపంచ యుద్ధానంతర పరిణామాలు, ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం, ప్రపంచ పరిస్థితులు కలసి భారత ప్రధానమంత్రి పదవికి రూపురేఖలను ఇచ్చాయి. దేశంలో బ్రిటిష్ వలస వాసనలు, మారిన రాజకీయ తాత్త్వికతలను అవగతం చేసుకుంటూ, అవి తెచ్చిన సమస్యలను అధిగమిస్తూ దేశాన్ని పునర్నిర్మాణం చేసే గురుతర బాధ్యతను మన ప్రధానులు నిర్వహించారు. 1947 నుంచి 2022 వరకు భారతీయులు 14 మంది ప్రధానుల పాలనను వీక్షించారు. ఒక్కొక్క ప్రత్యేకతతో ఒక్కొక్క ప్రధాని చరిత్ర ప్రసిద్ధులయ్యారు.
1947–1977
ప్రథమ ప్రధాని జవాహర్‌లాల్ నెహ్రూ. 16 ఏళ్ల 286 రోజుల నెహ్రూ పాలనా కాలమే ఇప్పటికి వరకు రికార్డు. తరువాత ఆయన కుమార్తె ఇందిరాగాంధీ హయాం 11, 4 సంవత్సరాలతో రెండో స్థానంలో నిలిచారు. రెండు పర్యాయాలు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ మూడో స్థానంలో నిలుస్తారు. లాల్ బహదూర్‌శాస్త్రి (19 నెలలు), గుల్జారీలాల్ నందా (రెండు పర్యాయాలు ఆపద్ధర్మ ప్రధాని, 27 రోజులు), రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావు (ఐదేసి సంవత్సరాలు) ప్రధాని పదవిలో ఉన్నారు. మొత్తంగా 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ ప్రధానులే దాదాపు 56 ఏళ్లు ఆ పదవిలో ఉన్నారు.
భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలన్న నిర్ణయం తరువాత ఏర్పడిన జాతీయ ప్రభుత్వానికి (1946) నాయకత్వం వహించినవారు నెహ్రూయే. ఆపై 1947 ఆగస్ట్ 15 నుంచి స్వతంత్ర భారత తొలి ప్రధాని. దేశ విభజన నాటి నెత్తుటి మరకలు ఆరకుండానే 1947 అక్టోబర్‌లో పాకిస్తాన్ తో యుద్ధం చేయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన, అలీన విధానం, పంచవర్ష ప్రణాళికలు, ఐఐటీలు, భారీ నీటిపారుదల పథకాలు, భారీ పరిశ్రమలు ఆయన హయాం ప్రత్యేకతలు. 1962లో ఆయన పాలనలోనే చైనాతో యుద్ధం జరిగింది.
అది చేదు ఫలితాలను మిగిల్చింది. 1964 లో నెహ్రూ మరణంతో లాల్ బహదూర్‌శాస్త్రి ప్రధాని అయ్యారు. 1965లో పాకిస్తాన్ తో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఓడిన పాకిస్తాన్ తో శాంతి ఒప్పందం మీద సంతకాలు చేయడానికి తాష్కెంట్ (సోవియెట్ రష్యా) వెళ్లిన శాస్త్రి అక్కడే అనుమానాస్పద పరిస్థితులలో మరణించారు. జైజవాన్ జై కిసాన్ ఆయన నినాదమే. తరువాత 1966లో ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. ఇందిర పాలన అంటే కొన్ని వెలుగులు, ఎక్కువ చీకట్ల సమ్మేళనం. ఆమె బ్యాంకులను జాతీయం చేశారు.
రాజభరణాలు రద్దు చేశారు. 1969 నాటి రాష్ట్రపతి ఎన్నికలో ఆమె నిర్వహించిన విధ్వంసక భూమికతో కాంగ్రెస్ చీలిపోయింది. పార్టీ నిర్ణయించిన నీలం సంజీవరెడ్డిన ఓడించి, తాను నిలబెట్టిన వీవీ గిరిని ‘ఆత్మ ప్రబోధం’ నినాదంతో గెలిపించిన అపకీర్తి ఆమెది. 1971లో ఇందిర కూడా పాకిస్తాన్ తో యుద్ధం చేశారు. ఆ యుద్ధ ఫలశ్రుతి భారత్ గెలుపు, బంగ్లాదేశ్ ఆవిర్భావం. ఇందిర హయాంకు మకుటాయమానమైనది 1974 నాటి పోఖ్రాన్ అణపరీక్ష (స్మైలింగ్ బుద్ధ). దీనితో భారత్ ప్రపంచంలోనే అణుపాటవం ఉన్న ఆరోదేశంగా ఆవిర్భవించింది. 1975లో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ఇందిర చరిత్రలో తన స్థానాన్ని తానే చిన్నబుచ్చుకున్నారు.
అలా కాంగ్రెస్‌కు ఒక ప్రత్యామ్నాయాన్ని సృష్టించి పెట్టిన ఘనత కూడా ఆమెదే. అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తరువాత 1977లో జనతా పార్టీ ఏర్పడింది. అందులో భారతీయ జనసంఘ్ భాగస్వామి అయింది. ద్వంద్వ సభ్యత్వం కారణంగా జనతా పార్టీని వీడిన జనసంఘ్ సభ్యులు 1980లో భారతీయ జనతా పార్టీని స్థాపించారు. భారత రాజకీయాలలో జాతీయ స్థాయి పార్టీగా కాంగ్రెస్‌కు ఉన్న స్థానాన్ని కూలదోసిన పార్టీగా బీజేపీ ఎదగడం చరిత్ర. జనతా పార్టీ, ప్రభుత్వం కుప్ప కూలిపోవడంతో 1980లో మధ్యంతర ఎన్నికలు జరిగి ఇందిర మళ్లీ ప్రధాని అయ్యారు.
ఇది కూడా చరిత్రలో ఒక అనూహ్య ఘట్టమే. అత్యవసర పరిస్థితి తరువాత ఘోరంగా ఓడిపోయిన పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. రెండో దశ ఏలుబడిలో ఆమె చేసిన సాహసోపేత నిర్ణయం అమృత్‌సర్ స్వర్ణాలయం మీద ఆపరేషన్ బ్లూ స్టార్, పేరిట సైనిక చర్య. కానీ అది సాహసం కాదు, దుస్సాహసమేనని చరిత్ర రుజువు చేసింది. ఆ చర్య నుంచి వచ్చిన ప్రతీకార జ్వాలకే ఆమె 1984లో ఆహుతయ్యారు. అంగరక్షకులే కాల్చి చంపారు. ఇందిర భారత తొలి మహిళా ప్రధానిగానే కాదు, హత్యకు గురైన తొలి ప్రధానిగా కూడా చరిత్రకు ఎక్కారు.
1977–1980
ఈ కొద్దికాలంలోనే భారతదేశం ఇద్దరు ప్రధానులను చూసింది. ఒకరు మొరార్జీ దేశాయ్, మరొకరు చౌధురి చరణ్‌సింగ్. నెహ్రూతో, ఇందిరతో ప్రధాని పదవికి పోటీ పడిన మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ గెలిచిన తరువాత ప్రధాని పదవిని చేపట్టారు. స్వాతంత్య్ర సమరస్ఫూర్తి, గాంధేయవాదం మూర్తీభవించిన ప్రధాని ఆయన.
వరసగా పది కేంద్ర బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన ఘనత ఉన్న మొరార్జీ ప్రధానిగా రెండు సంవత్సరాల నాలుగు నెలలు మాత్రమే పదవిలో ఉన్నారు. జనతా పార్టీ పతనమే ఇందుకు కారణం. ద్వంద్వ సభ్యత్వం, రాజ్ నారాయణ్ రగడ, మాజీ జనసంఘీయుల నిష్క్రమణ వంటి కారణాలు ఆయన రాజీనామాకు దారి తీశాయి. తరువాత చౌదరి చరణ్‌సింగ్ ప్రధాని అయ్యారు. ప్రధానిగా పార్లమెంట్‌కు వెళ్లకుండా రాజీనామా చేసిన ప్రధానిగా మిగిలారు. భారత్‌కు సంకీర్ణ ప్రభుత్వాలు తప్పవన్న సంకేతం ఈ కాలం ఇచ్చింది.
1984–1996
ఇందిర హత్య తరువాత ఆమె పెద్ద కుమారుడు రాజీవ్‌గాంధీ ప్రధాని అయ్యారు. తల్లి హత్యతో ప్రధాని పదవిని అధిష్టించిన రాజీవ్, మాజీ ప్రధానిగా తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో హత్యకు గురయ్యారు. షాబోనో కేసు, హిందువుల కోసం అయోధ్య తలుపులు తెరవడం, భోపాల్ విషవాయువు విషాదం, బోఫోర్స్ తుపాకుల అవినీతి వ్యవహారం ఆయన హయాంలోనే జరిగాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ బలోపేతానికి ఆయన కృషి ఆరంభించారు.
రాజీవ్ మంత్రివర్గంలోనే ఆర్థిక, రక్షణ శాఖలను నిర్వహించిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ బోఫోర్స్ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసి, జనతాదళ్ కూటమి బలంతో ప్రధాని పదవిని చేపట్టారు. ఉపప్రధాని దేవీలాల్‌తో వీపీ సింగ్‌కు విభేదాలు తీవ్రమైనాయి. అలాంటి సందర్భంలో సింగ్ మండల్ కమిషన్ నివేదికను బయటకు తీశారని చెబుతారు. ఎల్‌కె అడ్వాణిని అయోధ్య రథం మీద నుంచి దించడంతో వీపీ సింగ్‌ను ప్రధాని పదవి నుంచి బీజేపీ దించివేసింది.
సింగ్ తరువాత చంద్రశేఖర్ కాంగ్రెస్ ‘బయటి నుంచి మద్దతు’తో ప్రధాని అయ్యారు. చంద్రశేఖర్ సమాజ్‌వాదీ జనతా పార్టీ మైనారిటీ ప్రభుత్వం బడ్జెట్‌ను కూడా ఆమోదింప చేయలేకపోయింది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి ఈ ప్రభుత్వం బంగారాన్ని కుదువ పెట్టవలసి వచ్చింది. చంద్రశేఖర్ తరువాత తెలుగువారు పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు. ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని ఒక తీవ్ర సంక్షోభం నుంచి బయటపడవేసిన వారు పీవీ. కానీ అయోధ్య వివాస్పద కట్టడం ఆయన హయాంలోనే కూలింది. మైనారిటీ ప్రభుత్వమే అయినా ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన ఘనత పీవీ ప్రభుత్వానికి ఉంది.
1996–2004
ఒక రాజకీయ సంక్షుభిత దేశంగానే భారత్ కొత్త మిలీనియంలోకి అడుగు పెట్టింది. కాంగ్రెస్ ప్రభను కోల్పోతుండగా, బీజేపీ బలపడుతున్న కాలమది. అలాగే హంగ్ యుగం కూడా. ఏ పార్టీకి మెజారిటీ రాని పరిస్థితి చిరకాలం కొనసాగింది. 1996లో జరిగిన ఎన్నికలలో అతి పెద్ద మెజారిటీ సాధించిన పార్టీగా బీజేపీ అవతరించింది. కానీ హంగ్ లోక్‌సభ ఏర్పడింది. వాజపేయి తొలిసారి 1996 మే 16 న ప్రధానిగా ప్రమాణం చేశారు. 1996 జూన్ 1 న రాజీనామా చేశారు. తరువాత హెచ్‌డి దేవెగౌడ ప్రధాని అయ్యారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడింది.
సీతారాం కేసరి నాయకత్వంలోని కాంగ్రెస్ యథాప్రకారం బయట నుంచి మద్దతు ఇచ్చింది. కానీ 11 మాసాలకే ఆయన ప్రభుత్వం పడిపోయింది. దేవెగౌడ వారసునిగా ఇందర్‌కుమార్ గుజ్రాల్ పదవీ స్వీకారం చేశారు. విదేశ వ్యవహారాలలో దిట్ట అయిన గుజ్రాల్ కూడా 11 మాసాలు మాత్రమే అధికారంలో ఉన్నారు. ఇరుగు పొరుగు దేశాలతో భారత్ సంబంధాల గురించి గుజ్రాల్ సిద్ధాంతం పేరుతో ఒక విధానం ప్రసిద్ధమైంది.
1998లో మళ్లీ మధ్యంతర ఎన్నికలను దేశం ఎదుర్కొనవలసి వచ్చింది.
ఈసారి చాలా పార్టీలు బీజేపీ వెనుక నిలిచాయి. నేషనల్ డెమాక్రటిక్ అలయెన్స్ కూటమి ఏర్పడి, వాజపేయి ప్రధాని అయ్యారు. కూటమిలో భాగస్వామి అన్నా డీఎంకే మద్దతు ఉపసంహరించుకొనడంతో ఒక్క ఓటుతో ప్రభుత్వం కూలిపోయింది. 1999లో మళ్లీ ఉప ఎన్నికలు జరిగి ఎన్ డీఏ విజయం సాధించింది. వాజపేయి ప్రధానిగా ప్రమాణం చేశారు. కొద్ది నెలలు మినహా పూర్తి సమయం అధికారంలో కొనసాగారు. తన పదమూడు మాసాల పాలనలోనే వాజపేయి పోఖ్రాన్ 2 అణుపరీక్ష జరిపించారు. మూడోసారి ప్రధాని అయినప్పుడు పాకిస్తాన్ తో కార్గిల్ సంఘర్షణ జరిగింది. లాహోర్ బస్సు దౌత్యం వంటి ప్రయత్నాలు కూడా జరిగాయి.
2004–2022
2004లో జరిగిన ఎన్నికలలో మళ్లీ కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థికమంత్రి, ఆర్థిక సంస్కరణల శిల్పి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. 2009 ఎన్నికలలో కూడా మళ్లీ యూపీఏ గెలిచి ఆయనే ప్రధాని అయ్యారు. యూపీఏ మొదటి దశ సజావుగానే సాగినా, రెండో దశ అవినీతి ఆరోపణలను మూటగట్టుకుంది.
2014 ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. 2019లో జరిగిన ఎన్నికలలో మరొకసారి మోదీకే భారతీయులు పట్టం కట్టారు. ముప్పయ్ ఏళ్ల తరువాత తిరుగులేని మెజారిటీ సాధించిన పార్టీగా 302 సీట్లు బీజేపీ సాధించింది. కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. గిరిజన మహిళ ద్రౌపది ముర్మును భారత రాష్ట్రపతిగా ఎంపిక చేసిన ఘనతను కూడా బీజేపీ దక్కించుకుంది.
– డా. గోపరాజు నారాయణరావుఎడిటర్, ‘జాగృతి’
(చదవండి: మహాత్మా మన్నించు..)
Comments
Please login to add a commentAdd a comment