నెహ్రూ స్వతంత్ర భారత తొలి ప్రధాని. రాజేంద్ర ప్రసాద్ తొలి రాష్ట్రపతి. ఇద్దరు పని చేస్తున్నది ఒకే లక్ష్యంతోనే అయినా ఇద్దరి భావాలు, సిద్దాంతాలు వేరుగా ఉండేవి. నెహ్రూ ఆధునికం అయితే రాజేంద్ర ప్రసాద్ సంప్రదాయం. అయితే ఈ మాటల్ని మనం ఉన్నవి ఉన్నట్లుగా కాకుండా వారిలోని వైరుధ్యానికి ఓ తేలికపాటి పోలికగా మాత్రమే తీసుకోవాలి.
అర్ధరాత్రి కొట్టగానే కదా దేశానికి స్వాతంత్య్రం వచ్చింది.. 1947 ఆగస్టు 15న! భారత్ సంకెళ్లు తెగిపోయాయి.
ఇప్పుడిక భారత్ తనేమిటో ప్రపంచ దేశాలకు చూపించుకోవాలి. స్వాతంత్య్రం సంపాదించుకుని, స్వాతంత్య్రంతో ఏమీ చేయకపోతే ఎలా! వలస పాలకులు భారత ప్రజా గర్జనకు పక్షుల్లా ఎగిరిపోయాక, భారత్ స్వేచ్ఛా విహంగమై నెహ్రూ, రాజేంద్రల భుజాలపై వాలింది. దేశ భవిష్యత్తును ఇక నిర్మించవలసింది, నిర్ణయించవలసిందీ ప్రధానంగా వాళ్లిద్దరే. ధ్వనించని మెత్తటి చిరు నవ్వులా ఉండేవారు డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్. గాంధీజీ ఆదర్శాల నుంచి తెచ్చుకున్న గుణం అది. నెహ్రూకు తోడ్పాటుగా ఉండేందుకు ఆ స్వభావం ఆయనకెంతో తోడ్పడింది. నెహ్రూతో విభేదించేవారు. అయితే ఆ విభేదం.. ఐక్యతతోనే! ఇది సాధ్యమేనా? సాధ్యం చేసుకున్నారు కనుకనే నెహ్రూ, రాజేంద్ర గొప్ప నాయకులుగా, పాలనకు నమ్మకమైన స్తంభాలుగా నిలబడ్డారు.
అభిప్రాయ భేదాలు
సాధారణంగా ప్రధాని చెప్పినదానికి రాష్ట్రపతి కాదనేదేమీ ఉండదు. రాష్ట్రపతి కాదనరు కదా అని ఆయన అభిప్రాయం తీసుకోకుండా ప్రధానీ ఏమీ చెయ్యరు. నెహ్రూ, రాజేంద్ర కూడా సఖ్యతగానే ఉన్నారు. అయితే స్వీయ విశ్వాసాలు, సిద్ధాంతాల దగ్గరికి వచ్చేటప్పటికి వారికి అభిప్రాయ భేదాలు వచ్చేవి. దేశం అభివృద్ధి చెందడానికి శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాలు అవసరం అని నెహ్రూ బలంగా నమ్మేవారు. ప్రార్థనా స్థలాలకంటే పరిశ్రమలు, పాఠశాలలు ముఖ్యం అనేవారు.
రాజేంద్ర ప్రసాద్ అందుకు భిన్నమైన నమ్మకాలను కలిగి ఉండేవారు. దేశ పురోభివృద్ధికి పరిశ్రమలు, శాస్త్ర పరిజ్ఞానాలు అవసరమే అయినా.. సంస్కృతీ సంప్రదాయాలను, మత విశ్వాసాలను విస్మరించడానికి లేదని రాజేంద్ర ప్రసాద్ భావించేవారు. ఈ రెండు దారులు వేటికవి సాగుతున్నంత వరకు వాళ్లిద్దరి మధ్య ఘర్షణ తలెత్తలేదు. ఓ సందర్భంలో మాత్రం ఆ రెండు దారులు ఒకదాన్ని ఒకటి దాటవలసి వచ్చింది! ఆ సందర్భం.. సోమనాథ ఆలయ ప్రారంభోత్సవం!
ఆలయ పునరుద్ధరణ
గుజరాత్‌లోని సోమనాథ ఆలయం క్రీ.శ. 1వ శతాబ్దం నాటిది. కాలక్రమంలో ఆలయం శిథిలమైపోగా, ఆ శిథిలాలపైనే క్రీ.శ.649 లో రెండో ఆలయాన్ని నిర్మించారు. క్రీ.శ.722లో అరబ్బులు సింధు ప్రాంతంలో బలపడ్డాక జరిగిన దాడులలో ఆలయం ధ్వంసమయింది. చాళుక్యులు వచ్చాక ఆలయ పునరుద్ధరణ జరిగింది. 1026లో మహమ్మద్ ఘజనీ దండయాత్రలో సోమనాథ ఆలయం మళ్లీ దెబ్బతినింది. 1114లో హిందూ రాజులు ఆలయాన్ని పునరుద్ధరించారు.
తర్వాత 1299లో అల్లా ఉద్దీన్ ఖిల్జీ ఆలయంపై పడి శివలింగాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. 1331లో జునాఘడ్ రాకుమారుడు తిరిగి అక్కడ లింగ ప్రతిష్ఠ చేశాడు. 1459లో మహమ్మద్ బేగ్దా ఆ శివలింగాన్ని తొలగించి, ఆలయాన్ని మసీదుగా మార్చేశాడు. 1783లో ఇండోర్ మహారాణి అహల్యాబాయి మసీదు స్థానంలో తిరిగి సోమనాథ ఆలయాన్ని పునర్నిర్మించారు. శత్రువుల బారిన పడకుండా లింగప్రతిష్ఠను భూగర్భంలో జరిపించారు. కాలగమనంలో ఆలయం శిథిలమవుతూ వచ్చింది.
నెహ్రూ వెళ్లొద్దన్నారు!
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1951లో ఈ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాల ప్రారంభోత్స వానికి అధ్యక్షత వహించవలసిందిగా అందిన ఆహ్వానాన్ని రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్వీకరించారు. అది తెలిసి నెహ్రూ పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. భారత సమాజంలో ప్రార్థనా స్థలాల ప్రాముఖ్యంపై నెహ్రూ–రాజేంద్రల మధ్య భిన్నమైన వాదనలు బహిరంగంగానే వినిపిస్తూ ఉన్న సమయం అది. అలాంటి కార్యక్రమానికి రాష్ట్రపతి వెళ్లకూడదని నెహ్రూ అభిప్రాయం.
వెళ్లడమే సరైనదని రాజేంద్ర వాదన. ‘ఏమైనా ఈ సమయంలో ఇలాంటి మత పరమైన అభివృద్ధికి దేశాధినేతలను ప్రాధాన్యం ఇవ్వడం తగదు. దానికింకా ఎంతో సమయం ఉంది. సరే ఎలాగూ అధ్యక్షతకు అంగీకరించారు కనుక అలాగే కానివ్వండి’ అని నెహ్రూ ఆ తర్వాత రాజేంద్రతో అన్నట్లు ‘పిలిగ్రిమేజ్ టు ఫ్రీడమ్’ పుస్తకంలో రచయిత కె.ఎం. మున్షీ రాశారు.
(చదవండి: శతమానం భారతి: నవ భారతం)
Comments
Please login to add a commentAdd a comment