పోర్చుగీస్ దురాక్రమణదారులకు, ఉళ్లాల రాణి అబ్బక్కదేవికి మధ్య ఐదు యుద్ధాలు జరిగాయి. ఐదు యుద్ధాల్లోనూ రాణి అబ్బక్క ప్రతిఘటనను ఎదుర్కోలేక పరాజయంతో వెనక్కు మళ్లింది పోర్చుగీస్ సైన్యం. ప్రత్యక్ష యుద్ధ క్షేత్రంలో ఖడ్గం తిప్పిన అబ్బక్క.. తొట్ట తొలినాళ్ల భారత స్వాతంత్య్ర సంగ్రామ యోధురాలిగా చరిత్రలో నిలిచిపోయారు.
పోర్చుగీస్ నావికుడు వాస్కోడగామా మన దేశానికి సముద్రమార్గాన్ని కనిపెట్టిన 1498 లోనే మనకు ముప్పు మొదలైంది. ఆ తర్వాత కొన్నేళ్లకే పోర్చుగీస్ వారి అరాచకం మొదలైంది. వ్యాపారం నెపంతో వేళ్లూనుకుని పోయి తర్వాత ఆ ఓడ రేవులను స్వాధీనం చేసుకోడానికి కుయుక్తులు పన్నారు. అప్పటి నుంచి స్థానిక పాలకులకు పోర్చుగీస్ వారికి మధ్య యుద్ధాలు మొదలయ్యాయి.
అలా మొదలైన యుద్ధాల్లో తుళునాడు రాజ్యంలోని ఉళ్లాల యుద్ధం ఒకటి. మంగుళూరు నగరానికి పది కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్ర తీరాన ఉంది ఉళ్లాల రాజ్యం. ఆ తుళు రాజ్యాన్ని అప్పుడు పరిపాలిస్తున్న వారు రాణి అబ్బక్క మహాదేవి. ఐదు యుద్ధాలలో పోర్చుగీస్ వారిని తరిమికొట్టిన ధీశాలి.
రాయలవారి బంధువు
అబ్బక్క రాణి అసలు పేరు అభయరాణి. ఆ పేరుకి తగ్గట్టే ఆమె ఏ మాత్రం భయం లేకుండా ధైర్యంగా పెరిగారు. వారిది చౌత వంశం. విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయల సమీప బంధువు తిరుమల రాయలుకు అన్న కూతురు అబ్బక్క. తిరుమల రాయలు ఆమెకు యుద్ధవిద్య లన్నీ నేర్పించారు. అలా అబ్బక్క బాణాలు వేయడం, కత్తియుద్ధం, గుర్రపు స్వారీలో ఆరితేరారు. రాజ్యపాలనను చేపట్టారు.
పొరుగున ఉన్న బాన్‌ఘేర్ రాజ్యానికి రాజు లక్ష్మప్పతో అబ్బక్క వివాహం జరిగింది. కానీ వారి బంధం సయోధ్యతో కొనసాగలేకపోయింది. ఆమె పుట్టింటికి వచ్చేశారు. భర్త పెళ్లి కానుకగా ఇచ్చిన ఆభరణాలను కూడా వెనక్కి పంపించేశారు. సొంత రాజ్యాన్ని సమర్థంగా పాలించారు. రాణిగా ప్రజల్లో మంచి పేరు సంపాదించారు. అబ్బక్క జైన మతాన్ని అవలంబిం చినప్పటికీ ఆమె పాలనలో హిందూ, ముస్లింలతో పాటు ఇతర మతాల వారూ సౌకర్యంగా జీవించారు. సైన్యంలో కూడా అందరూ కలగలిసి ఉండేవారు.
పొంచివున్న పోర్చుగీస్
పోర్చుగీస్ వాళ్లు గోవాను హస్తగతం చేసుకున్న తర్వాత దక్షిణముఖంగా విస్తరించాలనుకున్నారు. దక్షిణ కర్ణాటక తీరాన ఉన్న ఉళ్లాల.. రేవు పట్టణం. వ్యాపార సమృద్ధి గల రేవు. సుగంధద్రవ్యాలను పాశ్చాత్యదేశాలకు రవాణా చేయడానికి అనువైన ప్రదేశం. ఉళ్లాల పట్టణం అబ్బక్క రాజ్యానికి వాణిజ్య రాజధాని వంటిది. ఈ రేవు మీద డచ్, బ్రిటిష్ వాళ్ల కళ్లు కూడా పడ్డాయి. పశ్చిమ తీరాన పోర్చుగీస్ వాళ్లు ముందంజలో ఉండేవాళ్లు. ఆ సామ్రాజ్య విస్తరణ కాంక్షతోనే 1525లో మంగుళూరు మీద దాడి చేసి కోటను ధ్వంసం చేశారు.
ఆ చర్యతో రాణి అబ్బక్క దేవి అప్రమత్తమయ్యారు. రాజ్యాన్ని పరిరక్షించు కోవడానికి చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. 1555లో పోర్చుగీస్‌వారు మరోసారి దాడికి సిద్ధమయ్యారు. కానీ, అబ్బక్క వ్యూహాలు వాళ్లకు అంతుపట్టకపోగా వాళ్లను అయోమయానికి గురిచేశాయి. వాళ్ల ఆధిపత్యాన్ని అంగీకరించి కప్పం కట్టాలని ఆదేశిస్తూ అడ్మిరల్ ఇవారో ద సిల్వేరా ద్వారా సందేశం పంపించారు. అందుకు ఆమె ససేమిరా అనడంతో రెండేళ్లలోనే మరోసారి యుద్ధానికి సిద్ధమైంది పోర్చుగీస్ సైన్యం. మంగుళూరు నగరాన్ని అగ్నికి ఆహుతి చేసినంత పని చేశారు, కానీ అబ్బక్క ప్రతిఘటనతో వెనుదిరగక తప్పలేదు.
1567లో నాలుగవ యుద్ధానికి కూడా సిద్ధమయ్యాయి పోర్చుగీస్ దళాలు. ఆ ప్రయత్నాన్ని కూడా తిప్పికొట్టారు అబ్బక్క. ఆ తర్వాత ఏడాదిలో జరిగిన ఐదవ యుద్ధంలో పోర్చుగీసు వాళ్లు ఉళ్లాల పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాయల్ కోర్టులోకి కూడా ప్రవేశించారు. ఆ క్షణంలో అబ్బక్క అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకుని వెళ్లి ఒక మసీదులో ఉన్నారు. అదే రోజు రాత్రి ఆమె 200 మంది సైన్యంతో పోర్చుగీసు దళాల మీద మెరుపుదాడి చేశారు. జెనరల్ పీక్సోటోను సంహరించి, 70 మంది పోర్చుగీసు సైనికులను ఖైదీలుగా బంధించారు. ఆ దాడిలో అడ్మిరల్ మాస్కారెన్‌హాస్ వంటి వాళ్లు కూడా మరణించారు. చివరికి పోర్చుగీసు సేనలు ఉళ్లాల పట్టణాన్ని, మంగుళూరు కోటను వదిలి వెనక్కి వెళ్లిపోయాయి.
ఆరవ యుద్ధం
క్రీ.శ 1569లో రాణి అబ్బక్క పాల్గొన్న యుద్ధం ఆఖరి యుద్ధం. ఈ యుద్ధంలో ఆమె భర్త కూడా ఆమెకు ప్రత్యర్థిగా మారాడు! వైవాహిక బంధం విఫలమైన కారణంగా భర్త లక్ష్మప్ప ఆమె మీద కోపం పెంచుకున్నాడు. ప్రతీకారేచ్ఛతో అవకాశం కోసం చూస్తూ ఉన్న అతడు పోర్చుగీసు వారితో అంగీకారం కుదుర్చుకుని అబ్బక్కకు వ్యతిరేకంగా పావులు కదిపాడు. ఈ దాడిలో పోర్చుగీసు వాళ్లు మంగుళూరు కోటను, కుందాపూర్‌లోని ధాన్యాగారాలను స్వాధీనం చేసుకున్నారు.
ఆ తర్వాత కూడా లక్ష్మప్ప అందిస్తున్న సమాచారంతో అబ్బక్క రాణి మీద దాడులను కొనసాగిస్తూనే వచ్చారు. అప్పటి వరకు ఏకాకిగానే ఎదుర్కొన్న ఆమె 1570లో... పోర్చుగీసు పాలకుల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్న బీజాపూర్, అహ్మద్ నగర్ సుల్తానులు, కోల్‌కతాలోని జమోరైన్ పాలకులతో కలిసి కొత్త రాజకీయ సమీకరణలతో వ్యూహరచన చేశారు.
ఆ యుద్ధంలో జమోరైన్ జనరల్, కుట్టి పోకార్ మార్కర్ వంటి వాళ్లు పోర్చుగీస్ సైన్యాలను చెదరగొట్టారు. కానీ ఆమె భర్త తలపెట్టిన ద్రోహంతో అబ్బక్క ఆ యుద్ధంలో విజయానికి దూరమయ్యారు. పోర్చుగీసు వాళ్లు ఆమెను పట్టి కారాగారంలో బంధించారు. బందీగా కూడా ఆమె పాశ్చాత్య ఆధిపత్యాన్ని స్వీకరించడానికి ఏ మాత్రం సిద్ధపడలేదు. జైల్లో తిరుగుబాటు చేసి వీరోచితంగా ప్రాణాలు వదిలారు.
– వాకా మంజులారెడ్డి
(చదవండి: శతాధిక స్ఫూర్తి... ‘శెట్టూరు గాంధీ’ అలుపెరుగని పోరు )
Comments
Please login to add a commentAdd a comment