రాజమహేంద్రవరంలో సాగిన 5,200 మీటర్ల జాతీయ పతాక ప్రదర్శన
రాజమహేంద్రవరం సిటీ/తణుకు అర్బన్/చిత్తూరు రూరల్/ విజయవాడ కల్చరల్ : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్రంలోని పలు చోట్ల అత్యంత భారీ జాతీయ జెండాలతో ప్రదర్శనలు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో 5.200 కిలోమీటర్ల పొడవున సాగిన జాతీయ పతాక ప్రదర్శన అబ్బురపరచింది. ఇంతటి భారీ పతాకంతో ప్రదర్శన చేయడం దక్షిణ భారత దేశంలోనే రికార్డు కావడం విశేషం.
జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్, గొందేసి పూర్ణచంద్రరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో దేశభక్తి గీతాలాపనలతో ఈ ప్రదర్శన సాగింది. దారి పొడవునా విద్యార్థులు, నగర ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. కార్యక్రమంలో సుమారు 25 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. దేశభక్తిని ప్రబోధించే జ్యోతిని ఈ ర్యాలీలో ప్రదర్శించారు.
కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, హోం మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్‌రామ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పార్టీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, కలెక్టర్ మాధవీలత, నగర పాలక సంస్థ కమిషనర్ దినేష్‌కుమార్ తదితరులు ప్రసంగించారు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు ఆధ్వర్యంలో 1,500 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారు. సుమారు 15 వేల మంది విద్యార్థులు, ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు నగరంలో శుక్రవారం ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్(నీతి ఆయోగ్), స్వామి వివేకానంద ఫౌండేషన్, స్పీక్ నేచర్ లవర్స్, స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో 3 వేల అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో జెడ్పీ బాలుర, బాలికల పాఠశాల విద్యార్థులు, ప్రజా ప్రతినిధుల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.
దేశభక్తిని ప్రేరేపించిన శోభాయాత్ర
75వ స్వాతంత్య్ర దినోత్సవం, అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా అమరావతి బాలోత్సవ్ కమిటీ, అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం, ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్, ఎన్‌జీవో అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ముత్యాలంపాడు అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం నుంచి దుర్గాపురంలోని ఘంటసాల సంగీత కళాశాల వరకు నిర్వహించిన శోభాయాత్ర ఆకట్టుకుంది. నగరానికి చెందిన 75 పాఠశాలల నుంచి దాదాపు వెయ్యి మంది విద్యార్థులు జాతీయ జెండాలు చేతబూని శోభాయాత్రలో పాల్గొన్నారు. విద్యార్థుల జాతీయ నాయకుల వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment