national flags
-
రష్యా, బెలారస్ జాతీయ జెండాలపై నిషేధం
ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో భాగంగా రష్యా, బెలారస్ దేశాల జాతీయ జెండాలపై నిషేధం విధించారు. టోర్నమెంట్‌లోని ఓ టెన్నిస్ కోర్టులో జరిగిన ఘటన ఆధారంగా నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మెల్బోర్న్ పార్క్‌లోకి జాతీయ జెండాలను తీసుకువచ్చేందుకు తొలుత ప్రేక్షకులకు అనుమతి ఇచ్చారు. అయితే ఉక్రెయిన్ ప్లేయర్ కేతరినీ బెయిడా, రష్యా ప్లేయర్ కమిల్లా రఖిమోవా మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొందరు ప్రేక్షకులు రష్యా జెండాలను ప్రదర్శించారు. దీంతో నిర్వాహకులు తక్షణమే ఆ రెండు దేశాల జెండాలపై బ్యాన్ విధించారు. అంతేకాదు తమ ప్లేయర్‌ను రష్యన్లు వేధించినట్లు ఉక్రెయిన్ అభిమానులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని టెన్నిస్ ఆస్ట్రేలియాను కోరారు. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు ఈ రెండు దేశాల జాతీయ జెండాల ప్రదర్శించకుండా నిషేధం విధించింది. చదవండి: షార్ట్ టెంపర్‌కు మారుపేరు.. అభిమానిపై తిట్ల దండకం సంచలనం.. మాజీ వరల్డ్ నెంబర్ వన్‌కు బిగ్‌షాక్ -
Azadi Ka Amrit Mahotsav: 7 రోజుల్లో 450 జాతీయ జెండాలు
పట్నా: 91 ఏళ్ల వృద్ధుడు కేవలం వారం రోజుల్లో ఏకంగా 450 జాతీయ జెండాలను తన కుట్టుమెషీన్‌పై కుట్టాడు. ఈ అరుదైన సంఘటన బిహార్ రాష్ట్రం సుపౌల్ జిల్లా నిర్మాలీలో చోటుచేసుకుంది. లాల్మోహన్ పాశ్వాన్(91) అచ్ఛమైన గాంధేయవాది. దర్జీగా జీవనం సాగిస్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంందర్భంగా ‘హెల్ప్ ఏజ్ ఇండియా’ అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ జాతీయ జెండాల కోసం లాల్మోహన్కు ఆర్డర్ ఇచ్చింది. కేవలం 7 రోజుల్లో 450 జెండాలు కుట్టి హెల్ప్ ఏజ్ ఇండియాకు అందజేశారు. రోజుకు 12 గంటలపాటు పనిచేసి, జెండాలు కుట్టానని లాల్మోహన్ చెప్పారు. జెండాలు కుట్టడాన్ని పవిత్రమైన బాధ్యతగా భావించానని, స్వాతంత్య్ర దినోత్సవ కంటే ముందు రోజే జెండాలను అందజేసినందుకు చాలా గర్వించానని అన్నారు. -
5.2 కిలోమీటర్ల జాతీయ పతాకం
రాజమహేంద్రవరం సిటీ/తణుకు అర్బన్/చిత్తూరు రూరల్/ విజయవాడ కల్చరల్ : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్రంలోని పలు చోట్ల అత్యంత భారీ జాతీయ జెండాలతో ప్రదర్శనలు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో 5.200 కిలోమీటర్ల పొడవున సాగిన జాతీయ పతాక ప్రదర్శన అబ్బురపరచింది. ఇంతటి భారీ పతాకంతో ప్రదర్శన చేయడం దక్షిణ భారత దేశంలోనే రికార్డు కావడం విశేషం. జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్, గొందేసి పూర్ణచంద్రరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో దేశభక్తి గీతాలాపనలతో ఈ ప్రదర్శన సాగింది. దారి పొడవునా విద్యార్థులు, నగర ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. కార్యక్రమంలో సుమారు 25 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. దేశభక్తిని ప్రబోధించే జ్యోతిని ఈ ర్యాలీలో ప్రదర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, హోం మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్‌రామ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పార్టీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, కలెక్టర్ మాధవీలత, నగర పాలక సంస్థ కమిషనర్ దినేష్‌కుమార్ తదితరులు ప్రసంగించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు ఆధ్వర్యంలో 1,500 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారు. సుమారు 15 వేల మంది విద్యార్థులు, ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలో శుక్రవారం ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్(నీతి ఆయోగ్), స్వామి వివేకానంద ఫౌండేషన్, స్పీక్ నేచర్ లవర్స్, స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో 3 వేల అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో జెడ్పీ బాలుర, బాలికల పాఠశాల విద్యార్థులు, ప్రజా ప్రతినిధుల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశభక్తిని ప్రేరేపించిన శోభాయాత్ర 75వ స్వాతంత్య్ర దినోత్సవం, అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా అమరావతి బాలోత్సవ్ కమిటీ, అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం, ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్, ఎన్జీవో అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముత్యాలంపాడు అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం నుంచి దుర్గాపురంలోని ఘంటసాల సంగీత కళాశాల వరకు నిర్వహించిన శోభాయాత్ర ఆకట్టుకుంది. నగరానికి చెందిన 75 పాఠశాలల నుంచి దాదాపు వెయ్యి మంది విద్యార్థులు జాతీయ జెండాలు చేతబూని శోభాయాత్రలో పాల్గొన్నారు. విద్యార్థుల జాతీయ నాయకుల వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
‘పతాక’ స్థాయిలో పొరపాట్లు! జెండాల పంపిణీలో ఫ్లాగ్ కోడ్ ఉల్లంఘనలు
సాక్షి, హైదరాబాద్: మూడు వర్ణాల్లో ఒక్కో వర్ణానిది ఒక్కో సైజు.. రంగులు సరిగ్గా అద్దక మధ్యలో తెల్లటి చారలు.. తెలుపు వర్ణం మధ్యలో ఉండాల్సిన అశోక చక్రం పక్కకు జరగడం.. జెండాలపై చేతి రాతలు.. వెరసి జాతీయ పతాక నియమావళి (ఫ్లాగ్ కోడ్) ఉల్లంఘనలు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 15న ప్రతీ ఇంటిపై ఎగురవేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా జాతీయ జెండాలను పంపిణీ చేస్తుండగా.. చాలామంది ఇలాంటి నాసిరకం జెండాలు అందుకుని విస్మయానికి గురయ్యారు. కొన్నిచోట్ల ఫ్లాగ్ కోడ్‌కు విరుద్ధంగా జెండాలపై స్టాకు వివరాలను రాయడం గమనార్హం. ఫ్లాగ్ కోడ్‌లో నిర్దేశించిన పరిమాణం, రంగులు, డిజైన్‌ను కచ్చితంగా అనుసరిస్తూ జెండాలను తయారు చేయాలి. జాతీయ జెండా తప్పనిసరిగా దీర్ఘచతురస్రాకారంలో ఉండాలి. నిలువు, అడ్డం మధ్య నిష్పత్తి 2:3 ఉండాలి. నిర్దేశిత 9 రకాల సైజుల్లో మాత్రమే జెండాలుండాలి. కాషాయ, తెలుపు, ఆకుపచ్చ వర్ణాలు సమవైశాల్యంలో ఉండాలి. తెలుపు రంగు పట్టీ మధ్యలో అశోకచక్రం ఉండాలి. జెండాపై ఎలాంటి ఇతర రాతలు ఉండొద్దు. కానీ, కొన్ని జెండాల విషయంలో ఈ నిబంధనలన్నింటికీ తూట్లు పొడిచినట్టు ఉంటోంది. నాణ్యత లేని జెండాలు అందుకున్నట్టు సామాజిక మాధ్యమాల్లో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం సరిగ్గా శ్రద్ధ చూపడంలేదని విమర్శిస్తున్నారు. సిరిసిల్ల నుంచి కొనుగోళ్లు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఉచితంగా జాతీయ జెండాలను పంపిణీ చేసేందుకు టెస్కో ఆధ్వర్యంలో 1.2 కోట్ల జెండాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఒక్కో జెండాకు రూ.23 ధరను ఖరారు చేసింది. సిరిసిల్ల చేనేత కార్మికుల నుంచి జెండాల తయారీకి కావాల్సిన 98 శాతం వస్త్రాన్ని కొనుగోలు చేసింది. 60 లక్షల జెండాలను కుట్టే ఆర్డర్‌ను సిరిసిల్ల చేనేత కార్మికులకు ఇవ్వగా, హైదరాబాద్‌లోని ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు మరో 30 లక్షలు; ఖమ్మం, మిర్యాలగూడలోని ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు మిగిలిన జెండాలను కుట్టే ఆర్డర్‌ను టెస్కో ఇచ్చింది. ఒక్కో జెండాను కుట్టడానికి రూ.5 ధరను నిర్ణయించింది. జెండాలను కుట్టే వాళ్లే వస్త్రాన్ని నిర్దేశిత సైజులో కత్తిరించి చేయాల్సి ఉండగా, అడ్డగోలుగా కత్తిరించి కుట్టుతుండటంతోనే సమస్య వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 37 లక్షల జాతీయ జెండాలను పంపిణీ చేశారు. గ్రామాల్లో 30 లక్షలు, పట్టణాల్లో 7 లక్షల జెండాలు పంపిణీ చేశారు. మిగిలినవి ఆగస్టు 15కల్లా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు జెండాల పంపిణీని పర్యవేక్షిస్తున్నాయి. వాటిని పంపిణీ చేయొద్దని ఆదేశించాం భారీ ఎత్తున జాతీయ జెండాల తయారీ సందర్భంగా కొన్ని జెండాలు లోపాలతో వస్తున్నాయి. తయారీ, కుట్టడం, పంపిణీ దశల్లోనే అలాంటి జెండాలను గుర్తించి తొలగిస్తున్నాం. అలాంటి జెండాలను పంపిణీ చేయొద్దని కలెక్టర్లను ఆదేశించాం. –జ్యోతిబుద్ధప్రసాద్, కమిషనర్, టెస్కో -
కాగితపు జెండాలు అంటించుకోవాలా?: హరీశ్
సాక్షి, సిద్దిపేట: స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. జాతీయ జెండాలను అందించలేకపోతున్నామని, కాగితపు జెండాలతో వజ్రోత్సవాలు చేసుకోవాలని మాట్లాడిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నా యని విమర్శించారు. ఇదేనా వజ్రోత్సవాలు జరిపే తీరు, ఇదేనా జాతీయ జెండాకు మీరిచ్చే విలువ అంటూ మండిపడ్డారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం సిద్దిపేట శివారు రంగనాయకసాగర్ సమీపంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీడం పార్కును హరీశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించి తెలంగాణ ప్రభుత్వం 1.20 కోట్ల జెండాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మేకిన్ తెలంగాణ పేరిట జాతీయ జెండాలను తయారు చేసి ఇంటింటికీ అందజేస్తున్నామన్నారు. మహా త్మాగాంధీని అవమానపరుస్తూ.. గాడ్సేను పొగిడే సంస్థలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రం అలాంటి సంస్థలపై చర్యలు తీసుకోవడం లేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భావి భారత పౌరులకు దేశభక్తిని పెంపొందించేలా, దేశభక్తి చాటేలా స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను 570 సినిమా టాకీసుల్లో ప్రదర్శిస్తున్నామని హరీశ్ చెప్పారు. కాగా, ఫ్రీడమ్ పార్క్‌లో వజ్రోత్సవాల్లో భాగంగా 75 అని మొక్కలతో ఏర్పాటు చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. -
ఆగస్టు 13–15 వరకు 25 కోట్ల జాతీయ జెండాల ఆవిష్కరణ
కాచిగూడ: దేశవ్యాప్తంగా ఆగష్టు 13, 14, 15 తేదీల్లో 25 కోట్ల జాతీయ జెండాలను ఎగురవేయనున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఉడిపి శ్రీ పేజావర మఠాధీశుల 35వ చాతుర్మాస దీక్షలో భాగంగా ఉడిపి పేజావర ఫీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ నగరానికి వచ్చిన సందర్భంగా శనివారం బర్కత్‌పురలో స్వామీజీని కలిసి కిషన్‌రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా దేశంలోని ప్రజలు స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టేందుకు సమరశీలంగా స్వాతంత్య్ర ఉద్యమం సాగిందని ఆయన గుర్తుచేశారు. దేశంలోని ప్రజలంతా వాడవాడల్లో, వీధుల్లో జాతీయ జెండాలను ఎగురవేయాలని కోరారు. -
కాగితపు జాతీయ పతాకాలనే వినియోగించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ జాతీయ దినోత్సవాలు, క్రీడలు, సాంస్కృతిక దినోత్స వాలను పురస్కరించుకుని అలంకరణ కోసం వినియోగించే జాతీయ పతాకాలను కాగితం తో తయారు చేసిన వాటినే ఉపయోగించాలని ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా–2002 (2021 సవరణ) స్పష్టం చేస్తోంది. జాతీయ పతాకం గౌరవాన్ని కాపాడేలా కాగితపు పతాకాలను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు, పోలీసు విబాగాధిపతులకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాస్టిక్‌తో రూపొం దించిన జెండాలను తొలగించి డిస్పోజ్ చేసే క్రమం కాస్త కఠినంగా ఉందని, అందువల్లే కాగితపు జెండాలను వాడితే గౌరవ ప్రదంగా వాటిని డిస్పోజ్ చేయవచ్చని అందులో పేర్కొన్నారు. వి విధ సంస్థలు, యాజమాన్యాలు జెండా కార్యక్రమం ముగి సిన తర్వాత తొలగించేటప్పుడు జాతీయ పతాక గౌర వాన్ని భంగం కలిగించకుండా చర్యలు తీసుకోవాలని, జా తీయ పతాక నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. -
పంద్రాగస్టు : ప్లాస్టిక్ జెండా ఎగరేయొద్దు
సాక్షి, న్యూఢిల్లీ : ప్లాస్టిక్‌తో తయారు చేసిన జాతీయ జెండాను ఉపయోగించరాదని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టూ నేషనల్ ఆనర్ యాక్ట్ 1971, ప్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 ప్రకారం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్లాస్టిక్ జెండాల బదులు పేపర్‌తో తయారు చేసిన జెండాలనే ఉపయోగించాలని సూచించారు. పేపర్ జెండాలను కూడా కార్యక్రమం ముగిసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేయరాదని ఆదేశించారు. జెండాను అవమానించే రీతిలో ప్రవర్తించరాదని, అది దేశ ప్రజల ఆశయాలకు, ఆశలకు ప్రతిరూపమని హోంశాఖ పేర్కొంది. కార్యక్రమం అనంతరం పేపర్ జెండాలను కూడా జాగ్రత్తగా, అవమానం కలగని రీతిలో ఉంచాలని సూచించారు. -
ప్లాస్టిక్ జాతీయ జెండాల తయారీపై నిషేధం !
న్యూఢిల్లీ: ప్లాస్టిక్ భారత జాతీయ పతాకాల తయారీతో పాటు విక్రయాలను నిషేధించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారి శనివారం న్యూఢిల్లీలో వెల్లడించారు. రిపబ్లిక్ డే దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రహదారులతోపాటు వేడుకల్లో విరివిగా కనిపించే ప్లాస్టిక్ త్రివర్ణ పతాకాలపై ప్రభుత్వానికి పలు ఫిర్యాదు అందాయి. అయితే ప్లాస్టిక్ జాతీయ జెండాల తయారీ... విక్రయాలపై ఏలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలంటూ ఈ ఏడాది మే మాసంలో ముంబై హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఇలాంటి ఆలోచనలోనే ఉన్నట్లు హైకోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాకుండా ఈ అంశంపై సమగ్ర విధానానికి శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొంది. అందులోభాగంగా జాతీయ గీతం, ప్రతిజ్ఞ వలే జాతీయ జెండాను కూడా పాఠశాల పుస్తకాలపై ముద్రించి ప్రజలకు అవగాహాన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. ప్లాస్టిక్ జాతీయ త్రివర్ణ పతాకాల తయారీ.... విక్రయాలపై నిషేధం విధించాలనుకుంటున్నట్లు ముంబై హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఇదే అంశంపై వివరణ ఇచ్చింది.