సాక్షి, హైదరాబాద్: మూడు వర్ణాల్లో ఒక్కో వర్ణానిది ఒక్కో సైజు.. రంగులు సరిగ్గా అద్దక మధ్యలో తెల్లటి చారలు.. తెలుపు వర్ణం మధ్యలో ఉండాల్సిన అశోక చక్రం పక్కకు జరగడం.. జెండాలపై చేతి రాతలు.. వెరసి జాతీయ పతాక నియమావళి (ఫ్లాగ్ కోడ్) ఉల్లంఘనలు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 15న ప్రతీ ఇంటిపై ఎగురవేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా జాతీయ జెండాలను పంపిణీ చేస్తుండగా.. చాలామంది ఇలాంటి నాసిరకం జెండాలు అందుకుని విస్మయానికి గురయ్యారు.
కొన్నిచోట్ల ఫ్లాగ్ కోడ్‌కు విరుద్ధంగా జెండాలపై స్టాకు వివరాలను రాయడం గమనార్హం. ఫ్లాగ్ కోడ్‌లో నిర్దేశించిన పరిమాణం, రంగులు, డిజైన్‌ను కచ్చితంగా అనుసరిస్తూ జెండాలను తయారు చేయాలి. జాతీయ జెండా తప్పనిసరిగా దీర్ఘచతురస్రాకారంలో ఉండాలి. నిలువు, అడ్డం మధ్య నిష్పత్తి 2:3 ఉండాలి. నిర్దేశిత 9 రకాల సైజుల్లో మాత్రమే జెండాలుండాలి.
కాషాయ, తెలుపు, ఆకుపచ్చ వర్ణాలు సమవైశాల్యంలో ఉండాలి. తెలుపు రంగు పట్టీ మధ్యలో అశోకచక్రం ఉండాలి. జెండాపై ఎలాంటి ఇతర రాతలు ఉండొద్దు. కానీ, కొన్ని జెండాల విషయంలో ఈ నిబంధనలన్నింటికీ తూట్లు పొడిచినట్టు ఉంటోంది. నాణ్యత లేని జెండాలు అందుకున్నట్టు సామాజిక మాధ్యమాల్లో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం సరిగ్గా శ్రద్ధ చూపడంలేదని విమర్శిస్తున్నారు.
సిరిసిల్ల నుంచి కొనుగోళ్లు
రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఉచితంగా జాతీయ జెండాలను పంపిణీ చేసేందుకు టెస్కో ఆధ్వర్యంలో 1.2 కోట్ల జెండాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఒక్కో జెండాకు రూ.23 ధరను ఖరారు చేసింది. సిరిసిల్ల చేనేత కార్మికుల నుంచి జెండాల తయారీకి కావాల్సిన 98 శాతం వస్త్రాన్ని కొనుగోలు చేసింది. 60 లక్షల జెండాలను కుట్టే ఆర్డర్‌ను సిరిసిల్ల చేనేత కార్మికులకు ఇవ్వగా, హైదరాబాద్‌లోని ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు మరో 30 లక్షలు; ఖమ్మం, మిర్యాలగూడలోని ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు మిగిలిన జెండాలను కుట్టే ఆర్డర్‌ను టెస్కో ఇచ్చింది.
ఒక్కో జెండాను కుట్టడానికి రూ.5 ధరను నిర్ణయించింది. జెండాలను కుట్టే వాళ్లే వస్త్రాన్ని నిర్దేశిత సైజులో కత్తిరించి చేయాల్సి ఉండగా, అడ్డగోలుగా కత్తిరించి కుట్టుతుండటంతోనే సమస్య వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 37 లక్షల జాతీయ జెండాలను పంపిణీ చేశారు. గ్రామాల్లో 30 లక్షలు, పట్టణాల్లో 7 లక్షల జెండాలు పంపిణీ చేశారు. మిగిలినవి ఆగస్టు 15కల్లా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు జెండాల పంపిణీని పర్యవేక్షిస్తున్నాయి.
వాటిని పంపిణీ చేయొద్దని ఆదేశించాం
భారీ ఎత్తున జాతీయ జెండాల తయారీ సందర్భంగా కొన్ని జెండాలు లోపాలతో వస్తున్నాయి. తయారీ, కుట్టడం, పంపిణీ దశల్లోనే అలాంటి జెండాలను గుర్తించి తొలగిస్తున్నాం. అలాంటి జెండాలను పంపిణీ చేయొద్దని కలెక్టర్లను ఆదేశించాం.
–జ్యోతిబుద్ధప్రసాద్, కమిషనర్, టెస్కో
Comments
Please login to add a commentAdd a comment