ప్లాస్టిక్ జాతీయ జెండాల తయారీపై నిషేధం !
న్యూఢిల్లీ: ప్లాస్టిక్ భారత జాతీయ పతాకాల తయారీతో పాటు విక్రయాలను నిషేధించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారి శనివారం న్యూఢిల్లీలో వెల్లడించారు. రిపబ్లిక్ డే దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రహదారులతోపాటు వేడుకల్లో విరివిగా కనిపించే ప్లాస్టిక్ త్రివర్ణ పతాకాలపై ప్రభుత్వానికి పలు ఫిర్యాదు అందాయి.
అయితే ప్లాస్టిక్ జాతీయ జెండాల తయారీ... విక్రయాలపై ఏలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలంటూ ఈ ఏడాది మే మాసంలో ముంబై హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఇలాంటి ఆలోచనలోనే ఉన్నట్లు హైకోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాకుండా ఈ అంశంపై సమగ్ర విధానానికి శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొంది.
అందులోభాగంగా జాతీయ గీతం, ప్రతిజ్ఞ వలే జాతీయ జెండాను కూడా పాఠశాల పుస్తకాలపై ముద్రించి ప్రజలకు అవగాహాన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. ప్లాస్టిక్ జాతీయ త్రివర్ణ పతాకాల తయారీ.... విక్రయాలపై నిషేధం విధించాలనుకుంటున్నట్లు ముంబై హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఇదే అంశంపై వివరణ ఇచ్చింది.